Saturday, March 27, 2010

ఎఫ్‌డిఐ నిబంధనలు మరింత సరళతరం

న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం సరళతరం చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ప్రతిపాదన విలువ 1200 కోట్ల రూపాయల లోపు ఉన్న పక్షంలో సదరు ప్రతిపాదనలపై ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీతో నిమిత్తం లేకుండా ఆర్థిక మంత్రి స్వయంగా నిర్ణయం తీసుకుంటారు.

ఈ ప్రతిపాదనలను తొలుత విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి పరిశీలించి తన సిఫారసులను ఆర్థిక మంత్రికి తెలియజేస్తుంది. ఇప్పుడున్న నిబంధనలప్రకారం 600 కోట్ల రూపాయలు దాటిన విదేశీ పెట్టుబడి ప్రతిపాదనలన్నింటిపైనా కేబినెట్ కమిటీనే తుదినిర్ణయం తీసుకుంటున్నది. ఎఫ్‌డిఐ నిబంధనల్లో మార్పులకు సంబంధించిన విషయం పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

1200 కోట్ల రూపాయల లోపు ప్రతిపాదనల్లో కూడా దేశభద్రత వంటి అంశాలు ఇమిడి ఉన్న ప్రత్యేక కేసులను మాత్రం కేబినెట్ కమిటీ పరిశీలనకు పంపిస్తారు. ఇదిలా ఉండగా అదనపు పెట్టుబడులకు, కొత్తగా ఆటోమేటిక్ రూట్‌కు మార్చిన రంగాల్లోనూ, గరిష్ట పరిమితి ఎత్తివేసిన రంగాల్లోనూ పెట్టుబడుల విషయంలో కూడా విదేశీ ఇన్వెస్టర్లు ఇకపై ప్రభుత్వం నుంచి లేదా ఎఫ్ఐపిబి నుంచి అనుమతులు తీసుకోవల్సిన అవసరం లేదు. నిబంధనల మార్పు వల్ల విదేశీ సంస్థలకు వెసులుబాటు లభిస్తుంది.