Monday, March 29, 2010

మెహర్బానీ కోసం... రూ.1364 కోట్లు!

ఒక్క ఏడాదిలోనే కోట్లాది రూపాయల పనులు మంజూరు
కొన్నింటిలో అక్రమాలు
అన్నీ చేస్తే... తీతీదే సంక్షోభంలోకి వెళ్లేది
కరుణాకరెడ్డి హయాంలో జరిగిన బాగోతం
కంగుతిన్న కొత్త పాలకమండలి
రూ. 500 కోట్ల పనులు నిలిపివేత
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజినీరింగ్‌ విభాగం ఏటా 200 కోట్లరూపాయల పనులను చేయగలదు. దాని సామర్థ్యం అంతే! ఒకేసారి ఆ విభాగానికి వెయ్యికోట్ల రూపాయల పనులను అప్పగించామనుకోండి. అలా ఎవరైనా చేస్తారా అని అడుగుతారా? కానీ అదే పని చేసింది- కరుణాకరరెడ్డి నేతృత్వంలోని గత పాలకమండలి. ఛైర్మన్‌గా ఆయన కీలకపాత్ర పోషించిన కాలంలోనే పాలకమండలి ఏకంగా వందల కోట్ల పనులకు అనుమతులు మంజూరు చేసింది.

కరుణాకరరెడ్డి ఛైర్మన్‌గా ఉన్న చివరి ఏడాది కాలం (2008 ఆగస్టుకు ముందు)లో వెనుకాముందూ చూడకుండా అక్షరాలా రూ.1364.56 కోట్ల విలువైన సివిల్‌ పనుల నిర్మాణానికి పాలకమండలి అనుమతి ఇచ్చింది. ఇలా మంజూరైన కొన్ని పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు కూడా చోటు చేసుకున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేశారు. అయితే ఒక వేళ మంజూరైన పనులన్నింటినీ ప్రారంభించి ఉంటే... ఏకంగా తీతీదే సంక్షోభంలో పడిపోవడమే కాకుండా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి కూడా తలెత్తేది.

విషయం తెలుసుకున్న ఆదికేశవులు నాయుడు నేతృత్వంలోని పాలకమండలి కంగుతింది. పాత పాలకమండలి మంజూరు చేసిన చాలా పనులను కొత్త పాలకమండలి నిలిపివేసింది. ఈ పనులు మంజూరు వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. సాధారణంగా ఏ సంస్థ అయినా ఏడాదిలో తమకు వచ్చే ఆదాయన్ని బట్టి ఖర్చును నిర్ణయించుకుంటుంది. తితిదే ఆదాయం ఆ రోజుల్లో సుమారు వెయ్యి కోట్ల వరకూ ఉండేది. నిర్మాణ పనులకు ఏకంగా రూ. 1364.56 కోట్లు మంజూరు చేయడాన్ని చూస్తే... పాలకమండలి ఏ విధంగా పనిచేసిందీ అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో నిధులను మంజూరు చేయడానికి కారణం.. పాలకమండలి మెహర్బానీ కోసమేనన్న విమర్శలు ఉన్నాయి. కరుణాకరరెడ్డి గత ప్రభుత్వ పెద్దలకు సన్నిహితునిగా పేరొందారు. ఆయన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు.

అవసరంలేని వాటికీ నిధులు
ఇలా మంజూరైన కొన్ని పనుల్లో అక్రమాలు చోటుచేసుకోగా, మరికొన్ని అవసరం లేని పనులకు కూడా నిధులు మంజూరు చేశారు. వివరాలివి.
* తితిదే ఆధ్వర్యంలో పవన్‌ విద్యుత్తును గ్రిడ్‌కు కలిపేందుకు ఉద్దేశించిన 33 కేవీ హెచ్‌టీఓ లైను ఏర్పాటుకు అంచనాలను రూపొందించే బాధ్యతను ఒక సంస్థకు అప్పగించగా... అది రూ.5.65కోట్లు అవుతుందని అంచనా వేసింది. అదే సంస్థకు ఈ పనిని నామినేషన్‌పై అప్పగించారు. దీనిపై అప్పట్లో 'ఈనాడు'లో వార్త రావడంతో అధికారులు స్పందించి మళ్లీ అంచనాలు రూపొందించగా రూ.2.2 కోట్లకే పనులు చేయవచ్చని తేల్చారు. ఈ పనికి టెండర్లను పిలిచి వేరే వారికి అప్పగించారు.

* తిరుమలలో ఉపయోగించేందుకు 107 అంగుళాల 30 ప్లాస్మా టీవీలను కొనుగోలు చేశారు. ఒక్కో టీవీ ఖరీదు అక్షరాల రూ.33 లక్షలట. ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయన్న విమర్శలు ఉన్నాయి.

* తిరుపతి పట్టణ శివారులోని తుడా పరిధిలో తుమ్మలగుంట-రాయల్‌ చెరువు మధ్య ఇటీవలే నాలుగు లైన్ల రహదారిని కొత్తగా నిర్మించారు. దీనికి రూ.14 కోట్ల తితిదే నిధులు వినియోగించారు. తుడా ఛైర్మన్‌, తితిదే పాలకవర్గం సభ్యుడైన చెవిరెడ్డి భాస్కరెడ్డికి చెందిన గ్రామం తుమ్మలగుంట కావడంతో ఈ రోడ్డును నిర్మించారని చెబుతున్నారు. భక్తులకు ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించినా అసలు ట్రాఫిక్‌ లేని ఈ సింగిల్‌ లైను రోడ్డును రెండు లైన్లుగా విస్తరించినా పోనీలే అనుకోవచ్చు. రూ.14 కోట్ల నిధులతో నాలుగు లైన్ల రోడ్డును నిర్మించడం పట్ల పెద్ద ఎత్తున విమర్శలు రేగుతున్నాయి.

* ఒకవైపు తిరుపతిలో గోవిందరాజుల స్వామి పుష్కరణి ఆలనాపాలనా లేక గడ్డిమొలిచి పాడైపోయింది. దీన్ని పట్టించుకునేవారు లేరు. ఇదే సమయంలో చెవిరెడ్డి సొంతూరు తుమ్మలగుంటలో మాత్రం లక్షల రూపాయల తితితే నిధులతో పుష్కరణి నిర్మించారు.

* తిరుమలలో టీటీబీ ఏరియాలో 12వేల మంది భక్తులకు వసతికల్పించేందుకు ఏకంగా రూ.314కోట్లతో ఆరుబాక్లుల అతిథిగృహం నిర్మించాలని తలపెట్టారు. భారమైన ఈ ప్రతిపాదనను పాలకమండలి నిలిపి వేసింది. అతిథిగృహం నిర్మించే ఈస్థలాన్ని ఇప్పుడు కార్లపార్కింగ్‌గా ఉపయోగించడం విశేషం.

* తిరుపతిలో తూర్పు పోలీసుస్టేషన్‌ని రూ.1.75 కోట్లతో నిర్మించేందుకు గతంలో మంజూరు ఇవ్వగా.. ప్రస్తుతం దాన్ని రూ.85 లక్షలకే చేపట్టేందుకు అంచనాలు రూపొందించారు.

* ఇష్టానుసారం 20 కళ్యాణ మండపాలను కూడా మంజూరు చేశారు.

* ధర్మప్రచార పరిషత్‌కింద ఏటా రూ.20 కోట్ల నిధులు ఖర్చు చేస్తుండగా గత పాలకమండలి బడ్జెట్‌ను ఆరేడింతలకు పెంచేసింది.

కొత్త పాలకమండలి వచ్చిన తరువాత ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇంజనీరింగ్‌ అధికారులను ఆరా తీయగా మొత్తం రూ.1364.56 కోట్ల విలువైన పనులను ఏడాది కాలంలో మంజూరు చేసిన విషయం బయటపడింది. ఇందులో ఇప్పటి వరకురూ.102.90 కోట్ల పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ. 475.96 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. రూ.250 కోట్లకు పైగా పనులు చేపట్టబోతున్నారని చెబుతున్నారు. మిగిలిన పనులపై కొత్త పాలకమండలి చర్చించింది. ఈ పనులకు కూడా అనుమతి మంజూరు చేస్తే ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టమేనని భావించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా భావించినట్లు సమాచారం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని గత పాలకమండలి మంజూరు చేసిన రూ.500 కోట్లపైగా పనులను నిలిపి వేయాలని నిర్ణయించారు.