Thursday, March 25, 2010

మరో 'పెట్రో పోటు'

యూరో-4 పేరుతో వినియోగదారులకు షాక్
పెట్రోలుపై 41 పైసలు, డీజిల్‌పై 26 పైసల పెంపు

న్యూఢిల్లీ : నిన్న కాక మొన్న బడ్జెట్‌లో సుంకాల సవరణ, ఉద్దీపనల ఉపసంహరణతో పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ప్రభుత్వం ఆ షాక్ నుంచి వినియోగదారులు ఇంకా కోలుకోకుండానే మరో భారం మోపేందుకు సమాయత్తం అవుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌లతో సహా దేశంలోని మొత్తం 13 నగరాల్లో పెట్రోల్ ధరలు పెరగనున్నాయి.

ఆయిల్ శాఖ కార్యదర్శి ఎస్.సుందరేశన్ బుధవారం ఇక్కడ ఈ విషయం తెలుపుతూ యూరో 4 ప్రమాణాలతో కూడిన మరింత పరిశుద్ధమైన పెట్రోల్, డీజిల్ తయారుచేయడానికి వీలుగా తమ ప్లాంట్లను ఆధునికీకరించడానికి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసి) 40 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టాయని. ఈ భారాన్ని వినియోగదారులకు పంచక తప్పదని అన్నారు. అంతర్జాతీయ ధరల కన్నా తక్కువ ధరలకు పెట్రోల్, డీజిల్ సరఫరా చేయడం వల్ల ఒఎంసిలు ప్రస్తుతం లీటర్ పెట్రోల్‌పై 6 రూపాయలు, డీజిల్‌పై 4.06 రూపాయలు నష్టపోతున్నాయంటూ యూరో 4 ప్రమాణాల భారం దానికి జత కాకుండా ఉండాలంటే ఆ భారాన్ని వినియోగదారులు భరించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఎంపిక చేసిన 13 నగరాలు తప్పించి దేశంలోని ఇతర ప్రాంతాలన్నింటిలోను యూరో 3 ప్రమాణాలతో కూడిన పెట్రోల్, డీజిల్‌నే సరఫరా చేస్తారని ఆయన చెప్పారు. యూరో 4 ప్రమాణాలకు మారుతున్న ఈ 13 నగరాలతో పాటు యూరో 2 ప్రమాణాల నుంచి యూరో 3 ప్రమాణాలకు మారుతున్న ప్రాంతాల్లో కూడా స్వల్పంగా అయినా ధర పెంచాలని తాము కోరుతున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే ఈ పెంపుదల ఎంత మేరకు ఉంటుందన్నది ఆయన చెప్పలేదు.

ఆటో ఇంధనాలు, వంట గ్యాస్‌లను ఉత్పాదక ధరల కన్నా తక్కువకు విక్రయిస్తున్నందుకు ఒఎంసిలు ఈ ఏడాది 47,960 కోట్ల రూపాయలు నష్టపోతుండగా వచ్చే ఏడాది అది 70 వేల కోట్లకు పెరగనున్నదని సుందరేశన్ చెప్పారు. కొన్ని కఠోరమైన నిర్ణయాలు తీసుకోకపోతే ఈ నష్టాలు మరింతగా పెరిగే ప్రమాదం ఉన్నదని కూడా ఆయన అన్నారు. పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్న వాదాన్ని తోసి పుచ్చుతూ సబ్సిడీల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ధరల పెరుగుదలకు కారణం అవుతున్నాయని చెప్పారు.

ఒఎన్‌జిసి వంటి ఆయిల్ ఉత్పత్తి కంపెనీలు రిటైలర్ల భారాన్ని కొంత వరకు మోస్తున్నాయని, కాని ఎంతకాలం ఆ కంపెనీలు మాత్ర ం ఈ భారాన్ని మోస్తాయని ఆయన ప్రశ్నించారు. అలాగే ఎల్‌పిజి, కిరోసిన్ వంటి వంట ఇంధనాలకు ప్రభుత్వం సబ్సిడీ అందించడానికి కూడా ఒక పరిమితి ఉంటుందని ఆయన అన్నారు.