ప్రహసనంగా మారిన 2005-10
పారిశ్రామిక విధానం
హైదరాబాద్ - న్యూస్‌టుడే

ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల క్రితం ఘనమైన లక్ష్యాలతో 2005-10 పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ ఐదేళ్లలో ఏం సాధించారంటే... అయిన వాళ్లకు సెజ్‌ల రూపంలో వేల ఎకరాలు కట్టబెట్టారు. ప్రభుత్వ భూముల అమ్మకం ద్వారా ఖజానాకు కాసుల కరవు తీర్చుకున్నారు. భారీఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని 2005-10 పారిశ్రామిక విధానంలో చెప్పారు. 2008 సంవత్సరాన్ని ఉపాధినామ సంవత్సరంగా ప్రకటించినపుడు ఒక్క సెజ్‌ల ద్వారానే 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఈ ఐదేళ్లలో అన్నిరకాలుగా కలిపి 3.3 లక్షల మందికి ఉపాధి కల్పించామని ఇటీవల అధికారిక అంచనాలు వేశారు. నిజానికి పారిశ్రామిక వర్గాల అంచనా ప్రకారం కేవలం 1.64 లక్షల మందికి ఉపాధి కల్పించారు. అందులో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్న చిన్నతరహా పరిశ్రమల వాటాయే లక్షా తొమ్మిది వేలు. ఐదేళ్ల రాష్ట్రపారిశ్రామిక విధానం మార్చి 31తో ముగుస్తోంది. ఇంతకీ ఏం సాధించింది?
ఆరంభమే ఆలస్యం
2005-2010 పారిశ్రామిక విధానం 2005 ఏప్రిల్ ఒకటి నుంచి అమలు చేయాల్సి ఉండగా, జీవో జూన్ 21న విడుదల చేశారు. పారిశ్రామిక విధానంలోని అంశాల్లో అధిక శాతం అమలు కాలేదు. భూకేటాయింపులు, విద్యుత్, నీరు, మౌలిక వసతులు, పన్నుల మినహాయింపు వంటి రాయితీలు భారీ పరిశ్రమలకే పరిమితం అయ్యాయి.
భూ కేటాయింపులకే పెద్దపీట
ప్రభుత్వం పరిశ్రమల స్థాపన పేరిట పెద్దఎత్తున భూసేకరణకు పూనుకుంది. పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ)కి బాధ్యతలు అప్పగించింది. భూసేకరణ, పంపిణీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయి. వాన్‌పిక్, కాకినాడ సెజ్, బ్రహ్మణి, శ్రీసిటీ సెజ్ వంటి అస్మదీయ కంపెనీలకు వేల ఎకరాలను కట్టబెట్టారు.
*2004 వరకు ఏపీఐఐసీ 48,579 ఎకరాలను సేకరించగా తర్వాత ఐదేళ్లలో 72784 ఎకరాలను సేకరించింది.
*పారిశ్రామిక పార్కులు, సెజ్‌ల కోసం 1,21,363 ఎకరాలుఇచ్చింది.
*భూముల అమ్మకాల్లో రూ.6,433 కోట్లను ఆర్జించిన ఏపీఐఐసీ రూ.776 కోట్లను మాత్రమే మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించింది. ఇవీ బడా కంపెనీలకే ఉపయోగపడ్డాయి.
హడావుడి ఒప్పందాలు
పెట్టుబడుల సమీకరణ పేరిట ప్రభుత్వం హడావిడిగా అరవైకి పైగా సంస్థలతో పరిశ్రమల ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందాలు చేసుకుంది. ఇందులో అతికొద్ది సంస్థల్లోనే కార్యాచరణ కనిపించింది. ఇలా అనుమతులు పొందిన భారీ పరిశ్రమల్లో కడప జిల్లాలో బ్రహ్మణి స్టీల్స్ కూడా ఉంది. ఇందులో సగం పరిశ్రమలే కార్యరూపం దాల్చాయి. నెల్లూరు జిల్లాలో అపాచి, విశాఖలో బ్రాండిక్స్, రంగారెడ్డి జిల్లాల్లో వజ్రాలు, రత్నాల పరిశ్రమలు వంటివి మాత్రమే ఉత్పత్తులు ప్రారంభించాయి.

మెగా పరిశ్రమల ద్వారా అయిదేళ్లలో రూ.17 వేల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా రూ.10 వేల కోట్లు మాత్రమే కార్యరూపం దాల్చాయి.
చిన్న పరిశ్రమలకు చేయూత ఏదీ
భారీ పరిశ్రమల మాదిరి భూ కేటాయింపులు, రాయితీలు ఇతర రంగాల్లో ఎలాంటి ప్రాధాన్యం లభించలేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం, మార్కెటింగు సమస్యలు, నష్టాలు, ఆర్థిక మాంద్యం, విద్యుత్ కోత తదితర సమస్యలతో గత అయిదేళ్లలో పదివేలకు పైగా చిన్నతరహా పరిశ్రమలు మూత పడ్డాయి. దాంతో యాభై వేల మందికి పైగా ఉపాధి కోల్పోయారు. ఖాయిలా పడిన పరిశ్రమలను ఆదుకునేందుకు రూ.20 కోట్లతో ప్రత్యేకనిధిని కేటాయించినా అందులో ఒక్క రూపాయి వెచ్చించలేదు. పావలా వడ్డీని ప్రవేశపెట్టినా రెండేళ్లుగా రూ. 150 కోట్ల బకాయిలనే విడుదల చేయలేదు.
*గ్రామీణ పరిశ్రమల ఊసేలేదు. ఆహారశుద్ధి విభాగాన్ని పరిశ్రమల నుంచి మార్కెటింగు శాఖకు బదలాయించి, అక్కడి నుంచి మళ్లీ పరిశ్రమల శాఖలో విలీనం చేశారు.
సెజ్‌ల బూమ్
భారీ, చిన్నతరహా పరిశ్రమలు అభివృద్ధి చెందక పోయినా ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. 103సెజ్‌లకు అనుమతులిచ్చింది.
*వీటిద్వారా పాతిక లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
*అనుమతులు పొందిన వాటిల్లో 19 మాత్రమే నడుస్తున్నాయి. మరో 35లో నిర్మాణ పనులు సాగుతున్నాయి.
*రూ.70 వేల కోట్ల పెట్టుబడులను అంచనా వేయగా రూ.పది వేల కోట్లే సమకూరింది.
*గత ఐదేళ్లలో 1.6 లక్షల కోట్ల రూపాయల ఎగుమతులు జరిగాయి.
తమిళనాడు ఆదర్శం
తయారీ రంగంలో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. అక్కడి పారిశ్రామిక విధానం విజయవంతంగా అమలవుతోంది. మన రాష్ట్రంలో పోలిస్తే రాయితీలన్నీ ఎక్కువే కావడంతో పారిశ్రామికవేత్తలు అటువైపు పరుగులు తీస్తున్నారు. ఇక్కడి మాదిరిగా ఒకటి రెండు నగరాలలో గాకుండా చెన్నై, మధురై, కోయంబత్తూరు, సేలం, తిరువూరు, ఇలా ప్రధాన నగరాలు, పట్టణాలకు పారిశ్రామిక ప్రగతి విస్తరించింది. తమిళనాడు రాయితీతో పదేళ్లపాటు నిరంతరాయ విద్యుత్ ఇస్తామని ప్రకటించి, అమలు చేస్తోంది. పెద్ద పరిశ్రమల కన్నా చిన్నతరహా పరిశ్రమలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. భూమి ఇచ్చి, మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది.
*గ్రామీణ పారిశ్రామికీకరణకు ప్రోత్సాహం, *అదనపు ఉపాధి అవకాశాలు *తయారీరంగంలో ఆంధ్రప్రదేశ్‌ని అత్యున్నత స్థాయికి చేర్చడం |
లక్ష్యాలను సాధించేందుకు వ్యూహాలు *పెట్టుబడుల ప్రోత్సాహకాలు *మెగా పెట్టుబడులకు ఆహ్వానం *ఎగుమతి ప్రోత్సాహకాలు *ఖాయిలా సమస్యను పరిష్కరించడం *పరిశ్రమల పునరుద్ధరణ నిధిని ఏర్పాటు. |
- ఫ్యాప్సి అధ్యక్షుడు విజయ్‌కుమార్ |
- సీఐఐ మాజీ అధ్యక్షుడు హరీష్ చంద్రప్రసాద్ |