
ఈ ఏడాది రాష్ట్రంలో చెరకు విస్తీర్ణం తగ్గడమే కాక, కరవు పరిస్థితుల వల్ల దిగుబడులూ కుదించుకుపోయాయి. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, తమిళ నాడులలో కూడా ఇదే పరిస్థితి. ఫలితంగా సీజన్ ప్రారంభం నుంచే ధరలు భారీగా పలికాయి. అన్ సీజన్‌లో ఈ ధరలు మరింత పెరుగుతాయని వ్యాపారులు తలపోశారు. పూర్తి స్థాయిలో చెరకు లభ్యం కానందున చాలా కర్మాగారాలు లక్ష్యం పూర్తి చేయకుండానే క్రషింగ్‌ను ముగించినందున రైతులు ఉన్న చెరకును బెల్లం తయారీకి వినియోగిస్తున్నారు. దీంతో బెల్లం తయారీ పెరిగింది. అందుకు అనుగుణంగా గిరాకీ లేకపోవడం వల్ల సంక్రాంతి పండుగ తరువాత నుంచి ధరలు తగ్గుముఖం పట్టాయి.
విశాఖ జిల్లా అనకాపల్లి మార్కెట్ జాతీయ స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడకు విశాఖ, శ్రీకాకుళం, విజయనగం జిల్లాల నుంచే కాకుండా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి రైతులు బెల్లం తీసుకువస్తారు. డిసెంబరు - ఏప్రిల్ మధ్య చెరకు పక్వ దశకు వస్తుంది. దీంతో ఈ కాలంలోనే రైతులు జోరుగా బెల్లం తయారు చేస్తారు. ఈ అయిదునెలలు కాలంలో రోజుకు 20 నుంచి 30వేల బెల్లం దిమ్మలు (ఒక్కొక్క దిమ్మ 13 నుంచి 16 కిలోల బరువు ఉంటుంది) అనకాపల్లి మార్కెట్‌లో అమ్మకాలు చేస్తారు. సీజన్‌లో అధికంగా వచ్చేబెల్లంలో కొంత సరకును వ్యాపారులు కొనుగోలు చేసి నిల్వలు చేస్తారు. అన్‌సీజన్‌లో (జూన్- నవంబరు మధ్య) తిరిగి అమ్మకాలు చేస్తారు. బెల్లం అధికంగా వచ్చే సమయంలో అనకాపల్లి వ్యాపారులతో పాటు రాష్ట్రంలోని కామారెడ్డి, చిత్తూరు వ్యాపారులు కూడా ఇక్కడ బెల్లం కొనుగోలు చేసి నిల్వలు వేస్తారు.