Wednesday, March 24, 2010

పెరిగిన నూలు ధరలు

threadసిరిసిల్ల, మేజర్‌న్యూస్‌: పెరిగిన నూలు ధరల ప్రభావం కరీంనగర్‌ జిల్లా సిరిసిల్ల కాటన్‌ వస్తప్రరిశ్రమపై తీవ్ర స్థాయిలో పడుతుంది. అలాగే పెట్రో ప్రొడక్ట్స్‌తో సంబందం ఉన్న టెక్సో వస్త్ర ఉత్పత్తులపై కూడ పెట్రో చార్జీల పెంపు ఫలితం కూడ పడడంతో ఈ రెండింటితో సంబందం ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం తిరిగి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. చేనేతకు చేయూత అంటున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మాత్రం సిరిసిల్ల లాంటి సంక్షోభ వస్తప్రరిశ్రమ కేంద్రం వైపు కన్నెత్తి చూడకపోవడంతో సుమారు 23వేలకుపైగా ఉన్న కార్మికుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించడంలో ప్రభుత్వం విఫలమయింది.


సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు కేంద్రంలా రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన విషయం తెలిసిందే. ఇక్కడ కాటన్‌, పాలిస్టర్‌ వస్త్ర ఉత్పత్తి జరుగుతుండగా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళి వచ్చిన వారితో పరిశ్రమ నేత కార్మికులకు చక్కని ఉపాధి కేంద్రంగా నిలుస్తోంది. సుమారు ఆరు వేల మరమగ్గాలపై కాటన్‌ ఉత్పత్తులు జరుగుతుండగా ఈ ఉత్పత్తులకు నూలు ధరల పెరుగుదల ప్రభావం అధికంగా ఉంది. గత ఆరు మాసాల కాలంగా నూలు ధరల పెరుగుదల క్రమక్రమంగా పెరుగుతూ వస్త్ర ఉత్పత్తి దారులకు విషమ సమస్యగా మారింది. మరోవైపు విద్యుత్‌ కొరత సమస్య కార్మికులను వెంటాడుతుంది.

machineపత్తి ఉత్పత్తిలో కాస్త తగ్గుదల కనిపించిన నేపద్యంతో ముడి పత్తిధర విపరీతంగా పెరిగింది. ఫలితంగా నూలు మిల్లులు నూలు ధరలను విపరీతంగా పెంచేసి స్వయంగా నూలును నగదు ఇచ్చి కొనుగోలు చేసే వారిపట్ల మొగ్గు చూపించడంతో మార్కెట్లో వివిద రకాల కౌంట్‌గల నూలుకు విపరీత డిమాండ్‌ ఏర్పడింది. అయినప్పటికి అధిక ధరకు కొనుగోలు చేసిన ఆ నూలుతో తయారైన గుడ్డకు మీటరుకు అర్ధరూపాయి కూడా పెంచకపోవడంతో నూలు వస్త్ర వ్యాపారులు, అద్దకం వ్యాపారులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు.

ప్రస్తుతం మార్కెట్‌లో కాటన్‌ మిల్లులో 20 నంబర్‌నూలు 5 కిలోలకు 540 రూపాయలు ఉండగా నేడు 690 రూపాయలకు పెరగడంతో వస్త్ర ఉత్పత్తి దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 25వ నంబరు నూలు ధర 380 రూపాయలు ఉండగా ఒక్కసారి 400 రూపాయలకు పెరిగింది. కాటన్‌ వస్త్ర ఉత్పత్తులను తయారు చేస్తున్న సుమారు 6 వేల మరమగ్గాలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 4 వేల మందికి పైగా కార్మికులు పనిచేస్తుండగా వస్త్ర ఉత్పత్తి తగ్గడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.