1200 కనెక్షన్లుంటే మంజూరు
331 డీలర్‌షిప్‌లు కేటాయించిన కేంద్రం
తీరనున్న గ్రామీణ ప్రజల కష్టాలు

రాష్ట్రంలో 1.05కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, 920 మంది డీలర్లు మాత్రమే ఉన్నారు. ఒక్కోడీలర్ దగ్గర పదివేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. గ్రామీణ ప్రాంత వినియోగదారులు గ్యాస్ తెచ్చుకోవాలంటే దాదాపు 70కిలోమీటర్ల నుంచి 100కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. ఇంతదూరం డీలర్ డోర్ డెలివరీ ఇవ్వకపోవడంతో వినియోగదారులు నానా కష్టాలు పడుతున్నారు. రాష్ట్రంలో దాదాపు 40 లక్షల దీపం కనెక్షన్లు ఉన్నాయి. వీరంతా పేదలుకావడంతో కిలోమీటర్ల కొద్దీ దూరం వెళ్లి సిలిండర్ తెచ్చుకోలేకపోతున్నారు. ఈ ఇబ్బందులు ఎదుర్కోలేక కొందరు తమ సిలిండర్లను ఇతరులకు తాత్కాలికంగా ఇచ్చేస్తున్నారు.
విత్రక్ పథకంతో అందుబాటులోకి: ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 50 శాతం ప్రజలకు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం రాజీవ్‌గాంధీ గ్రామీణ ఎల్‌పీజీ విత్రక్ పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా రాష్ట్రానికి 331 డీలర్‌షిప్‌లు కేటాయించింది. ఒక గ్రామం లేదా రెండు గ్రామాల పరిధిలో 1200 కనెక్షన్లుంటే అక్కడ డీలర్‌షిప్ ప్రారంభిస్తారు. ఆయా గ్రామాల కనెక్షన్‌దారులు ఆ డీలర్ దగ్గరకు వెళ్లి ఖాళీ సిలెండర్ ఇస్తే, వెంటనే కొత్తది ఇచ్చేస్తారు. రాష్ట్రంలో 331 డీలర్‌షిప్‌లు ప్రారంభించడం వల్ల దాదాపు అన్ని ప్రాంతాల్లో గ్యాస్ వినియోగదారులకు దగ్గర్లోనే సిలిండర్లు అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
పేదలకే డీలర్‌షిప్‌లు: కొత్తగా కేటాయించిన డీలర్‌షిప్‌లను పేదలకే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. వీరికి కొన్ని రాయితీలు కూడా ప్రకటించింది. సాధారణంగా గ్రామాల్లో డీలర్‌షిప్ ఇవ్వాలంటే పెద్ద గోదాము నిర్మాణంతోపాటు డీలర్‌షిప్ కార్యాలయం తదితర ఏర్పాట్ల కోసం రూ.15 లక్షలకు పైబడే వ్యయం చేయాల్సి వస్తుంది. ఇదే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇంకా ఎక్కువ అవుతుంది. ఇది కాకుండా పట్ణణ ప్రాంతాల్లో రూ.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.2.50 లక్షలు డిపాజిట్ కింద చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. విత్రక్ పథకం కింద డీలర్‌షిప్ ఏర్పాటు చేయాలంటే 300 సిలిండర్లు పట్టే చిన్న గోదాము సరిపోతుంది. ఇంటినే కార్యాలయంగా చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ వారైతే డిపాజిట్ చెల్లించక్కర్లేదు. మిగిలినవారైతే రూ.2 లక్షలు చెల్లించాలి. దారిద్య్రరేఖకు దిగువున ఉన్నవారిని కొన్ని నిబంధనలకు లోబడి డీలర్లుగా ఎంపిక చేస్తారు. దీనికి సంబంధించి తొలుత పత్రికలో ప్రకటన ఇస్తారు. డీలర్‌షిప్ కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు వస్తే, ఓ ప్రముఖుని సమక్షంలో లాటరీ తీసి డీలర్‌ను నియమిస్తారు. పురుషుడు డీలర్‌షిప్ పొందితే, అతడి భార్యకు అందులో 50 శాతం వాటా ఉండేలా నిబంధన విధించారు. త్వరలో ఈ ప్రక్రియ మొదలుకానుంది.