అమెరికా అధ్యక్షుడు ఒబామా పట్టుబట్టి సాధిస్తున్న ఆరోగ్య సంరక్షణ సంస్కరణల కార్యక్రమం అమెరికా ప్రజలకు మేలు చేకూర్చడమే కాకుండా భారతీయ కంపెనీలకు కూడా లాభం కలగజేయనుంది. ప్రధానంగా ఔషధ ఉత్పత్తి, ఐటీ/ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్) కార్యకలాపాల్లో నిమగ్నమైన కంపెనీలకు ఇది లాభదాయకమని స్పష్టం అవుతోంది. ఈ రెండు రంగాలకు చెందిన పలు కంపెనీలు మన రాష్ట్రంలో ఉన్నాయి. దీంతో ఇక్కడి పరిశ్రమ వర్గాలు కొత్తగా అందిరానున్న ఈ అవకాశంపై ఆశాభావం వెలిబుచ్చుతున్నాయి. అమెరికా మార్కెట్‌కు అధికంగా ఔషధాలు సరఫరా చేసే అవకాశం వస్తుందని ఇక్కడి ఫార్మా కంపెనీలు సంతోషిస్తున్నాయి. మరో వైపు ఐటీఈఎస్ కంపెనీలు ఇంకా ఎంతో అధికంగా ఐటీ ఆధారిత సేవల అవుట్‌సోర్సింగ్ అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నాయి.
అమెరికా ప్రజల్లో దాదాపు 10 శాతం మందికి ప్రస్తుతం ఆరోగ్య రక్షణ లేదు. ఒబామా ప్రతిపాదించిన కార్యక్రమం వల్ల ఆ దేశ జనాభా అంతటికీ ఆరోగ్య బీమా రక్షణ లభించే అవకాశం ఏర్పడింది. కొత్తగా 3.2 కోట్ల మంది దీని పరిధిలోకి రానున్నారు. ఫలితంగా అమెరికాలో మందుల వినియోగం అధికం కావచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున అమెరికా మార్కెట్‌కు జనరిక్ ఔషధాలు అందిస్తున్న భారతీయ కంపెనీలకు ఇంకా అధికంగా మందులు పంపించే అవకాశం లభించవచ్చు. మన రాష్ట్రం నుంచి డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, సువెన్ లైఫ్ సైన్సెస్, మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్, దివీస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా తదితర అనేక కంపెనీలు అమెరికా మార్కెట్‌లో జనరిక్ ఔషధాలను విక్రయిస్తున్నాయి. వీటన్నింటికీ ప్రస్తుత పరిస్థితి కలిసిరానుంది. మెడికల్ టూరిజంపై కూడా సానుకూల ప్రభావం ఉంటుందని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. అమెరికాలో ఆరోగ్య బీమా పరిధిలో వచ్చే వారి సంఖ్య పెరుగుతున్నందున తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించే దేశాల్లోని ఆస్పత్రులకు అక్కడి బీమా కంపెనీలు గుర్తింపునిచ్చి, తాము క్లెయిములు చెల్లించాల్సిన వారిని సంబంధిత ఆస్పత్రులకు పంపే అవకాశం ఉందని, అలా కొందరు మనదేశానికి చికిత్స నిమ్తితం వచ్చే అవకాశం ఉందని కార్పొరేట్ హాస్పిటల్స్ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఐటీ కంపెనీలకూ వరమే!: అమెరికా ఆరోగ్య సంస్కరణల బిల్లులో కొన్ని ముఖ్యాంశాలు అమెరికాలోని ఐటీ/బీపీఓ కంపెనీలకు, భారత్ ప్రధాన కేంద్రంగా ఉండి అమెరికాకు, కెనడా, లేదా మెక్సికోలకు విస్తరించిన కంపెనీలకు గొప్ప వాణిజ్య అవకాశాల్ని ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదెలాగంటే.. అల్పాదాయ వర్గాలకు చెందిన 1.60 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చేందుకు 'మెడిక్ ఎయిడ్' పేరుతో ఒక పథకం అమలు చేయనుంది; 50 మంది సిబ్బంది ఉండే ఏ సంస్థలో అయినా బీమా సౌకర్యం తప్పనిసరిగా వర్తింపచేయనుంది. ఇలా.. అందరికీ ఆరోగ్య భద్రత కోసం 2014కల్లా పౌరుల హెల్త్ రికార్డులను కాగితాల రూపంలో కాక ఎలక్ట్రానిక్ రూపంలో సిద్ధం చేయాలని తలపెట్టారు.
రూ.వేల కోట్ల ప్రాజెక్టు: ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల్లో వ్యక్తుల ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన పూర్తి వివరాలు, వారు సంప్రదించే వైద్యుల, సేవలను పొందే ఆరోగ్య కంపెనీల పేర్లు, చిరునామాల వంటి వివరాలు పొందుపరుస్తారు. ఒకవేళ ఆసుపత్రిని మార్చుకోవాలనుకొంటే ఈ వివరాలను పాత ఆసుపత్రి వారు కొత్త ఆసుపత్రికి అందజేయాలి. కొత్త ఆసుపత్రులు అవలంబించే పద్ధతులకు సరిపడేలా ఈ వివరాలను రూపొందాలి. ఇలా తయారు చేసే సమాచారామంతా ఆనక కేంద్రీయ సమాచార నిధికి అనుసంధానం కావాలి. ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డుల ప్రాజెక్టుకు అమెరికా ప్రభుత్వం 20 బిలియన్ డాలర్ల బడ్జెటును (సుమారు రూ.92,000 కోట్లు) కేటాయించే సూచనలు ఉన్నాయి.
ఏ కంపెనీలకు ప్రయోజనం కలగొచ్చంటే: భారత దేశానికి సంబంధించినంతవరకు అమెరికాలో సైతం వాణిజ్య కార్యకలాపాలను సాగిస్తున్న అగ్ర శ్రేణి ఐటీ కంపెనీలు ఈ అవకాశానికి పోటీపడవచ్చు. ఉదాహరణకు టీసీఎస్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, విప్రో టెక్నాలజీస్, కాగ్నిజెంట్ టెక్నాలజీ, మైండ్‌ట్రీ కన్సల్టింగ్, ఇంకా ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్, ప్యాట్నీ కంప్యూటర్‌ల వంటి కంపెనీలు కాంట్రాక్టుల కోసం అమెరికా కంపెనీలతో సై అంటే సై అనవచ్చు.
అమెరికాలో ఔషధాల వినియోగం పెరుగుతుంది కాబట్టి, ఖర్చు తగ్గించుకోవడానికి చౌకగా లభించే జనరిక్ ఔషధాలను భారత్, చైనాల నుంచి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇది వెంటనే అందివచ్చే అవకాశమైతే, దీర్ఘకాలంలో పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ) సంబంధిత అవుట్‌సోర్సింగ్ అవకాశం పెద్దఎత్తున భారతీయ కంపెనీలకు లభిస్తుంది. ఇప్పటికే అమెరికా కంపెనీలు ఆర్ అండ్ డీపై ఖర్చు తగ్గించి, సంబంధిత ప్రాజెక్టులను మన దేశం నుంచి మరికొన్ని ఇతర దేశాల నుంచి తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఖర్చులు ఇంకా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడినందున ఇంకా అధికంగా ఆర్ అండ్ డీ ప్రాజెక్టులు భారత కంపెనీలకు వస్తాయి. ఇక్కడి కంపెనీలతో జాయింట్ వెంచర్ కంపెనీలు నెలకొల్పడం ద్వారా, లేదా దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం ద్వారా అమెరికా కంపెనీలు ఆర్ అండ్ డీ ప్రాజెక్టులను నిర్వహించే అవకాశం ఉంది. - వెంకట్ జాస్తి, సువెన్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ |
మందుల వినియోగంతో పాటు ఐటీ సేవల పాత్ర అధికం కాబోతోంది. బీమా క్లెయిములు తీసుకోవడం కోసం పలు వైద్య రికార్డుల తయారు చేసి, బీమా కంపెనీలకు పంపించాలి. మన దేశంలోని పలు మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ (ఎంటీ) కంపెనీలు, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీఓ) కంపెనీలు ఈ పనిని అమెరికా కంపెనీల తరపున భారత్‌లో నిర్వహిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఖర్చును తగ్గించుకోవడమే ఇందులోని పరమార్థం. ఇప్పుడు ఇంకా అధికంగా రికార్డులు తయారుచేయాల్సి వస్తుంది. అందువల్ల ఇక్కడి బీపీఓ కంపెనీలకు ప్రాజెక్టులు అధికంగా వస్తాయి. ఎలక్ట్రానిక్ మెడికల్ రికార్డ్స్ (ఇఎంఆర్) కూడా అధికం అవుతాయి. వీటిని భారత్‌లోని బీపీఓ కంపెనీలు ఇప్పటికే నిర్వహిస్తున్నాయి. - రామకృష్ణ, మెడికల్ ట్రాన్సిస్క్రిప్షన్ కంపెనీ వరల్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ |
అమెరికాలో ఆరోగ్య సేవల రంగంలో వస్తున్న మార్పు భారతీయ ఫార్మా రంగానికి మేలు చేసేదే. ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు, ఔషధాలపై ఖర్చును తగ్గించాల్సిన పరిస్థితి అమెరికాలో ఏర్పడుతుంది. అందువల్ల అక్కడి కంపెనీలు భారత ఫార్మా కంపెనీల నుంచి మందులు అధికంగా కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తాయి. - ఉత్కర్ష్ పళనీకర్, కన్సల్టింగ్ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఫార్మాస్యూటికల్ నిపుణుడు |