Friday, April 2, 2010

అడుగు బొట్టునూ తోడేస్తున్నాం ...పరిమితి దాటుతున్న నీటి వినియోగం


అడుగు బొట్టునూ తోడేస్తున్నాం
పరిమితి దాటుతున్న నీటి వినియోగం
రాయలసీమలో మరీ ఘోరం
తెలంగాణలో ప్రమాద ఘంటికలు
గ్రేటర్‌ హైదరాబాద్‌.. మరింత దారుణం
భూగర్భ జల శాఖ ఆందోళన
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
రాష్ట్రంలో భూగర్భ జలాల పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పరిమితికి మించి నీటి వినియోగం జరుగుతుండటంతో పరిస్థితి ముప్పు స్థాయికి చేరుతోంది. కొన్నాళ్లు అనావృష్టి.. మరికొన్నాళ్లు వర్షాలతో ఏటా భూగర్భ జలాలు ఎంతోకొంత పెరుగుతున్నా వాటిని ఇష్టానుసారంగా తోడేయడంతో భూగర్భ జలాలు ఒట్టిపోతున్నాయి. అందుబాటులో ఉన్న నీటి వనరులను నూటికి నూరుశాతం వాడుకోవడంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే పరిస్థితి చేజారిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లో పరిమితిని మించుతుండటంతో ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయి. భూగర్భ జల వనరులశాఖ అధికారులు భూగర్భ జలాలపై నిర్వహించిన సర్వేలో ఆందోళనకరమైన అంశాలు వెల్లడయ్యాయి.

40 శాతం దాటిన వినియోగం..
రాష్ట్రంలో కమాండ్‌, నాన్‌కమాండ్‌ ఏరియాల్లో కలుపుకొని 34,700 ఎంసీఎం (మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల) భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 14,111 ఎంసీఎంలను (41%) తోడేశారు. 1985లో వాడకం కేవలం 28 శాతంగానే ఉండేది. 1993లో 29 శాతం, 2004 వరకు వచ్చేసరికి 45 శాతానికి చేరింది. 2005 నుంచి మంచి వర్షాలుండటంతో భూగర్భ జలాలు పెరిగాయి. వినియోగ స్థాయి 41%కు వచ్చింది. కానీ గత ఏడాది వర్షాభావ పరిస్థితులుండటంతో జలాల స్థాయి పడిపోయింది. ఈ ఏడాదీ వర్షాలు లేకపోతే ఉన్న వాటినే వినియోగించుకోవాల్సి వస్తుందని, దీంతో భూగర్భ జలాలు మరింత తగ్గిపోతాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సాగునీటి వనరులు లేని ప్రాంతాల్లో వ్యవసాయం పూర్తిగా బోర్లపై ఆధార పడటమే వినియోగానికి ప్రధాన కారణం. ప్రాంతాల వారీగా వినియోగం చూస్తే..

*భూగర్భ జలాలను తోడటంలో రాయలసీమ పరిమితిని దాటింది. సాగునీటి వనరులు లేనిచోట్ల భూగర్భ జలాలను ఏకంగా 76 శాతం వాడారు.
*అనంతపురం జిల్లాలో 11,745 ఎంసీఎం జలాలు అందుబాటులో ఉంటే అందులో 10,522 ఎంసీ ఎంలు (90 శాతం) మేర భూగర్భ జలాలను వినియోగించారు.
*తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం 51 శాతం ఉండగా, ఆంధ్రా ప్రాంతంలో 25 శాతం వరకు మాత్రమే ఉంది.
*రాష్ట్రంలోని 111 మండలాల్లో అందుబాటులోని జలాలను నూటికి నూరుశాతం తోడేయటంతో అధికారులు వాటిని డేంజర్‌ జోన్‌ జాబితాలో చేర్చారు. అందులో రాయలసీమలోని 57 మండలాలు ఉండగా, తెలంగాణ ప్రాంతంలోనివి 44 ఉన్నాయి.
*ఆంధ్ర ప్రాంతంలోని 10 మండలాలు ఈ జాబితాలో ఉండగా, వాటిలో ప్రకాశం జిల్లాలోనే ఐదు మండలాలున్నాయి.

నగరంలో జలాలు శూన్యం
భూగర్భ జలాల వినియోగంలో 'గ్రేటర్‌' డేంజర్‌ జోన్‌లో ముందు వరసలో నిలిచింది. అధికారులు తమ రికార్డుల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లా ప్రాంతాలను కలిపి రంగారెడ్డి జిల్లాగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడ 5,806 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల జలాలు అందుబాటులో ఉంటే.. అందులో గ్రేటర్‌వాసులు ఏకంగా 5,737 ఎంసీఎంల నీటిని తోడుకున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినపుడు నీరు భూమిలో ఇంకే పరిస్థితులు లేకపోవడంతో ఉన్న వనరులను 99 శాతం వాడుకున్నారు. దీంతో ప్రస్తుతం భూగర్భ జలవనరుల శాఖ రికార్డుల ప్రకారం కేవలం 689 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. రాష్ట్రంలో మరెక్కడా పరిస్థితి ఇంత దారుణంగాలేదు.

వర్షాభావంతో ప్రతికూల పరిస్థితులు...
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 861 మిల్లీమీటర్లు కాగా.. గత ఏడాది ఫిబ్రవరి వరకు 812 మి.మీ. నమోదైంది. అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వర్షపాతం దారుణంగా పడిపోయింది. వర్షాభావంతో సాధారణం కంటే 23 శాతం తక్కువగా కేవలం 665 మి.మీ. వర్షపాతం మాత్రమే నమోదైంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో కర్నూలు, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి మినహా మిగతా అన్ని జిల్లాల్లో సాధారణ వర్షం కంటే తక్కువగానే నమోదైంది. పాలమూరులో సాధారణం కంటే 22 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాలు మినహాయిస్తే.. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో భూగర్భ జలాలూ గణనీయంగా పడిపోయాయి. రాష్ట్ర సరాసరి తీసుకుంటే... గత ఏడాది ఫిబ్రవరిలో 8.83 మీటర్ల లోతులో భూగర్భ జలాలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం అవి 10.57 మీటర్లకు పడిపోయాయి.

వాల్టా పరిధిలో మరిన్ని గ్రామాలు
రాష్ట్రంలో 2004 వరకు కరవు నెలకొనడంతో 4,190 గ్రామాల్లో బోర్లు వేయవద్దంటూ భూగర్భ జల వనరుల శాఖ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. దీంతో ఆ గ్రామాలను ప్రభుత్వం వాల్టా చట్టం పరిధిలోకి తెచ్చింది. ఆ తర్వాత వర్షాలు పడటంతో 2007 నాటికి ఆ జాబితాలోని గ్రామాల సంఖ్య 3,449కు తగ్గింది. అయితే 2009లో మరోసారి వీటిపై సర్వే చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం ఆ సర్వేను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నామని భూగర్భ జలవనరుల శాఖ డైరెక్టర్‌ మురళీకృష్ణారావు తెలిపారు. గత ఏడాది సాధారణం కంటే 23 శాతం తక్కువ వర్షపాతం ఉన్నందున వాల్టా పరిధిలోని గ్రామాలు పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు.