Thursday, April 1, 2010

మహానగరాల్లో పెట్రో మంట

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు బుధవారం అర్ధరాత్రి నుంచి లీటర్‌కు 50 పైసల మేరకు పెరిగాయి. ఢిల్లీ, ముంబాయితో సహా దేశంలోని 13 పెద్ద నగరాలకు పెరిగిన ధరలు వర్తిస్తాయి. స్వచ్ఛమైన యూరో-4 రకం ఇంధనాన్ని గురువారం నుంచి సరఫరా చేస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలో లీటర్‌ పెట్రోలుపై 50 పైసలు పెరగ్గా ధర రూ 47.93కు చేరుకుంది. డీజిల్‌కు లీటర్‌పై 26 పైసలు పెరిగి ధర రూ 38.10కు చేరింది. ఢిల్లీ, ముంబాయి, కోల్‌కతా, చెనై్న, హైదరాబాద్‌, బెంగళూరు, లక్నో, కాన్పూర్‌, ఆగ్రా, సూరత్‌, అహ్మదాబాద్‌, పుణె, షోలాపూర్‌లలో పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెరిగాయి. స్థానిక పన్నులను బట్టి ఒక్కో నగరానికీ రేట్లలో స్వల్పంగా హెచ్చుతగ్గులుంటాయి.


ఈ నగరాల్లో గురువారం నుంచి యూరో-3 గ్రేడ్‌ బదులు యూరో-4 ఇంధనం సరఫరా అవుతుంది. దేశంలో మిగిలిన ప్రాంతాలు క్రమంగా యూరో -2 గ్రేడ్‌ నుంచి యూరో-3 గ్రేడ్‌ ఇంధనానికి మారుతాయి. యూరో-3 అమ్మకాలు మరో అయిదారు నెలల్లో ప్రారంభమవుతాయి. అయితే గోవాలో మాత్రం గురువారం నుంచే యూరో-3 గ్రేడ్‌ ఇంధనం అమ్మకాలు ప్రారంభమవుతాయి.యూరో-3 రకం పెట్రోలుపై లీటరుకు 26 పైసలు అదనంగా చెల్లించాల్సి వస్తే అదేరకం డీజిల్‌పై లీటర్‌కు 21 పైసలు పెరిగిందని ఒక అధికారి తెలిపారు.

పెట్రో ధరలను పెంచేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌అనుమతికోసం పెట్రోలియం మంత్రిత్వశాఖ మంగళవారం ఆయనను కలిసి, ఆమోదం పొందింది. ఒక నెల రోజుల్లో ఢిల్లీలో డీజిల్‌ ధరలు మూడోసారి, పెట్రోలు ధరలు రెండోసారీ పెరిగాయి. యూరప్‌లో కాలుష్య నియంత్రణ ప్రమాణాల్ని అనుసరించి శుద్ధి చేసిన పెట్రోల్‌ను యూరో-4 గ్రేడ్‌ అంటారు. ఆ ప్రమాణాల్ని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు ఆమోదించాయి. ఆ ప్రమాణాల ప్రకారం ఈ దేశాల్లో వాహనాలు విడుదల చేసే కాలుష్యాలపై నియంత్రణ విధించారు.

వినియోగదారులకు స్వచ్ఛమైన ఇంధనాన్ని అందించేందుకు అవసరమైన సదుపాయాలకోసం భారతదేశంలో చమురు కంపెనీలు 40 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయి. వాటిని రాబట్టుకొనేందుకు ధరల్ని పెంచాల్సివచ్చిందని అంటున్నాయి. ధర పెంచకుండా స్వచ్ఛమైన పెట్రోల్‌ను అందించడం తమవల్ల కాదని, అలా చేస్తే రోజుకు రూ 250 కోట్లు నష్టాన్ని భరించాల్సి వస్తుందని, వంటగ్యాస్‌ను ఇప్పటికే అసలు ధరకంటే తక్కువకు అందిస్తున్నామనీ పెట్రోలు కంపెనీలు చేతులెత్తేశాయి.