గ్రాట్యుటీ రూ. 7లక్షలకు పెంపు
ఉద్యోగులకు ప్రత్యేక భత్యాలు
హైదరాబాద్,న్యూస్‌టుడే:విశ్రాంత ఉద్యోగి వయస్సు పెరిగే కొద్దీ అదనపు పెన్షన్ అందుతుంది. అతనికి 75 ఏళ్లు వయసు వచ్చినప్పటి నుంచి నిర్దేశించిన మేరకు అదనపు మొత్తం పెన్షన్‌లో కలుస్తుంది. కుటుంబ పెన్షన్‌కు కూడా ఇది వర్తిస్తుంది. కనీస పెన్షను రూ.3,350కు పెరిగింది. ఉద్యోగి పదవీ విరమణ చేసేటప్పుడు ఇచ్చే గ్రాట్యుటీ మొత్తం ఇక రూ. 7లక్షలు సమకూరుతుంది. ప్రస్తుతం ఇది రూ.3.5లక్షలు మాత్రమే ఉంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. తొమ్మిదో వేతన సవరణ సంఘం(పీఆర్‌సీ) సిఫార్సులకు అనుగుణంగా ఇలాంటి 11 ఉత్తర్వులను ప్రభుత్వం మంగళవారం జారీ చేసింది. వివిధ భత్యాలు కొత్త ఫిట్‌మెంట్ అమల్లోకి వచ్చిన ఫిబ్రవరి నెల నుంచి కాకుండా ఉత్తర్వులు వెలువడిన తేదీ నుంచి మాత్రమే వర్తిస్తాయి. వివిధ ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. *విశ్రాంత ఉద్యోగులకు పెరిగిన మొత్తం 2008 జూలై ఒకటి నుంచి నోషనల్(పత్రాల్లోనే)గా ఉంటుంది. 2010 ఫిబ్రవరి నుంచి నగదుగా అందుతుంది.
* పెన్షన్‌ను 39 శాతం ఫిట్‌మెంట్, 42.39 శాతం కరవు భృతితో 2008 జులై ఒకటి నాటికి నిర్ధారిస్తారు. 2010, జనవరి 31 వరకు తీసుకున్న తాత్కాలిక భృతిని ప్రభుత్వానికి తిరిగి చెల్లించనవసరంలేదు.
* విశ్రాంత ఉద్యోగికి ఇక వైద్యభత్యం నెలకు రూ. 200.
* ఉద్యోగి సర్వీసు 33 సంవత్సరాల కన్నా తగ్గితే గతంలో ఇచ్చిన 3 ఏళ్ల వెయిటేజీని ఇప్పుడు 5 ఏళ్లకు పెంచారు. అంటే గతంలో 30 ఏళ్ల సర్వీసు ఉన్న వారు మూడేళ్ల వెయిటేజీతో పూర్తి పెన్షన్ పొందితే... ఇప్పుడు 28 ఏళ్ల సర్వీసు ఉన్న వారు కూడా ఐదేళ్ల వెయిటేజీతో పూర్తి పెన్షన్ పొందే అవకాశం వచ్చింది.
* పెన్షన్‌లో 40 శాతం విక్రయానికి అవకాశం.
* అంత్యక్రియల ఖర్చు రూ. 5వేల నుంచి రూ. 10 వేలకు పెంపు.
* కనీస పెన్షన్ రూ. 1,925 నుంచి రూ. 3,350కు చేరిక. ఒకే కుటుంబంలోని కుటుంబ, సర్వీసు పెన్షన్లకు ఇదే మొత్తం వేర్వేరుగా వర్తింపు. కరవు భృతి మాత్రం ఒక పెన్షన్‌కే అందజేత.
* కొందరు విశ్రాంత ఉద్యోగులకు అందిస్తున్న ప్రత్యేక సహాయం రూ.1,500 నుంచి రూ.3,350కు పెంపు.
* వివిధ శాఖల్లోని ఉద్యోగులకు రిస్కు, రేషన్, ఈఎస్‌ఐ భత్యాల పెరుగుదల. ప్రయాణ కాలం, ప్రాంతాల ఆధారంగా నిర్ణీత ప్రయాణ భత్యాలు పెంపు.
ఆన్‌లైన్‌లోనే పీఆర్‌సీ బిల్లులు
కొత్త పీఆర్‌సీ ద్వారా వేతన స్థిరీకరణ బిల్లులను ఉద్యోగులు ఆన్‌లైన్ ద్వారా ఖజానా అధికారులకు సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా జీతాల్ని పొందుతున్నవారు ఇందుకు అర్హులు. ఇందుకు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను మూడు రోజుల్లో వెలువరించనున్నట్టు ఖజానా శాఖ సంచాలకుడు నాగార్జునరెడ్డి తెలియజేశారని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్షుడు ఎన్.నారాయణ పేర్కొన్నారు.