Wednesday, March 24, 2010

ప్రభుత్వ లక్ష్యం ఆచరణ సాధ్యమే

ప్రధాని మన్మోహన్‌ వ్యాఖ్యపై పరిశ్రమ వర్గాల హర్షం
న్యూఢిల్లీ: రానున్న పంచవర్ష ప్రణాళిక కాలానికి మౌలిక రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో పాలుపంచుకొనేందుకు ప్రైవేటు రంగానికి కూడా తగిన తోడ్పాటు ఇవ్వాలని పరిశ్రమవర్గాలు ప్రభుత్వాన్ని కోరాయి. దేశం 10% వృద్ధిని అందిపుచ్చుకోవాలంటే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో మౌలిక రంగం పెట్టుబడులు ట్రిలియన్‌ డాలర్ల (రూ.41 లక్షల కోట్ల) స్థాయికి పెరగాల్సిన అవసరం ఉందని ప్రధాని మన్మోహన్‌ వ్యాఖ్యానించడంపై పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తంచేశాయి. ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ విస్తరణ తీరు దేశంలోని మౌలిక రంగంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తోందని, ఈ రంగానికి వాస్తవానికి భారీగా నిధులు అవసరమని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ తెలిపింది. ప్రభుత్వం ఇంతటి భారీ స్థాయిలో నిర్దేశించుకున్న లక్ష్యపు కార్యాచరణలో ప్రభుత్వం, ప్రైవేటు సంస్థల భాగాస్వామం ఆవశ్యకతపై సర్కారు మరోమారు దృష్టి సారించినట్లుందని ఫిక్కీ ప్రధాన కార్యదర్శి అమిత్‌మిత్రా అన్నారు. రహదారులు, పలు విమానాశ్రయాల అభివృద్ధిలో ప్రైవేటు సంస్థలు ఇప్పటికే కీలక పాత్ర పోషిస్తున్నాయని అసోచామ్‌ తెలిపింది. దేశంలక్ష్యంగా పెట్టుకున్న నిర్వహణీయమైన రెండంకెల వృద్ధి సాధనకు సామాజిక, ప్రగతి ఆధారిత మౌలిక వృద్ధి అవసరమని అసోచామ్‌ అభిప్రాయపడింది. మౌలికరంగం విషయంలో ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యం ఆచరణ సాధ్యమైందేనని పరిశ్రమల విభాగం పీహెచ్‌డీసీసీఐ వ్యాఖ్యానించింది. అయితే ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన ప్రోత్సాహకాలను ప్రభుత్వం కల్పించాలని కోరింది. పెట్టుబడులపై దీర్ఘకాలం వరకు ఎలాంట ఆదాయం రాదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రోత్సాహకాలు ఇవ్వాలని సమాఖ్య సూచించింది.