Monday, March 29, 2010

హోటళ్లుగా ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహాలు

వచ్చే ఏడాది 'విజిట్‌ ఆంధ్రప్రదేశ్‌'
ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటన
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పర్యాటకులకు తక్కువ ఖర్చుతో వసతి కల్పించేందుకుగాను రోడ్డు, భవనాల అతిథి గృహాలను త్వరలో గొలుసు బడ్జెట్‌ హోటళ్లుగా మార్చనున్నట్లు ముఖ్యమంత్రి రోశయ్య ప్రకటించారు. హైదరాబాద్‌ను వైద్య పర్యాటక రాజధానిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.పర్యాటక రంగానికి సంబంధించి రాష్ట్రానికి రూ.1500 కోట్ల మేర పెట్టుబడులు తీసుకురావడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఆదివారం ఇక్కడ పర్యాటకశాఖ మంత్రి జె.గీతారెడ్డి, కార్యదర్శి జయేష్‌రంజన్‌ తదితర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు, ఆ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. రూ.10 లక్షల పెట్టుబడితో ఇతర పరిశ్రమల్లో 18 మందికి ఉపాధి దొరికే అవకాశముందని, పర్యాటక రంగంలో అయితే ఆ మొత్తంతో 78 మందికి ఉపాధి కల్పించవచ్చని చెప్పారు. సాహస, భక్తి, సముద్రతీర పర్యాటకాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. విదేశీయులను ఆకట్టుకునేలా వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. తిరుపతి, శ్రీశైలం, భద్రాచలం, అన్నవరం, సింహాచలాన్ని భక్తి పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్‌లోని కుతుబ్‌షాహీ సమాధులు, వరంగల్‌లోని కాకతీయ కాలం నాటి కట్టడాలకు ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలన్నారు. మేడారంలో గిరిజన మ్యూజియం అభివృద్ధి పనులు ప్రారంభించాలని పేర్కొన్నారు.

పర్యాటకులను ఆకర్షించడానికి రోడ్‌ షోలు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. మరోవైపు వచ్చే ఏడాది 'విజిట్‌ హైదరాబాద్‌' ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఆకర్షణీయమైన ప్యాకేజీలతో సందర్శకులను రప్పిస్తామని అధికారులు తెలిపారు. కేంద్రం సహకారంతోమొత్తం 35 ప్రాజెక్టులు చేపడుతున్నామని, వీటిలో నితమ్‌, నైట్‌బజార్‌, కొల్లేరు సరస్సు అభివృద్ధి, ఇడుపులపాయలో గోల్ఫ్‌కోర్సు తదితర ప్రాజెక్టులు ఉన్నట్లు తెలిపారు. నిజాం సాగర్‌ వద్ద బృందావనం, అనంతగిరిలో సాహస పర్యాటక కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనలున్నాయని గీతారెడ్డి తెలిపారు.