'వడ్డి'ంపు కొనసాగుతుంది
అయితే అది దశలవారీగానే: దువ్వూరి
ముంబయి: వడ్డీ రేట్ల విషయంలో రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) దశలవారీ పెంపును కొనసాగిస్తుందని ఆర్‌బీఐ గవర్నర్ సుబ్బారావు సంకేతాలిచ్చారు. పరపతి ఉద్దీపన పథకాల ఉపసంహరణను కొనసాగిస్తామని సుబ్బారావు పేర్కొన్నారు. అధిక ద్రవ్యోల్బణానికి అడ్డుకట్ట వేయడానికి అధిక వృద్ధి రేటు కొనసాగడానికి ఇది తప్పదని ఆయన స్పష్టం చేశారు. బుధవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ 'మనకు అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉంటే వృద్ధి రేటు అధిక స్థాయుల వద్ద కొనసాగలేదు.. కాబట్టి ఉద్దీపనల ఉపసంహరణ పరపతి విధానంలో కొనసాగాలి. స్వల్పకాలంలో ఇందుకోసం వృద్ధిని త్యాగం చేయాల్సి రావచ్చు. అయితే మధ్య కాలంలో అది కొనసాగేలా చూడడంపైనే దృష్టిసారిస్తామ'న్నారు. ఒక్కసారిగా కఠిన చర్యలు తీసుకునే బదులు అప్పుడప్పుడూ ఈ తరహా చర్యలను తీసుకోవడానికి ఆర్‌బీఐ ఇష్టపడుతుందన్నారు. లేకుంటే ద్రవ్యోల్బణం పెచ్చుమీరి భారత ఆర్థిక వ్యవస్థ వేడెక్కే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు.
ఒకట్రెండు రోజుల్లో ఒప్పందం!
భారతీ ప్రతిపాదనకు జైన్ బోర్డు ఓకే
న్యూఢిల్లీ: ఒకటి లేదా రెండు రోజుల్లో భారతీ-జైన్‌ల ఒప్పందం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది. ఈ దిశగా లావాదేవీల బదిలీకి జైన్ బోర్డు అంగీకరించినట్లు సమాచారం. కువైట్‌కు చెందిన జైన్ టెలికాం ఆఫ్రికా ఆస్తుల్ని 10.7 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసే విషయంలో మార్చి 25(నేటి) వరకూ భారతీ ఎయిర్‌టెల్ ఆ కంపెనీతో ప్రత్యేక చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. 'చివరి నిమిషం వరకూ ఏం జరుగుతుందో చెప్పలేం. అయితే ప్రస్తుత పరిణామాలు సానుకూలంగానే కనిపిస్తున్నాయ'ని విశ్వసనీయ వర్గాల సమాచారం. బుధవారం జరిగిన సమావేశంలో ఆఫ్రికా ఆస్తుల విక్రయానికి బోర్డు తలూపినట్లు తెలుస్తోంది. అయితే జైన్ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఈ ఒప్పందం ఏప్రిల్‌లో ఖరారు కావొచ్చని అంతక్రితం సునీల్ మిట్టల్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎస్‌బీఐ రుణం రూ.6,900 కోట్లు: భారతీకి 1.5 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.6,900 కోట్లు) రుణాన్ని ఇవ్వడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంగీకరించింది. ఇందులో 0.5 బిలియన్ డాలర్లను డాలర్ల రూపంలో తన విదేశీ శాఖల ద్వారా బ్యాంకు ఏర్పాటు చేయనుంది. మిగతా బిలియన్ డాలర్లను రూపాయల్లో సమకూర్చనుంది. బ్యాంకు కన్సార్టియంలో ఎస్‌బీఐదే భీమభాగం. ఇతర రుణదాతల్లో స్టాన్‌చార్ట్(1.3 బి.డాలర్లు), బార్‌క్లేస్(0.9 బి. డాలర్లు), సిటీ, జేపీ మోర్గాన్‌లున్నాయి.