Friday, April 2, 2010

ధరలతో సామాన్యుడు అష్టకష్టాలు


ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత సంక్లిష్టం
న్యూఢిల్లీ: ఇప్పటికే అధిక ధరలతో సామాన్యుడు అష్టకష్టాలు అనుభవిస్తున్నాడు. గురువారం నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టాం. మరి ఈ ఏడాదైనా.. ధరాభారం ఉపశమించనుందా? అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. అయితే పరిస్థితి ఏ మాత్రం శాంతించకపోగా.. ప్రజలను మరింత ఉక్కిరిబిక్కిరి చేయబోతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. అందుకు సంబంధించి కొన్ని దుశ్శకునాలను వారు విశ్లేషిస్తున్నారు.

* పాలు, పప్పు ధాన్యాల ధరలు పెరగడం వల్ల మార్చి 20తో ముగిసిపోయిన వారానికి ఆహార ద్రవ్యోల్బణం 16.35% చేరినట్లు ఆర్థిక సంవత్సరం మొదటిరోజే వెల్లడైంది. పూర్తిస్థాయి ద్రవ్యోల్బలణం కూడా త్వరలోనే రెండంకెలకు చేరనుందని స్పష్టమవుతోంది.
* బడ్జెట్‌లో పెట్రోలు ధర లీటర్‌కు రూ.2.67, డీజిల్‌ ధర రూ.2.58 ప్రభుత్వం పెంచింది. దీనికితోడు భారతీ-4 ఇంధన పేరిట 13 నగరాల్లో మరో అర్ధరూపాయి పెంచారు. ఇది మిగతా వస్తువుల ధరలపై ప్రభావం చూపనుంది.
* కార్ల తయారీ కంపెనీలు హ్యుందాయ్‌, టయోటా, జనరల్‌ మోటార్స్‌ మోడల్‌ను బట్టి వాహనాల ధరలను రూ.30వేల వరకూ పెంచాయి.
* దక్షిణ భారత దేశంలో సిమెంటు ధరలు రూ.20-40 వరకూ పెరిగినట్లు సిమెంటు తయారీదార్ల సంఘానికి చెందిన వర్గాలు పేర్కొన్నాయి. పశ్చిమభారత దేశంలో రూ.2-5 వరకూ పెరిగినట్లు తెలిపాయి.
* ఇళ్ల ధరలు, గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగే ప్రమాదం ఉంది. దీనికి తోడు 2010 ఆర్థిక బిల్లు ఆమోదంపొందగానే బడ్జెట్‌లో పేర్కొన్న విధంగా నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలపై సేవా పన్ను వసూలు చేస్తారు.
* ద్రవ్య విధానాన్ని ఆర్‌బీఐ మరింత కట్టుదిట్టం చేస్తుండడంతో వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* బడ్జెట్‌ ప్రవేశపెట్టాక ఉక్కు కంపెనీలు టన్నుకు రూ.600 చొప్పున పెంచాయి. ఉత్పాదక ఖర్చు పెరగడంతో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి.
* సబ్సిడీని పాక్షికంగా ఉపసంహరించడం వల్ల ఢిల్లీలో గ్యాస్‌ ధర రూ.281.20 నుంచి రూ.310కి పెరిగింది.