Thursday, March 25, 2010

కొందామన్నా దొరకని కరెంటు

ముంచుకొస్తున్న ముప్పు
సంక్షోభం దిశగా విద్యుదుత్పత్తి
తగ్గుముఖం పడుతున్న జలవిద్యుత్తు
ఫలించని ప్రత్యామ్నాయాలు
ఇళ్లకు మరింతగా కోత
క్యాప్టివ్‌ విద్యుత్‌పై ఆశలు
ఎండుతున్న పంటలు... ఆందోళనలో రైతులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కరెంటు లోటు నుంచి బయటపడేందుకు సర్కారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. గత నెలరోజులుగా రాష్ట్రంలో తీవ్రస్థాయిలో కరెంటు కోత అమలవుతున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజూ సగటున 250 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదవుతుంటే.. ట్రాన్స్‌కో 220 నుంచి 230 మిలియన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలుగుతోంది. సరఫరా లోటు భారీగా పెరగడంతో పల్లెల నుంచి పట్టణాల వరకు, చిన్న పరిశ్రమల నుంచి భారీ పరిశ్రమల వరకు కోత తప్పడం లేదు. ఈ నేపథ్యంలో రోజూ 500 మెగావాట్లు కరెంటు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. కేరళ నుంచి కొనుగోలు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా... అక్కడ నుంచి కూడా అనుకున్న మేర సరఫరా లేదు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలకు అనుబంధంగా ఉన్న క్యాప్టివ్‌ విద్యుత్‌ కేంద్రాల నుంచి వీలైనంత ఎక్కువగా కరెంటును ఉత్పత్తి చేయించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. చిన్నా చితకా కేంద్రాలతో సహా ఉత్పత్తి చేసినా రోజూ 200 మెగావాట్లకు మించి అందుబాటులోకి రావడం లేదు. ఇందులో నవభారత్‌ నుంచి 90 మెగావాట్లు వస్తోంది. క్యాప్టివ్‌ కరెంటు ఎక్కువ దొరికితే చిన్న తరహా పరిశ్రమలకు కోత తగ్గించే వీలుంటుందని అధికారులు అంచనా వేశారు. కానీ ఆచరణలో అది వీలుకాకపోవడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రబీ చివరి దశలో ఉండటంతో గృహ వినియోగంపై కోతను మరింత పెంచడంతోపాటు పరిశ్రమలకు కోతను కొనసాగిస్తోంది.

వ్యవసాయానికి కూడా అవసరం మేరకు కరెంటు అందించకపోవడంతో నల్గొండ, మెదక్‌, అనంతపురం, మహబూబ్‌నగర్‌ వంటి జిల్లాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు సబ్‌స్టేషన్లు ముట్టడించి ఆందోళనలకు దిగుతున్నారు. పరిశ్రమల యాజమాన్యాలు, కార్మికులు రోడ్డెక్కుతున్నారు. గురువారంనాడు హైదరాబాద్‌లో భారీ ప్రదర్శన, ధర్నా నిర్వహించాలని వారు నిర్ణయించాయి. మరో వైపు జలవిద్యుత్‌ ఉత్పత్తి పడిపోతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధికారులు చేస్తున్న ప్రత్యామ్నాయ ప్రయత్నాలు ఫలించడం లేదు.

మీరైనా కొనుక్కోండి!
పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా కరెంటు ఇవ్వడంలో విఫలమైన సర్కారు... ఎవరైనా బయట నుంచి కొనుక్కుంటే సరఫరా చేస్తామంటూ ప్రకటించింది. కానీ రోజూ ఒక మెగావాట్‌ కంటే ఎక్కువ కరెంటును వినియోగించే పరిశ్రమలకు మాత్రమే ఇది వీలవుతుంది. అంతకంటే తక్కువ కరెంటును వినియోగించే పరిశ్రమలకు లోటెన్షన్‌ లైన్ల ద్వారా కరెంటు ససరఫరా చేస్తున్నారు. ఒకవేళ పరిశ్రమలు బయట కొనుగోలు చేసినా... అవి లోటెన్షన్‌ లైన్ల పరిధిలో ఉన్నందున సాధారణ కోతలు వీటికీ అమలవుతాయి. ఫలితంగా ప్రత్యేకంగా కరెంటును కొనుగోలు చేసినా ఉపయోగపడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో పరిశ్రమలు ముందుకు రావడం లేదు. ఇప్పటి వరకూ బయట నుంచి కరెంటు కొనుగోలు చేస్తామని పెన్నా సిమెంట్స్‌, మరో కంపెనీ మాత్రమే ముందుకొచ్చాయని తెలిసింది.