Saturday, March 27, 2010

చౌక కారుపై బజాజ్‌ ఆటోతో ఒప్పందం కుదరాల్సిఉంది

నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ వ్యాఖ్య
న్యూఢిల్లీ: అతి తక్కువ ఖరీదు కారును (అల్ట్రా లో-కాస్ట్‌ కార్‌) ఉత్పత్తి చేసేందుకు రెనాల్ట్‌ కంపెనీతో కూడిన తమ భాగస్వామ్య కూటమి, బజాజ్‌ ఆటోతో ఒక ఒప్పందాన్ని ఇంకా కుదుర్చుకోవలసి ఉందని నిస్సాన్‌ పేర్కొంది. యూఎల్‌సీ డిజైనింగ్‌, అభివృద్ధి, ఉత్పత్తిని బజాజ్‌ ఆటో, అమ్మకాలు, మార్కెటింగ్‌ బాధ్యతలను భాగస్వామ్య సంస్థ చూసుకొంటాయని రెనాల్ట్‌-నిస్సాన్‌ కూటమి సారథి కార్లోస్‌ ఘోస్న్‌ చెప్పిన నాలుగు నెలల తరువాత ఇపుడు ఈ వ్యాఖ్య వెలువడటం గమనార్హం. నిర్వహణ వ్యయం రీత్యా ఈ కారు భారత్‌లో చాలా చౌకగా ఉండే అవకాశం ఉందని కూడా అప్పట్లో ఘోస్న్‌ చెప్పారు. కాగా నిస్సాన్‌ మోటార్‌ ఇండియా ఎండీ, సీఈఓ కిమినోబు తుకుయమ శుక్రవారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ, '2012లో ఏదో ఒకప్పుడు ఆ కారును తెస్తామని ఈసరికే చెప్పాం.. ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాల్ని తగిన సమయంలో ప్రకటిస్తామ'న్నారు. కారు ఉత్పత్తి, దాని తయారీ ప్రదేశాలు, పెట్టుబడి స్వరూప స్వభావాలపైన (ఒకవేళ సంయుక్త సంస్థను ఏర్పాటు చేసేటట్లయితే) మూడు భాగస్వామ్య కంపెనీలు తుది నిర్ణయాన్ని తీసుకున్నాయా? అని అడిగిన ఓ ప్రశ్నకు తొకుయమ పైవిధంగా జవాబిచ్చారు.

నిజానికి 2011కల్లా ఈ కారు భారత్‌లో విడుదల కావాలి. కానీ కారు ధర, డిజైన్‌లపై భాగస్వామ్య కంపెనీల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కారు ధర 2,500 డాలర్లు (రూ.1,15,000) ఉండాలని రెనాల్ట్‌ కోరుకుంది. 2008 మే నెలలో కుదిరిన ఎంఓయూ ప్రకారం యూఎల్‌సీ సంయుక్త సంస్థలో బజాజ్‌ 50 శాతం వాటా, రెనాల్ట్‌, నిస్సాన్‌లు చెరి 25 శాతం వాటా కలిగి ఉంటాయి. మహారాష్ట్రలోని చకాన్‌లో సరికొత్తగా నిర్మించే కర్మాగారంలో యూఎల్‌సీని తయారు చేసి ఏడాదికి 4 లక్షల యూనిట్లను మార్కెట్‌లోకి తెస్తామని ఈ కంపెనీలు ప్రకటించాయి. ఈ నెల మొదట్లో జెనీవా మోటార్‌ షో సందర్భంగా నిస్సాన్‌ మోటర్‌ కో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కాలిన్‌ డాడ్జ్‌ మాట్లాడుతూ, భారత మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని తయారు చేయాలనుకొన్న యూఎల్‌సీకి ఇంజినీరింగ్‌ నమూనాను తమ భాగస్వామ్య కంపెనీల్లో ఏదీ కూడా ఇంకా కనుగొనలేదన్నారు.

గత రెండేళ్ల నుంచి యూఎల్‌సీని తయారుచేసేందుకు బజాజ్‌ ప్రయత్నాలు చేస్తోందని, దాని రూపకల్పన అంత సులువేం కాదని తొకుయమ చెప్పారు. ఇందుకోసం ఎన్నో రకాల ఇంజినీరింగ్‌ సేవలు అవసరమవుతాయని వివరించారు. కాగా భారతదేశంలో నిస్సాన్‌ పదో డీలర్‌షిప్‌ను శుక్రవారం ప్రారంభించింది. 2013 నాటికి వీటి సంఖ్యను 82కు పెంచుకొని, ప్రతి ఏటా లక్ష కార్లను విక్రయించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.