Monday, March 29, 2010

షేర్‌ సర్టిఫికెట్లు బదిలీ చేయకపోవడం సేవాలోపమే

షేర్‌ సర్టిఫికెట్లు
బదిలీ చేయకపోవడం సేవాలోపమే
సకాలంలో షేర్‌ సర్టిఫికెట్లను బదిలీ చేయని కారణంగా వాటిల్లిన నష్టానికి పరిహారం చెల్లించాల్సిందిగా సదరు కంపెనీని వినియోగదారుల న్యాయస్థానం ఆదేశించిన ఉదంతం ఇది..

కంపెనీ పేరు: యాడ్వెంట్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌
ఫిర్యాదుదారులు: వి.ఆర్‌.కణ్నన్‌ తదితరులు
న్యాయస్థానం: జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం, న్యూఢిల్లీ

బాధితులు 1997లో యాడ్వెంట్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ షేర్లను స్టాక్‌ మార్కెట్లో కొన్నారు. అదే ఏడాది వాటిని తమ పేరిట బదిలీ చేయాల్సిందిగా సదరు కంపెనీని అభ్యర్థించారు. కానీ, కంపెనీ ఆ పని చేయలేదు. తరువాత కూడా పదేపదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. 2000వ సంవత్సరంలో ఆ కంపెనీ షేర్ల ధరలు పతనమయ్యాయి. తమకు జరిగిన నష్టంపై వారు చెన్నై దక్షిణ జిల్లా ఫోరమ్‌ను ఆశ్రయించారు. సేవా లోపం జరిగినట్లు గుర్తించిన ఫోరమ్‌, బాధితులకు వాటిల్లిన నష్టాలకుగాను రూ.1.49 లక్షలు, పరిహారం కింద రూ.25,000, కేసు ఖర్చుల కింద మరో రూ.1,000 చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. ఈ ఆదేశంపై కంపెనీ తమిళనాడు రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌కు అపీలు చేసింది. 1997లోనే షేర్‌ సర్టిఫికెట్ల బదిలీకి దరఖాస్తులు పెట్టుకోగా, 1999లో జరిగిన ఆదాయపు పన్ను సోదాల్లో సంబంధిత పత్రాలను అధికారులు స్వాధీనపర్చుకొన్నారన్న కంపెనీ వాదనలో పస లేదని కమిషన్‌ అభిప్రాయపడింది. షేర్‌ సర్టిఫికెట్లను సాధ్యమైనంత వెంటనే వాటాదారులకు వాపసు చేయాలని సూచించింది. దీనిపై జాతీయ వినియోగదారు వివాదాల సంఘానికి (ఎన్‌సీడీఆర్‌సీకి) రివిజన్‌ పిటిషన్‌ను కంపెనీ సమర్పించింది. కంపెనీ అభ్యర్థనను ఎన్‌సీడీఆర్‌సీ తోసిపుచ్చింది. దరఖాస్తులు పెట్టిన రెండేళ్ల కాలంలోనూ ఎందుకని చర్య తీసుకోలేదు? అని ప్రెసిడెంట్‌ జస్టిస్‌ అశోక్‌ భాన్‌, సభ్యుడు ఎస్‌.కె.నాయక్‌లతో కూడిన ఎన్‌సీడీఆర్‌సీ బెంచ్‌ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది సేవాలోపం కిందకే వస్తుందని పేర్కొంది. రూ.50,000 పరిహారాన్ని, మరో రూ.1,000 ఖర్చుల కింద వాటాదారులకు చెల్లించాలని బెంచ్‌ స్పష్టం చేసింది. అయితే, షేర్‌ సర్టిఫికెట్లను తిరిగి ఇవ్వాలనడం, బాధితులకు జరిగిందని చెప్తున్న రూ.1.49 లక్షల నష్టాన్ని చెల్లించాలనడం సమంజసంగా లేవంది.