Saturday, March 27, 2010

'చిన్న'తరహా ఉపశమనం

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: విద్యుత్‌ కోతల నుంచి చిన్నతరహా పరిశ్రమలకు కొద్దిగా ఉపశమనం లభించనుంది. పరిశ్రమలకు విధిస్తున్న వారానికి రెండు రోజుల 'పవర్‌ హాలిడే'లో చిన్నతరహా పరిశ్రమలకు కొంత మినహాయింపు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పరిశ్రమలకు ఆ రెండు రోజుల్లో ఒక షిఫ్ట్‌ (8గంటలు)ను కోత నుంచి మినహాయించాలని ముఖ్యమంత్రి రోశయ్య శుక్రవారం విద్యుత్‌శాఖ అధికారులకు ఆదేశించారు. శనివారం నుంచే దీన్ని అమలు చేయాలని కోరారు. తదనుగుణంగా విద్యుత్‌ పంపిణీ సంస్థలు సరఫరా వేళలను సవరించనున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై సీఎం శుక్రవారం సమీక్షించారు. పరిశ్రమలు నేరుగా విద్యుత్‌ కొనుగోలు చేసుకోవడానికి వీలుగా 'ఓపెన్‌ యాక్సిస్‌' విధానాన్ని త్వరగా అమలుచేయాలని అధికారులకు సూచించారు. వ్యవసాయానికి రోజుకు 7 గంటల విద్యుత్‌ ఇవ్వాలని, తాగునీటి పథకాలకు ఇబ్బంది రాకూడదని ఆదేశించారు. రాత్రిపూట విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండేటట్లు చూడాలన్నారు. కైగా అణువిద్యుత్‌ కేంద్రం నుంచి రోజుకు 17మి. యూనిట్ల విద్యుత్‌ అందుబాటులోకి వచ్చిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.