Wednesday, April 7, 2010

సేవాపన్ను భారం మోయలేం !

సేవాపన్ను భారం విషయంపై పునరాలోచించాల్సిందిగా బిల్డర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భూమి విలువను సేవా పన్ను నుంచి తొలగించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయంలో అవసరమయితే కోర్టు మెట్లు ఎక్కాలని క్రెడాయ్ యోచిస్తోంది. స్థలం సేవాపరిధిలోకి రాదని కాబట్టి ఈ అంశాన్ని పునఃపరిశీలించాలన్నది వారి ప్రధాన డిమాండ్.
navya. నిర్మాణంలో ఉన్న సముదాయాలపై విధించిన సర్వీస్‌టాక్స్‌లో నుంచి భూమి విలువను తొలగించాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరుతోంది. ఒకవేళ ప్రభుత్వం దిగిరాకపోతే కోర్టు తలుపులు తట్టాలని క్రెడాయ్ యోచిస్తోంది. ఏ విధంగా చూసినా స్థలం సేవా పరిధిలోకి రాదు. కాబట్టి స్థలంపై విధించిన సర్వీస్‌టాక్స్‌ను తొలగించాలి అని రియల్టర్లు కోరుతున్నారు. ఇప్పటికే స్థలం ధరంపై స్టాంప్ డ్యూటీతో సహా పలు రకాల టాక్స్‌ను చెల్లిస్తున్నాం.

ఇది చాలదు అన్నట్లుగా మరింత పన్నుభారం వేయడం వినియోగదారులపై అదనపు భారం మోపడమేనని పలువురు బిల్డర్లు అంటున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు. " సేవా పన్ను విధింపు విషయమై సర్వీస్ టాక్స్ డిపార్టుమెంట్ అధికారులతో సమావేశమయ్యాం. అధికారులకు మా వినతి పత్రాన్ని అందజేశాం. ఈ విషయంపై ఆర్థికశాఖ మంత్రిని కూడా కలవాలనుకుంటున్నాం'' అని క్రెడాయ్ ఎన్‌సిఆర్ అధ్యక్షులు ప్రదీప్‌జైన్ చెబుతున్నారు. నిర్మాణంలో ఉన్న భవనాలపై సర్వీస్ టాక్స్ 3.3 శాతం పెంచుతున్నట్లు ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల స్థిరాస్తి మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం పడనుంది.

ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఈ విషయంపై వివరణ ఇచ్చింది. నిర్మాణరంగంపై సర్వీస్‌టాక్స్ ప్రభావం నికరంగా 3.3 శాతం మాత్రమే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. నికర ఆస్తి విలువలో 33 శాతంపై మాత్రమే సర్వీస్‌టాక్స్ పెంపు వర్తిస్తుందని వివరణ ఇచ్చింది. బిల్డర్లు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. నిర్మాణ వ్యయం 3.5 శాతం మేర పెరుగుతుందని,ఇది అంతిమంగా వినియోగదారులపైనే పడుతుందని వారు అంటున్నారు.

స్థిరాస్తిమార్కెట్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ విధానాలు మరింత భారమవుతాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్న ఈ సేవాపన్ను భారంను తొలగించే అవకాశం ఉందా అని రియల్టర్లలో సందేహం వ్యక్తమవుతోంది.

ఈ విషయంపై సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సభ్యులు దుర్గేష్ శంకర్ స్పందిస్తూ మేం ఇప్పుడే ఏ విషయం చెప్పలేం. వివిధ దశల్లో పలుమార్లు సమావేశమయి చర్చించాల్సి ఉంది అని అంటున్నారు. సొంత ఇంటి కలను సాకారం చేసుకోవడానికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన ప్రభుత్వం ఈ సమయంలో సేవాపన్నును అమల్లోకి తేవడం సరైన చర్య కాదని పరిశీలకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పునఃపరిశీలించాల్సిందిగా కోరతాం
నిర్మాణరంగాన్ని సేవాపన్ను పరిధిలోకి చేర్చుతూ తీసుకున్న నిర్ణయంపై పునః సమీక్ష జరపాల్సిందిగా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆర్థికశాఖను కోరనుంది. " మరికొద్ది రోజుల్లో ఆర్థికశాఖ మంత్రిని కలిసి సేవా పన్ను అంశంపై పునఃపరిశీలించాల్సిందిగా కోరతాం'' అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి అన్నారు. ఇండియన్ రియల్ ఎస్టేట్‌పై 'అసోచామ్' ఏర్పాటు చేసిన ఒక సదస్సులో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.