Tuesday, March 30, 2010

ఒకటి హిట్‌..మరొకటి ఫట్‌

సోమవారం స్టాక్‌ మార్కెట్లలో ఓ భారీ స్థాయి ప్రభుత్వ రంగ ఎఫ్‌పీఓ షేర్లు; ఓ చిన్నపాటి ప్రైవేటు రంగ కంపెనీ షేర్లు నమోదయ్యాయి. విచిత్రంగా పీఎస్‌యూ ఎఫ్‌పీఓ మదుపర్లను నిరుత్సాహపర్చగా.. చిన్న కంపెనీ నమోదు వారికి భారీ స్థాయి లాభాల్తో ఆనందాన్ని పంచింది. అందులో మొదటిది ఎన్‌ఎమ్‌డీసీ.. రెండోది డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌.
డీక్యూఈ.. 69 శాతం ప్రీమియం
యానిమేషన్‌, గేమింగ్‌ కంపెనీ డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌(ఇంటర్నేషనల్‌) బీఎస్‌ఈలో భారీ ప్రీమియంతోనమోదైంది. ఇష్యూ ధర రూ.80పై 69 శాతం ప్రీమియంతో రూ.135 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 75 శాతం అధికంగా రూ.140 వద్ద గరిష్ఠ స్థాయినీ తాకింది. రూ.106.55 వద్ద కనిష్ఠ స్థాయికీ పడిపోయిన కంపెనీ షేరు ధర చివరకు మాత్రం 35.70 శాతం లాభంతో రూ.108.55 వద్ద ముగిసింది. మొత్తం 3,99,45,184 షేర్లు చేతులు మారాయి.

యూకే కంపెనీతో ఒప్పందం
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: బుల్లితెర యానిమేషన్‌ కథలను తయారుచేయడానికి యూకేకు చెందిన హైవ్‌ ఎంటర్‌ప్రైజెస్‌తో డీక్యూ ఎంటర్‌టైన్‌మెంట్‌ (డీక్యూఈ) ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రూ.24 కోట్ల వ్యయంతో 78 ఎపిసోడ్‌లను నిర్మిస్తామని డీక్యూ ఛైర్మన్‌, సీఈఓ తపస్‌ చక్రవర్తి తెలిపారు.

ఎన్‌ఎమ్‌డీసీ.. 4.56 శాతం నష్టం
న్‌ఎమ్‌డీసీ ఎఫ్‌పీఓ షేర్ల నమోదు మదుపర్లకు నిరుత్సాహాన్నే మిగిల్చింది. మొత్తం 33.22 కోట్ల షేర్లను ట్రేడింగ్‌కు అనుమతించారు. రూ.295.70 వద్ద ప్రారంభమైన ఎన్‌ఎమ్‌డీసీ షేర్లు ఒక దశలో రూ.296 వద్ద గరిష్ఠ స్థాయినీ తాకినా ఫలితం లేకపోయింది. కనిష్ఠస్థాయి రూ.283.50 కన్నా కాస్త ఎక్కువగా రూ.284.70 వద్ద స్థిరపడింది. అంతక్రితం ముగింపు 298.30తో పోలిస్తే ఇది 4.56% తక్కువ. కాగా, ఎఫ్‌పీఓ ఇష్యూ ధర రూ.300 కన్నా షేరు ధర పడిపోవడం గమనార్హం.రిటైల్‌ మదుపర్లకు 5 శాతం డిస్కౌంట్‌తో రూ.285కే షేర్లను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ లెక్కన రిటైల్‌ మదుపర్లకూ పెద్దగా ఒనగూరిందేమీ లేదన్నమాట. ఎఫ్‌పీఓ నేపథ్యంలో గత నెల రోజుల వ్యవధిలో ఈ షేరు ధర 30.90 శాతం పతనమైంది. ఈ వ్యవధిలో సెన్సెక్స్‌ 7.40% పెరగడం విశేషం.