Monday, April 19, 2010

మరో నెలలో తలసరి ఆదాయం పెరుగుదల!

హైదరాబాద్‌: ముందస్తు అంచనా ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.28,384. వచ్చే నెల్లో ఇది ఇంకా పెరగబోతోంది. రాష్ట్ర అర్ధగణాంక శాఖ.. కొత్త ధరలను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర స్థూల రాష్ట్రోత్పత్తి (జీఎస్‌డీపీ)ని అంచనా వేయనుండటమే ఇందుకు కారణం. రాష్ట్ర అభివృద్ధికి జీఎస్‌డీపీ కొలబద్ద. వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగాలకు చెందిన 17 విభాగాల్లోని ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని దీన్ని లెక్కగడతారు. రాష్ట్రం తెచ్చే అప్పులకు జీఎస్‌డీపీనే ప్రాతిపదిక. దీని లెక్కంపునకు వచ్చే నెల నుంచి 2004-05 ధరలను పరిగణనలోకి తీసుకోబోతున్నారు. అందువల్ల జీఎస్‌డీపీలో పెరుగుదల కనిపిస్తుంది.

ఎందుకీ మార్పు?: దీని అంచనాకు ప్రస్తుత ధరలను కాకుండా పాత సంవత్సరం ధరలను పరిగణనలోకి తీసుకోవటం సహజం. దీన్నే ఆధార (బేస్‌) సంవత్సరంగాను, అప్పటి ధరలను 'స్థిరమైన' ధరలుగాను వ్యవహరిస్తారు. ఆధార సంవత్సరం అయిదేళ్లకోసారి మారుతూ ఉంటుంది. గత అయిదేళ్లుగా 1999-2000 ఆధార సంవత్సరంగా ఉంది. వచ్చే నెల నుంచి ఇది 2004-05కు మారబోతోంది.