Tuesday, March 30, 2010

బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి మౌలిక కంపెనీ ఏర్పాటు!

అంచనా వ్యయం రూ.18,000 కోట్లు
గ్రామీణ ఇంటర్నెట్‌ సేవల కోసమే
అత్యున్నత స్థాయీ సంఘం సిఫారసు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి ఒక మౌలిక రంగ కంపెనీని ఏర్పాటు చేయాలని అత్యున్నత స్థాయీ సంఘం ఒకటి సూచించింది. యూనివర్సల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ ఫండ్‌(యూఎస్‌ఓఎఫ్‌) ద్వారా రూ.18,000 కోట్లను సమకూర్చడం ద్వారా గ్రామీణ భారతంలో అధిక వేగం గల ఇంటర్నెట్‌ సేవలను కల్పించాలని ఆ కమిటీ కోరింది. గ్రామీణ టెలికాం నెట్‌వర్క్‌కు ఆర్థిక సహాయం చేయడానికి టెలికమ్యూనికేషన్ల విభాగం(డాట్‌) ఏర్పాటు చేసిందే ఈ యూఎస్‌ఓఎఫ్‌. కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఏర్పాటు చేసిన మంత్రిత్వ కమిటీ తయారుచేసిన 'బ్రాడ్‌బ్యాండ్‌ ఫర్‌ ఆల్‌ యాన్‌ ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ ఫర్‌ రూరల్‌ ఏరియాస్‌' నివేదికలో ఈ సూచనలు చేసింది. మొత్తం 2.5 లక్షల గ్రామాలను 2 ఎమ్‌బీపీఎస్‌ కేబుళ్ల(5లక్షల కి.మీ మేర) ద్వారా కలపాలన్న కమిటీ సిఫారసుపై చర్చించడానికి టెలికాం కార్యదర్శి పి.జె. థామస్‌ ఇటీవలే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమావేశంలో ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలతో ఒక పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని యూఎస్‌ఓఎఫ్‌ అడ్మినిస్ట్రేటర్‌ను కోరారు. కాగా, తుది నిర్ణయం తీసుకోవడానికి మంత్రుల బృందం ఏర్పాటు చేయాల్సిందిగా కూడా సూచించింది.