హైదరాబాద్( బిజినెస్ బ్యూరో ) : దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి నిదర్శనంగా వ్యవస్థీకృత రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2010-11) లో దేశం మొత్తం మీద 10 లక్షలకు పైగా నూతన ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నట్లు ప్రముఖ మానవ వనరుల విశ్లేషణ సంస్థ మాఫాయ్ నిర్వహించిన ఒక తాజా సర్వేలో వెల్లడైంది. 'మాఫాయ్ ఎంప్లాయ్‌మెంట్ ట్రెండ్స్ సర్వే' పేరుతో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐటి, ఐటిఇఎస్, ఎనర్జీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ వంటి 11 రంగాలలోని 1,000 కంపెనీలపై జరిపిన సర్వేలో ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షలకు పైగా కొత్తగా ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని తేలినట్లు మాఫాయ్ తన నివేదికలో పేర్కొంది.
వచ్చే మూడునెలలు అంతంత మాత్రం
ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద ఉద్యోగ అవకాశాలు భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉందని అయితే వచ్చే మూడునెలల కాలంలో కంపెనీలలో కొత్త ఉద్యోగ నియామకాలు అంతంత మాత్రంగా ఉంటాయని తమ సర్వేలో తేలినట్లు మాఫాయ్ తెలిపింది. దేశం మెత్తం మీద అన్ని రంగాల కంపెనీలు వ్యయ నియంత్రణ పట్ల అప్రమత్తంగా ఉన్నప్పటికీ పెరుగుతున్న వ్యాపార అవసరాలను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో ఉద్యోగ నియామకాలు చేపట్టక తప్పదని పేర్కొంది. ఐటి నియమకాలలో ప్రస్తుతం కొంత మేరకు సందిగ్ధత ఉన్నప్పటికీ రానున్న కాలంలో జోరు పెరుగుతుందని అంచనా వేసింది.
అత్యధికంగా హెల్త్ కేర్ రంగంలో...
ఆరోగ్య పరిరక్షణ రంగం అన్ని రంగంలో కంటే అత్యధికంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,95,000 నియమకాలు జరిగే అవకాశం ఉందని మాఫాయ్ పేర్కొంది. ప్రైవేటు రంగంలోని ఆస్పత్రులు పెద్ద ఎత్తున విస్తరణ కార్యక్రమాలను చేపట్టాయని, కార్పొరేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చిన్న పట్టణాలకు సైతం విస్తరిస్తున్నాయని, దీంతో హెల్త్ కేర్ రంగంలో భారీ స్థాయిలో నియామకాలకు అవకాశం ఉందని తమ సర్వేలో తేలినట్లు మాఫాయ్ తెలిపింది.
ఆతిథ్య, పర్యాటక రంగం పుంజుకుంటోందని 2010-11 సంవత్సరంలో ఈ రంగంలో దేశంలో కొత్తగా1,37,000 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపింది. 2010 సంవత్సరంలో దేశంలో కొత్తగా 15,600 హోటల్ గదులు వస్తున్నాయని, 2011నాటికి దేశంలో 40 అంతర్జాతీయ హోటల్స్ ఈ రంగంలో ఉంటాయని పేర్కొంది. రానున్న రోజుల్లో నియామకాల విషయంలో హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ రంగం ద్వితీయ స్థానంలో నిలుస్తుందని మాఫాయ్ పేర్కొంది.
ఐటి, ఐటిఇఎస్‌లో 97,000 నియామకాలు
ఐటి, ఐటిఇఎస్ రంగంలో రానున్న రోజుల్లో దేశీయ ఐటి కంపెనీలు అనేక అంతర్జాతీయ కాంట్రాక్టులను చేజిక్కించుకోనున్నాయని, ప్రస్తుతం ఐటి రంగంలో నియామకాలు కొంత స్తబ్దుగా ఉన్నప్పటికీ రానున్న రోజుల్లో ఊపందుకుంటాయని దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొత్తం మీద 97,000 ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉందని పేర్కొంది.
రియల్ ఎస్టేట్ అండ్ కన్‌స్ట్రక్షన్ రంగం పుంజుకుంటోందని ఈ రంగంలో 13,600 నియామకాలు, ఉత్పత్తుల రంగంలో 68,000 నియామకాలు, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో 46,000 నియామకాలు, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్‌లో 83,000 నియామకాలు జరిగే అవకాశం ఉందని వెల్లడించింది.