Tuesday, March 30, 2010

ఐపీఎల్‌ ఉన్నా జోరు తగ్గని టీవీ ధారావాహికలు

ప్రకటనల ఆదాయంపై క్రికెట్‌ ప్రభావం ఏమంత లేదు..
న్యూఢిల్లీ: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ట్వంటీ20 క్రికెట్‌ మ్యాచ్‌లు ప్రజలు టెలివిజన్‌ సెట్లకు అంటుకొని పోయి కన్నార్పకుండా చూసేటట్లు చేస్తున్నప్పటికీ.. ఈ పోటీ సాధారణ వినోదాన్ని అందించే ఛానళ్లు వాటి వాణిజ్య ప్రకటనల ఆదాయాలు తగ్గిపోతాయేమోనని గాభరా చెందడం లేదు! సరిగ్గా క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రసార సమయానికే రోజువారీ ధారావాహికలను చూపించే ఛానళ్లకు సైతంప్రచార ప్రకటనల రాశి బాగానే ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కిందటి ఏడాది మాత్రం ఆర్థిక మందగమనం వల్ల సెంటిమెంట్‌ దెబ్బ తిని నిరుత్సాహకరమైన పరిస్థితులు నెలకొన్నట్లు మీడియా ఏజెన్సీ ఎంఈసీ ఇండియా తెలిపింది. ఈ ఏడాది వాహన రంగం, వస్తువుల ఉత్పత్తి (ఎఫ్‌ఎంసీజీ) రంగం వంటివి వాటి ప్రకటనల పరిధిని విస్తృతం చేసుకొని వినోద ఛానళ్లలో ప్రసార సమయాల్ని కొనుగోలు చేశాయని వివరించింది. మాకు చేతి నిండా వాణిజ్య ప్రకటనలు ఉన్నాయి. ఐపీఎల్‌ మా ప్రకటనల ఆదాయంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేకపోయిందని రెండు ప్రముఖ జాతీయ ఛానళ్ల మార్కెటింగ్‌ అధికారులు చెప్పారు. వినోద ఛానళ్ల రేట్లు కొద్దిగా తక్కువగా , ధారావాహికలను తిలకించే వీక్షకుల సంఖ్యలు సంతృప్తికరంగా ఉండడం ప్రకటనకర్తలకు వారు ఆశించిన ఫలితాలను అందిస్తున్నట్లు ఈ అధికారులు వివరించారు. ఐపీఎల్‌ మ్యాచ్‌లతో పాటు ప్రసారం చేసే ప్రకటనలకు ధరలు వినోద ఛానళ్ల ప్రకటనల ధరలతో పోలిస్తే అయిదారింతలు ఉంటున్నాయని పరిశ్రమ వర్గాల అంచనా. ఐపీఎల్‌ మ్యాచ్‌ల వేళ వచ్చే అయిదారు సెకన్ల ప్రకటనలకు దాదాపు రూ.5 లక్షలు వ్యయం అవుతుండగా, అదే వ్యవధితో కూడిన ప్రకటనలను వినోద ఛానళ్ల ప్రైమ్‌ టైమ్‌లో చూపించినందుకు సుమారు రూ.60,000 నుంచి రూ.లక్ష వరకు ఖర్చు అవుతోంది. వినోద ఛానళ్లకు ప్రకటనల నుంచి లభించే ఆదాయం ఎనభై శాతం ఉంటోంది. మిగతాది సబ్‌స్క్రిప్షన్‌ల నుంచి అందుతోంది.