Friday, March 26, 2010

ఖజానాకు అదనపు 'కిక్కు'!

పేదలు తాగే మద్యంపై గురి
అదనంగా ఉత్పత్తికి
డిస్టిలరీలకు అనుమతి
దొడ్డిదారిన రూ.600 కోట్ల ఆదాయం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడుతున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం వారి బలహీనతపై దెబ్బకొట్టి డబ్బులు పిండుకుంటోంది. ఒకవైపు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతూ మరోవైపు వారి ఆరోగ్యాన్ని కొల్లగొడుతోంది. కేవలం రూ.20కే నెలకుపది కిలోల బియ్యం ఇస్తున్నామని గొప్పగా ప్రకటిస్తూ పరోక్షంగా రూ.వందల కోట్లు వారు తాగే మద్యం ద్వారా ఆర్జిస్తోంది. రాష్ట్రంలో నీటికి కొరత ఉన్నా మద్యానికి మాత్రం ఎటువంటి కొరత లేకుండా చేస్తోంది. పేదలు ఎక్కువగా తాగే లిక్కర్‌ను అదనంగా ఉత్పత్తి చేసేందుకు ఉదారంగా అనుమతించింది. తద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 600 కోట్ల మేర అదనంగా ఆదాయం ఆర్జించేందుకు సిద్ధమైంది.

ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మద్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. కొత్త పన్నులు వేయట్లేదంటూనే అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతించి దొడ్డిదారిన భారం వేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత ఐదు నెలల కాలంలో 2.55 కోట్ల ప్రూఫ్‌ లీటర్ల మేర అదనంగా మద్యం ఉత్పత్తి చేసుకునేందుకు డిస్టిలరీలకు అనుమతించింది. గత నవంబరులో 1.12 కోట్ల ప్రూఫ్‌ లీటర్లు, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నాటికి మరో 1.43 కోట్ల ప్రూఫ్‌ లీటర్ల మద్యం అదనంగా ఉత్పత్తి చేసుకునే వీలు కల్పించింది. 2.55 కోట్ల ఫ్రూఫ్‌ లీటర్ల ద్వారా సుమారు 38 లక్షల కేసుల మద్యం ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వీటి విక్రయాల ద్వారా ప్రభుత్వానికి రూ.600 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

ఒక్కో కేసుపై రూ.1550 ఆదాయం: ప్రభుత్వం కేసుకు రూ.450 లోపు ధర ఉన్న మద్యాన్ని మాత్రమే అదనంగా ఉత్పత్తి చేసేందుకు అనుమతించింది. ఉత్పత్తి విలువ రూ.400 ఉన్న కేసు మద్యంపై ఎక్సైజ్‌ డ్యూటీ, అమ్మకం పన్ను, ఏపీబీసీఎల్‌ మార్జిన్‌, అదనపు ట్రేడ్‌ మార్జిన్‌ కలిసి అది రూ.1949కి చేరుతోంది. ఇందులో కేసు మద్యం ఉత్పత్తి విలువ రూ.400 తీసివేస్తే ప్రభుత్వానికి ఒక్కో కేసుద్వారా రూ.1549 ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో 38 లక్షల కేసుల అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిచ్చింది. అంటే ప్రభుత్వం సుమారు రూ.600 కోట్లు ఆర్జించనుందన్నమాట.

స్పిరిట్‌ ఎగుమతిపై మరో ఏడాది నిషేధం
స్పిరిట్‌ ఎగుమతులపై మరో ఏడాది నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. రెక్టిఫైడ్‌ స్పిరిట్‌, ఎక్స్‌ట్రా న్యూట్రల్‌ ఆల్కహాల్‌, ఇంప్యూర్‌ స్పిరిట్‌లపై ప్రభుత్వం గతంలో కూడా నిషేధం విధించింది. తాజాగా వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకూ ఈ నిషేధాన్ని పొడిగించారు. ధాన్య ఆధారిత స్పిరిట్‌ను మాత్రం ఉత్పత్తిలో 50 శాతం ఎగుమతి చేసుకునేందుకు అనుమతించారు.