Monday, March 29, 2010

కార్ల ధరలకు యూరో పోటు

ఏప్రిల్‌లో కార్ల ధరలు మళ్లీ పెరగనున్నాయి. ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి యూరో ఐగ ప్రమాణాలను కచ్చితంగా అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించడం ఇందుకు కారణం. ప్రభుత్వ నిర్ణయానికి దీటుగా కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పాదక యూనిట్లను అప్‌గ్రేడ్ చేయవలసివస్తోంది. భవిష్యత్‌లో కార్లన్నీ యూరో ఐగ ప్రమాణాలకు అనుగుణంగానే ఉత్పత్తి చేయాల్సి ఉన్నందువల్ల తమపై పడుతున్న అదనపు భారానికి దీటుగా ఉత్పత్తుల ధరలను పెంచాలని కంపెనీలు సంకల్పించాయి. బడ్జెట్ తరువాత చోటుచేసుకుంటున్న రెండో విడత ధరల పెంపు ఇది.

బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం మూలాన పలు కంపెనీలు వెనువెంటనే కార్ల ధరలను పెంచాయి. ఈ పరిణామం చోటుచేసుకొని నెల రోజులు కూడా గడవక ముందే మరో మారు ధరల వాత పడుతోంది. ధరలను పెంచడానికి రంగం సిద్ధం చేసుకున్న కంపెనీలలో టాటా మోటార్స్, ఫియట్, హ్యుండయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, జనరల్ మోటార్స్ ఉన్నాయి.

13 పెద్ద నగరాల్లో యూరో ఐగ ఇంధనాన్ని విక్రయించనున్నట్టు ఇటీవలనే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఇంధనానికి తగిన విధంగా వాహనాల ఇంజన్లను కూడా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ పదమూడు నగరాలు మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో యూరో ఐఐఐ ప్రమాణాలను అమలు చేయనున్నారు.

యూరో ఐగ ప్రమాణాలకు దీటుగా ఇంధనం ఉత్పత్తి చేయడానికి అయ్యే వ్యయాన్ని వినియోగదారులకు పంచుతున్నట్టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించి వారం కూడా గడవక ముందే కార్ల కంపెనీలు చేసిన ఈ ప్రకటన వినియోగదారులను గుక్క తిప్పుకోనీయనిదిగా ఉన్నదన్నది విశ్లేషకుల అభిప్రాయం.

ఏ కంపెనీ ఎంతెంత?
షెవర్లే బీట్, స్పార్క్ మినహా మిగతా అన్ని మోడళ్ల ధరపై 6,000 రూపాయల వరకు పెంచనున్నట్లు జనరల్ మోటార్స్ వైస్ ప్రెసిడెంట్ (కార్పొరేట్ కమ్యూనికేషన్స్) పి.బాలేందర్ తెలిపారు. హ్యుండయ్ మోటార్ ఇండియా తన అన్ని మోడళ్ల ధరలను ఏప్రిల్ మొదటి వారం నుంచి 5,000 రూపాయల వరకు పెంచాలని భావిస్తోంది.

తమ కార్ల ధరల పెరుగుదల ఏప్రిల్ తొలి వారంలో ఉంటుందని, ధరల స్థాయి 4,000- 5,000 రూపాలయ మధ్య ఉంటుందని హ్యుండయ్ మోటార్ రీజినల్ సేల్స్ మేనేజర్ కుమార్ ప్రియేష్ తెలిపారు. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి భారత్ స్టేజ్ ఐగఉద్గార ప్రమాణాలను పాటించేందుకు తమ కంపెనీ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.

ఏప్రిల్ 1 తరువాత కార్ల ధరల పెరుగుదల ఉంటుందని టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వర్గాలు వెల్లడించాయి. మహీంద్రా అండ్ మహీంద్రా తన అన్ని మోడల్ కార్ల ధరలను పెంచనుంది. ఫియట్, మెర్సిడెస్ బెంజ్, టొయోటా కూడా ఈ కంపెనీల బాటలోనే పయనించనున్నాయి. కాగా ఏప్రిల్ నుంచి దేశంలో ప్రస్తుతం భారత్ స్టేజ్ ఐఐఐ సిటీలు భారత్ స్టేజ్ ఐగ సిటీలుగా మారనున్నాయి.

మిగతా ప్రాంతాల్లో బిఎస్ ఐఐ నుంచి బిఎస్ ఐఐఐ కి అప్‌గ్రేడ్ అవుతాయి. ఇదిలా ఉండగా 2009 ఏప్రిల్ నుంచి 2010 జనవరి మధ్య కాలంలో సుమారు 1.22 మిలియన్ల కార్ల విక్రయాలు జరిగినట్లు ఆటో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ సంఘం (సియామ్) వెల్లడించింది. ఇది అంతకు ముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే 25 శాతం అధికం.