ఏప్రిల్ నుంచి కొత్త ప్రమాణాలు
మళ్లీ పెరగనున్న ధరలు

ప్రస్తుతం విక్రేతల వద్ద ఎక్కువగా పాత బీఎస్-IIIకాలుష్య ప్రమాణాలతో కూడిన వాహనాలు ఉన్నాయి. ఏప్రిల్ నుంచి కొత్త ప్రమాణాలు అమలులోకి రానుండడంతో ఈతరహా వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లను ఆయా ప్రధాన నగారాల్లో ప్రభుత్వం నిలిపి వేయనుంది. వాహన సంస్థల అమ్మకాల్లో సుమారు సగానికి పైగా విక్రయాలు 13 ప్రధాన నగరాల్లోనే జరుగుతాయి. దీంతో డీలర్లు ఈపాత స్టాక్‌ను వీలైనంత తొందరగా అమ్మేసి సరికొత్త ప్రమాణాలతో కూడిన బీఎస్ IV వాహనాల కాంట్రాక్టులు కుదుర్చుకునేందుకు సమాయత్తం అవుతున్నారు. ఇందుకోసం వారు డిస్కౌంట్లను మార్గంగా ఎంచుకుంటున్నారు. అమ్మకాలు పెంచుకొనేందుకు వీరు ఎక్కువ మొత్తంలో రాయితీలు ఇస్తున్నారు. పోయిన ఏడాది ఇదే కాలంలో ఇచ్చిన డిస్కౌంట్‌ల కన్నా సుమారు 10 నుంచి 15 శాతం అధికంగా వినియోగదారులకు రాయితీలను ఇస్తున్నారు. చిన్న కార్లపై డిస్కౌంట్లు సుమారు రూ.10,000 -15,000 మేర ఉంటున్నాయి. బీఎస్ IV ప్రమాణాల అమలులోకి వచ్చేందుకు ఇంకా కేవలం ఆరు రోజులే ఉండడంతో ఈవాహనాలపై డీలర్లు డిస్కౌంట్లను మరింతగా పెంచే అవకాశం కూడా ఉన్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ ఒకటి కన్నా ముందు కార్లను కొని, రిజిస్ట్రేషన్‌కు దాఖలు చేసుకున్న వారికి కొత్త బీఎస్ IV ప్రమాణాలతో ఎక్కువగా సమస్యలేవీ వచ్చే అవకాశం లేకపోవడంతో వినియోగదారులు కూడా ఈదిశగా ఆలోచిస్తున్నారు.
మరోమారు వడ్డింపు.. జనవరి నంచి ఇప్పటి వరకుముచ్చటగా మూడోసారి కార్ల ధరలు పెరగనున్నాయి. జనవరిలో తయారీ భారం కారణంగా ధరలు పెంచిన సంస్థలు పోయిన నెలలో బడ్జెట్ కోతల వల్ల ధరలను పెంచేసిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తగా కాలుష్య ప్రమాణాలు, తయారీ ఖర్చులు పెరగడం కారణంగా దేశంలోని దాదాపు అన్ని వాహన సంస్థలు కార్ల ధరలను 1-3 శాతం మేర పెంచేందుకు సమాయత్తం అవుతున్నాయి. చిన్న కార్లపై పెంపు రూ.2,000 నుంచి విలాసవంతమైన కార్లపై రూ.71,000 వరకు ఉండనున్నట్లు సమాచారం. కొత్త కాలుష్య ప్రమాణాలకు తగ్గట్లు వాహనాలను రూపొందించేందుకు ఇంజినీరింగ్ పరంగా మార్పులు అవసరమవుతాయని ఇందుకోసం భారీగా ఖర్చు చేస్తున్నందున ధరలు పెంచాల్సి వస్తుందని వారు చెబుతున్నారు.
1-3% ప్రియం!: ధరలను 1-1.5 శాతం పెంచనున్నట్లు జనరల్ మోటార్స్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సంస్థ కొత్తగా విడుదల చేసిన క్రూజ్, బీట్‌లు మినహా అన్ని రకాల వాహనాలపై పెంపు ఉండనున్నట్లు ఆయన తెలిపారు. మరోవైపు టయోటా కూడా 2-3% వరకు ధరలు పెంచే యోచనలో ఉంది. హ్యుందాయ్ మోటర్ ఇండియా సంస్థ కూడా డీజిల్ వాహనాల ధరలను 3 శాతం వరకు, పెట్రోలుతో వాహనాల ధరలను ఒక శాతం నుంచి 2 శాతం వరకు పెంచేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మారుతీ కూడా ధరల పెంపు గురించి ప్రత్యక్షంగా చెప్పన్పటికీ తయారీ భారం పెరుగుతోందని చెబుతోంది.
ధరలు పెంచుతాం..టాటా మోటార్స్: తయారీ ఖర్చలు పెరగడం, కొత్త కాలుష్య చట్టాల కారణంగా ఏప్రిల్1 నుంచి కార్ల ధరలను పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్రయాణ కార్ల విభాగం ప్రెసిడెంట్ రాజీవ్ దూబే తెలిపారు. పెంపు ఎంత మొత్తంలో ఉండేది ఆయన వెల్లడించలేదు. ఈపెంపు వల్ల అమ్మకాలపై స్వల్పకాలంలో ప్రభావం ఉంటుందని దీర్ఘకాలంలో ఇది తగ్గుతుందని ఆయన అన్నారు. గురువారం ఆయన న్యూఢిల్లీలో జేఎల్‌ఆర్ షోరూమ్‌ను ప్రారంభించారు. దేశంలో ఇది రెండో జేఎల్‌ఆర్ షోరూమ్. రానున్న ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్‌తో సహా మరో నాలుగు నగరాల్లో ఇలాంటి షోరూమ్‌లను తెరవనున్నట్లు ఆయన వివరించారు.