Wednesday, April 7, 2010

అప్పు వద్దు బాబోయ్‌!

ఐపీఓ ఫైనాన్స్‌కు దూరంగా ఉంటున్న మదుపరులు
పబ్లిక్‌ ఇష్యూలకు తగ్గిన ఆకర్షణే కారణం
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాల వైపు ఎన్‌బీఎఫ్‌సీలు
ధు ఒక సాధారణ మదుపరి. రెండేళ్ల కిందటి వరకు ఏదైనా పబ్లిక్‌ ఇష్యూ(ఐపీఓ) వస్తుందంటే చాలు దానికి గరిష్ఠ స్థాయిలో దరఖాస్తు చేసేందుకు అతను ఐపీఓ ఫైనాన్స్‌ను ఆశ్రయించేవారు. అప్పట్లో ఆయనకు ఇదో లాభసాటి వ్యవహారంగా ఉండేది. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. ఎక్కువ సంఖ్యలో ఐపీఓలు మార్కెట్లోకి వస్తూ.. సూచీలు రెండేళ్ల గరిష్ఠ స్థాయుల వద్ద కదలాడుతున్నా మధు మాత్రం ఫైనాన్స్‌ జోలికి వెళ్లడం లేదు. కారణం అప్పుతో ఐపీఓలకు దరఖాస్తు చేసుకోవడం పెద్ద లాభసాటిగా కనిపించడం లేదు. మధు లాంటి మదుపరుల నుంచి ఆదరణ తగ్గడంతో ఐపీఓలకు అప్పులిచ్చే బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు(ఎన్‌బీఎఫ్‌సీ) కూడా ఆదాయం పెంచుకోవడం కోసం ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకొంటున్నాయి.

ఐపీఓ ఫైనాన్స్‌ అంటే..
పబ్లిక్‌ ఇష్యూలకు ఇచ్చే రుణాలను మార్కెట్‌ వర్గాలు 90 రోజులకు లభించే స్వల్పకాలిక రుణాలుగా పరిగణిస్తాయి. ఇందులో మదుపరులు ఐపీఓకు దరఖాస్తు చేయడానికి ఆసక్తి కనబరిస్తే చాలు. ఆయా బ్రోకేరేజీ సంస్థలు తమ ఆర్థిక విభాగాలకు చెందిన బ్యాంకింగేతర వ్యాపార సంస్థల నుంచి రుణాలను ఏర్పాటు చేస్తాయి. వీటిపై వడ్డీ సాధారణ బ్యాంకు రుణాలపై వడ్డీ కన్నా 4నుంచి 5 శాతం అధికంగా ఉంటుంది.అయితే మదుపరి ఈ రుణాలను తిరిగి చెల్లించే వరకు అతనికి చెందిన ట్రేడింగ్‌, బ్యాంకింగ్‌ ఖాతాలను నిర్వహించే అధికారం రుణదాతలకు బదిలీ అవుతుంది. రుణం తిరిగి చెల్లించే వరకు ఆయా సంస్థలు స్టాక్‌ కదలికను గమనిస్తూ మదుపరిని అప్రమత్తం చేస్తుంటాయి. స్టాక్‌ ధర ఒక్కసారిగా పడిపోతే నష్టాలను తగ్గించుకోవడం కోసం మదుపరిని ఆస్టాక్‌లు అమ్మేయాలని ఈ సంస్థలు కోరుతాయి. రుణాన్ని చెల్లించ లేకపోవడం, చెల్లింపు జాప్యాలకు షేర్లను విక్రయించగా వచ్చిన నష్టంపై అదనంగా 2% వడ్డీని కూడా వసూలు చేస్తాయి. 70% తగ్గారు.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన పలు ఐపీఓలు పెద్దగా లాభసాటిగా లేకపోవడంతో మదుపరులకు ఐపీఓ ఫైనాన్స్‌పై ఆసక్తి తగ్గింది. చాలా సంస్థల స్టాక్‌లు లిస్టింగ్‌ తరువాత పెద్దగా లాభాలను ఇవ్వడం లేదు. కొత్త పబ్లిక్‌ ఇష్యూల లిస్టింగ్‌ లాభాలూ ఆకర్షణీయంగా కనిపించకపోవడంతో చాలా మంది మదుపర్లు ఐపీఓల కోసం రుణాలు తీసుకొనేందుకు వెనకాడుతున్నారు. భారీ ప్రీమియంతో నమోదైన స్టాక్‌లకు మాత్రమే 10-15 శాతం ప్రీమియం లాభాలు వస్తున్నాయి. దీంతో మదుపరులు ఎక్కువ రిస్క్‌తీసుకోవడానికి ఇష్టపడడం లేదు. 2007 నాటి పరిస్థితులతో పోలిస్తే ఐపీఓ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య 70 శాతం తగ్గింది. అధిక నికర విలువ కలిగిన వ్యక్తులకు(హెచ్‌ఎన్‌ఐలకు) 11-13 శాతానికి, మధ్య శ్రేణి మదుపరులకు 13-14 శాతానికి, తక్కువ స్థాయి రిటైల్‌ మదుపర్లుకు 14-17% శాతానికి అప్పులు ఇస్తున్నా తీసుకొనేందుకు మందుకు వస్తున్న వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ ఆదాయం తగ్గడంతో కొన్ని సంస్థలైతే హెచ్‌ఎన్‌ఐలకు 10.5-11 శాతానికి, రిటైల్‌ మదుపరులకు 12-13 శాతానికే రుణాలను అందిస్తున్నాయి. అయినా వీరికి లభిస్తున్న స్పందన నామమాత్రమే. దీంతో ఆయాసంస్థలు ప్రమోటర్‌ ఫండింగ్‌లు, మార్జిన్‌ ఫండింగ్‌, షేర్లపై రుణాలు ఇచ్చి ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి