Friday, March 26, 2010

సెకనుకు పైసా లోపే

వీడియోకాన్‌ జీఎస్‌ఎం సేవలు ప్రారంభం
వంద రోజుల్లో 100 నగరాలకు విస్తరిస్తాం
'ఐపీఎల్‌' ప్రయత్నాలు కొనసాగుతాయి: ధూత్‌
చెన్నై, న్యూస్‌టుడే:మొబైల్‌ సేవల రంగంలోకి వీడియోకాన్‌ అడుగుపెట్టింది. ఇప్పటికే వివిధ ఉత్పత్తుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన 'వీడియోకాన్‌' ఇక్కడ జీఎస్‌ఎం సేవలు మొదలుపెట్టింది. గురువారం చెన్నైలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో వీడియోకాన్‌ ఛైర్మన్‌ వేణుగోపాల్‌ ధూత్‌ వీడియోకాన్‌ జీఎస్‌ఎం సేవలను ప్రారంభించారు. 'ఈ రంగం ఎంతో అభివృద్ధి సాధిస్తోంది. ఇంకా ఎదిగేందుకు చాలా అవకాశముంది. అందుకే తాము జీఎస్‌ఎం సేవలు ప్రారంభిస్తున్నామని' ఆయన తెలిపారు. సెకనుకు పైసా ఆఫర్‌తో పలు కంపెనీలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. మా ఆఫర్‌ పైసాకంటే తక్కువగా ఉంటుందని చెప్పారు. దేశంలో వచ్చే మూడేళ్లలో రూ.14 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన గురువారం మొట్టమొదటగా తమిళనాడులో సంస్థ సేవలను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, హర్యానా, కేరళ, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో కార్యకలాపాలను అతి త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. వచ్చే 100 రోజుల్లో దేశవ్యాప్తంగా వంద నగరాలు, పట్టణాల్లో సేవలు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు. ప్రస్తుతం తమిళనాడులో 3వేల టవర్లు ఆరంభిస్తున్నామని, తమ కార్యకలాపాలతో రాష్ట్రవ్యాప్తంగా 20 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. త్రీజీ సేవలకోసం కూడా దరఖాస్తు చేశామని, వచ్చే మూడేళ్లలో ఈ రంగంలో ఉన్న మూడు ప్రముఖ కంపెనీల్లో ఒక కంపెనీగా అవతరిస్తామని వేణుగోపాల్‌ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. వినియోగదారులకు ప్రస్తుత మార్కెట్‌ కంటే తక్కువ ధరలకే నాణ్యమైన సేవలు అందించడం తమ లక్ష్యమని ఇదే నినాదంతో వచ్చే మూడేళ్లలో 10 కోట్ల ఖాతాదారులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. కళాశాల రోజుల్లో పుణె క్రికెట్‌ జట్టుకు సారథిగా వ్యవహరించానని, ఆ ఆటపై ఎంతో ఆసక్తి ఉందన్నారు. అందుకే ఈసారి ఐపీఎల్‌ బిడ్‌లో పాల్గొన్నామని, అయితే అవకాశం చేజారడం కొంత దురదృష్టమన్నారు. తాము భవిష్యత్తులోనూ ఐపీఎల్‌ జట్టు కోసం ప్రయత్నాలను కొనసాగిస్తామన్నారు.

'3జీ' దక్కించుకొంటాం: 3జీ స్పెక్ట్రమ్‌ అన్ని కోసం దరఖాస్తు చేసుకున్న తమకు లైసెన్స్‌ లభిస్తుందని దూత్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈసేవల కోసం ఎంత మొత్తంలో పెట్టుబడులు పెట్టనున్నది లైసెన్స్‌ వచ్చాకే నిర్ణయిస్తామని ఆయన తెలిపారు.