Thursday, March 25, 2010

విశాఖ ఐటీకి వూతం

వచ్చే నెలలో మైక్రోసాఫ్ట్‌ బృందం పర్యటన
ఉచిత సాఫ్ట్‌వేర్‌పై హామీ
త్వరలో స్పెయిన్‌ వాణిజ్య ప్రతినిధులు
బ్రిటన్‌ బృందం నుంచీ హామీ
విశాఖపట్నం- న్యూస్‌టుడే
విశాఖపట్నం ఐటీ ప్రపంచం దృష్టిలో పడింది. మొన్న ఐబీఎం వచ్చింది. మైక్రోసాఫ్ట్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆ తర్వాత బ్రిటన్‌కు చెందిన ఉన్నతస్థాయి వాణిజ్య ప్రతినిధి బృందం ఇక్కడి ఐటీ కంపెనీల్ని చూసి వెళ్లింది. మైక్రోసాఫ్ట్‌ బృందం తిరిగి ఏప్రిల్‌ మూడో వారంలో నగరానికి వస్తోంది. ఈ దఫా స్థానిక ఐటీ కంపెనీలతో అవగాహన కుదర్చుకునేందుకు వస్తున్నట్లు తెలిసింది. విశాఖ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఏయూ విద్యార్థులకు ఇస్తున్న విధంగానే తమ ఉద్యోగులకూ సాఫ్ట్‌వేర్‌లు ఉచితంగా అందజేయాలని మైక్రోసాఫ్ట్‌ను వైజాగ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (విటా) కోరింది. మైక్రోసాఫ్ట్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉచితంగా ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. దీనికి మైక్రోసాఫ్ట్‌ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు సమాచారం.

బ్రిటన్‌ బృందం ఆసక్తి..!: ఇటీవల బ్రిటన్‌ డిప్యూటీ హైకమిషనర్‌ రిచర్డ్‌హైడ్‌ విశాఖను సందర్శించడం కూడా ఐటీ కంపెనీల్లో ఉత్సాహం నింపింది. ఆయనతో పాటు ఉన్నతస్థాయి వాణిజ్య ప్రతినిధుల బృందం కూడా వచ్చింది. వీరు మధురవాడ ఐటీ సెజ్‌లో స్థానిక కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తమ దేశానికి చెందిన చిన్న, మధ్య తరహా(ఎస్‌ఎంఈ)ఐటీ కంపెనీలకు, విశాఖలోని ఎస్‌ఎంఈ ఐటీ కంపెనీలకు మధ్య వ్యాపార లావాదేవీలు విస్తరింపజేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని బ్రిటన్‌ బృందం హామీ ఇచ్చింది. అదే క్రమంలో త్వరలో విశాఖను సందర్శించేందుకు స్పెయిన్‌ వాణిజ్య ప్రతినిధి బృందం సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

అగ్రశ్రేణి కంపెనీలతో సదస్సు: విశాఖలో మానవ వనరుల లభ్యత, ఇతర వసతులపై అవగాహన కల్పించేందుకు త్వరలో ఒక విస్తృత స్థాయి సదస్సు (టెక్నాలజీ కాన్ఫరెన్స్‌) నిర్వహించేందుకు వీటీ, ఎస్‌టీపీఐ సన్నాహాలు చేస్తున్నాయి. దీనికి అగ్రశ్రేణి ఐటీ కంపెనీలన్నిటినీ రప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. గత సంవత్సరం విశాఖ నుంచి రూ.500 కోట్ల ఐటీ ఎగుమతులు జరిగాయి. ఈ ఏడాది దాన్ని రూ.900 కోట్లకు, వచ్చే 5-10 సంవత్సరాల్లో దీన్ని రూ.10 వేల కోట్లకు పెంచడం లక్ష్యంగా వీటా కృషి చేస్తోంది.

ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం కావాలి..!: విశాఖలో చిన్న, మధ్యతరహా ఐటీ కంపెనీలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం అంటూలేకపోవడం. భారీ మొత్తం వెచ్చించి భూములు కొనుక్కుని, భవనం నిర్మించి, మౌలిక వసతులు సమకూర్చుకునే స్థోమత ఎస్‌ఎంఈ ఐటీ కంపెనీలకు లేదు. అదే ఇన్‌క్యుబేషన్‌ సెంటర్‌ ఉంటే దానిలో నేరుగా కార్యకలాపాలు మొదలుపెట్టే అవకాశం ఉంటుంది. అయిదు ఎకరాల్లో ఇన్‌క్యుబేషన్‌ కేంద్రం ఏర్పాటు చేసినా 100 కంపెనీలకు ప్రవేశం కల్పించవచ్చునని విటా ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆ దిశగా వెంటనే తగిన కృషి చేయాలనీ కోరుతున్నారు.