Tuesday, March 30, 2010

ఆరేళ్లలో అప్పులు రెట్టింపు

ఆర్‌బీఐ తాజా లెక్క రూ.1.27 లక్షల కోట్లు
పెరుగుతున్న వడ్డీల భారం
ప్రజలపై ప్రభావం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర రుణభారం అంతకంతకూ పెరిగిపోతోంది. రిజర్వు బ్యాంకు తాజా అంచనా ప్రకారం 2010 మార్చి నాటికి రాష్ట్ర రుణ బాధ్యతలు రూ.1,27,581 కోట్లకు చేరాయి. ఇవి ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్నాయి. అప్పులపై వడ్డీల రూపేణా 2010-11లో ఏకంగా రూ.10,196 కోట్లను చెల్లించాల్సి వచ్చింది. పన్నుల ద్వారా ప్రజల నుంచి వసూలు చేసే రెవెన్యూ ఆదాయం నుంచే వడ్డీలను చెల్లిస్తుంటారు. పాత అప్పుల్ని తీర్చటానికి ప్రభుత్వం మరిన్ని అప్పుల్ని తీసుకురాకతప్పని పరిస్థితి ఏర్పడింది. రెవెన్యూ రాబడిలో 11.24% వడ్డీలకే పోతుండటంతో మరింత ఆదాయం కోసం ప్రభుత్వం ప్రజలపై భారాన్ని మోపుతోంది. పలు వస్తువుల పన్ను రేట్లను ప్రభుత్వం ఇటీవలే పెంచింది. భూముల మార్కెట్‌ (రిజిస్ట్రేషన్‌)విలువల పెంపు వంటి మరికొన్ని చర్యలకు దిగుతోంది.
రిజర్వు బ్యాంకు 28 రాష్ట్రాల అప్పులను తాజాగా విశ్లేషించగా వాటిలో మన రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. 2004లో రాష్ట్ర అప్పులు రూ.65,251 కోట్లు ఉండగా ప్రస్తుతం అవి రూ.1.27 లక్షల కోట్లకు చేరాయి. ఇది రాష్ట్రం కొత్త బడ్జెట్‌ పత్రాల్లో చూపించిన రూ.1.09లక్షల కోట్ల కంటే రూ.17,824 కోట్లు ఎక్కువ. ఆర్‌బీఐ మరికొన్ని రకాల పద్దులను కూడా పరిగణనలోకి తీసుకొని రుణ బాధ్యతలను లెక్కగట్టింది.

వివిధ ఆర్థిక సంస్థలకు వేలం ద్వారా పదేళ్ల వ్యవధి గల సెక్యురిటీలను (బాండ్లు) విక్రయించి రుణాలను తీసుకురావడానికి రాష్ట్రం ఇటీవల ప్రాధాన్యం ఇస్తోంది. 2009-10లో దాదాపు ప్రతినెలా ఇలా సెక్యురిటీలను విక్రయించింది. గత పదేళ్లలో తెచ్చిన రుణం రూ.38,336 కోట్లకు చేరింది. దీన్ని రానున్న పదేళ్లలోను ఏటా కొంత మొత్తం చొప్పున చెల్లించాల్సివుంటుంది. ఇలా 2010-11లో రూ.1,639 కోట్లు ఇవ్వాలి. ఆ తర్వాత సంవత్సరాల నుంచి ఈ మొత్తం క్రమేణా పెరుగుతూ 2018-19లో రూ.10,934 కోట్లను చెల్లించాలి. ఆర్‌బీఐ విశ్లేషణలోని కొన్ని ముఖ్యాంశాలు ఇవీ..

* 2009-10లో స్థూలరాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ)లో 4% మేర అప్పుల్ని తెచ్చుకోవచ్చనే వెసులుబాటును 10 రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ కూడా ఉపయోగించుకుంది. పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ సహా మిగతా రాష్ట్రాలు 3 శాతం అప్పులతో సరిపుచ్చుకున్నాయి.

* వేస్‌ అండ్‌ మీన్స్‌ (చేబదుళ్లు), ఓవర్‌ డ్రాఫ్టులకు వెళ్లకపోవటం తన ఘనతగా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. 2005-06 తర్వాత చాలా రాష్ట్రాలు కూడా వీటి జోలికి వెళ్లటమేలేదు.

* మొత్తం అప్పులు స్థూలరాష్ట్రోత్పత్తిలో 30 శాతానికి పరిమితం కావాలనే నిబంధనను 2008-09లో సాధించినా ఇప్పుడది 31.30 శాతానికి పెరిగింది.