Saturday, March 27, 2010

ఆ సొమ్ములు కట్టాల్సిందే!

ఎగుమతిదార్లకిచ్చిన రాయితీలను
ఉపసంహరించిన ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ: సరకు కొనుగోలుదార్ల నుంచి చెల్లింపులను పొందలేని ఎగుమతిదారుల నుంచి సుంకాలను తిరిగి వసూలు చేయాలని రికవరీ ఆఫ్‌ డ్యూటీ డ్రాబ్యాక్‌) కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎగుమతులు క్షీణించడంతో గత ఏడాది ఆగస్టులో వాణిజ్య పన్నుల శాఖ పలు రాయితీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ రాయితీని ఉపసంహరించారన్న మాట. ఈ తాజా ఉత్తర్వులను ఉపసంహరించాల్సిందిగా కోరనున్నట్లు భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) తెలిపింది.

ఎగుమతిదార్లు దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై చెల్లించిన సుంకాలను, దేశీయంగా సేకరణకు చెల్లించిన ఎక్సైజ్‌ సుంకాలను వారికి వాపసు చేసింది. గత ఏడాది ప్రభుత్వం ఈ డ్రాబ్యాక్‌ రూపేణా ఎగుమతిదార్లకురూ.5,000 కోట్లను వాపసు ఇచ్చింది. అయితే ముడిపదార్థాలతో సరకు తయారు చేసి, ఎగుమతి చేసిన వారికి, ఆ సరకును కొనుగోలుచేసిన వారి నుంచి చెల్లింపులు అందకపోతే కస్టమ్స్‌ చట్టాన్ని ప్రయోగించాలని నూతనంగా ఆదేశాలు జారీ అయ్యాయి. వారికి వాపసు చేసిన సుంకాల మొత్తాలను వసూలు చేయాలని కస్టమ్స్‌, ఎక్సైజ్‌ చీఫ్‌ కమిషనర్లకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్సైజ్‌&కస్టమ్స్‌ (సీబీఈసీ) నుంచి ఆదేశాలు అందాయి.