
పాక్ కోడలిగా సానియా మీర్జా
సందడిగా షోయబ్‌తో నిఖా
మెహర్‌గా రూ.61 లక్షలు
కుటుంబ సభ్యులు, ఆత్మీయులే హాజరు
హైదరాబాద్ - న్యూస్‌టుడే
భారత్, పాక్‌ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగితే నరాలు తెగే ఉత్కంఠ నెలకొంటుంది. భోజనం సంగతి సైతం మరచి ప్రేక్షకులు బుల్లితెరకు అతుక్కుపోతారు. అచ్చూ ఇలాంటి ఉత్కంఠ మధ్య సరిహద్దుల్ని చెరిపేస్తూ భారత టెన్నిస్ సంచలనం సానియామీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ 'నిఖా'తో ఓ ఇంటివారయ్యారు. వివాదాలకు ముగింపు పలికి వివాహబంధంతో దగ్గరయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు తాజ్‌కృష్ణా హోటల్‌లో కుటుంబసభ్యులు, అతిథులు, ఆత్మీయుల మధ్య వారి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. కేవలం పది నిమిషాల వ్యవధిలో నిఖా పూర్తయింది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన సానియా, షోయబ్‌ల వివాహానికి కుటుంబ సభ్యులు, ఎంపిక చేసిన అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఉదయం ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసం నుంచి తండ్రి ఇమ్రాన్, తల్లి నసీమా, చెల్లి ఆనమ్‌లతో కలిసి సానియా హోటల్‌కు చేరుకున్నారు. ఇంటి నుంచి హోటల్ వరకు దాదాపు అన్ని టీవీ ఛానళ్ల ప్రతినిధులు, ఓబీ వ్యాన్లు సానియా కారును అనుసరించాయి. వధూవరులిద్దరూ సంప్రదాయ ముస్లిం దుస్తులు ధరించారు. తల్లి నసీమా తన పెళ్లి సమయంలో వేసుకున్న ఎరుపు రంగు 'ఖడా దుపట్టా'ను సానియా ధరించగా... వరుడు షోయబ్ నలుపు రంగు షేర్వానీ వేసుకుని, జిన్నా టోపీ పెట్టుకున్నారు. గోల్కొండకు చెందిన ఖాజీలు నజీముద్దీన్ హుస్సేన్, మహ్మద్ యూసుఫుద్దీన్ హుస్సేన్, మహ్మద్ షాకేర్ అదిల్‌లు ఈ నిఖాను జరిపించారు. షోయబ్‌ను పెళ్లి చేసుకోడానికి సానియా ముందు అంగీకారం తెలపగా... అనంతరం షోయబ్ తన ఇష్టాన్ని ప్రకటించడంతో నిఖా పూర్తయింది. నిఖానామాపై తండ్రి ఇమ్రాన్ మీర్జా వకీల్ సంతకం చేశారు. సానియాకు మెహర్ కింద రూ.61 లక్షలు ఇవ్వనున్నట్లు షోయబ్ నిఖానామాలో పేర్కొన్నారు. సానియా మేనమామ మీర్జా ఫయాజ్ బేగ్, మామ (మేనత్త భర్త) మహ్మద్ షఫీ సాక్షి సంతకాలు చేశారు. షోయబ్ తరఫున అతని తల్లి, సోదరీమణులు, బావ, మరికొందరు బంధువులు హాజరయ్యారు. నిఖా తర్వాత రెండు కుటుంబాలు హోటల్‌లోనే భోజనం చేశాయి.
ముస్లిం పెద్దల ఫత్వా ప్రభావమో... వివాదాల భయమో గానీ గతంలో ప్రకటించినట్లుగా ఈనెల 15 కంటే మూడు రోజుల ముందే సానియా నిఖా జరిగింది. ఈనెల 13న పెళ్లి తతంగం ఆరంభమవుతుందని సానియా తండ్రి ఇమ్రాన్ మూడు రోజుల ముందు స్వయంగా ప్రకటించారు. ఐతే రోజుకో వివాదం... గడియకో మలుపు తిరుగుతున్న పెళ్లి వ్యవహారాన్ని మరింత సాగదీయడం ఇష్టంలేని పెద్దలు నిఖా తతంగాన్ని సోమవారమే ముగించారు. ఆదివారం కొందరు ముస్లిం మతపెద్దలు ఫత్వా జారీ చేయడం కూడా సానియా హడావుడి వివాహానికి ఒక కారణమని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం భద్రత కారణాల వల్లే నిఖాను గోప్యంగా ఉంచామని చెప్తున్నారు. నిజానికి ముస్లింలలో 99 శాతం వివాహాలు గురు లేదా శుక్రవారాల్లో జరుగుతాయి. అది కూడా మగ్రిబ్(రాత్రి ఏడు గంటలకు) నమాజ్ పూర్తయిన తర్వాతే అత్యధికులు నిఖా కార్యక్రమం నిర్వహిస్తారు! సానియా మాత్రం జొహర్ (మధ్యాహ్నం) నమాజ్ తర్వాత నిఖా చేసుకున్నారు.
తాజ్‌కృష్ణాలో తొలిరాత్రి!నిఖా తర్వాత సానియా, షోయబ్‌లను హోటల్‌లోనే ఉంచారు. కుటుంబ సభ్యులు మాత్రం ఇంటికి తిరిగి వెళ్లారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా జరిగిన రోజే తొలిరాత్రి నిర్వహిస్తారు!. ఆ తర్వాతే విందు ఉంటుంది. పెళ్లికి ముందే మెహందీ పెడతారు. అనుకోకుండా వివాహం జరిగిపోవడంతో మెహందీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించనున్నారు. ఈనెల 14న (బుధవారం) తాజ్‌కృష్ణాలో 'సంగీత్' కార్యక్రమం జరుగుతుంది. క్రీడా, సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. ఈనెల 15న (గురువారం) విందు నిర్వహిస్తారు.
మీడియాకు మస్కాపెళ్లి భజంత్రీలు వాయిస్తుండగా.. అభిమానులు నృత్యాలు చేస్తుండగా 12.15 నిముషాల సమయంలో తండ్రి కొందరు బంధువులు తోడుగా సానియా తన నివాసం నుంచి బయటకు వచ్చారు. వెంటనే మీడియా ప్రతినిధులు కార్లలోనూ, మోటార్ సైకిళ్లపై కెమెరాలతో ఆమెను చిత్రీకరిస్తూ సినిమా ఛేజింగ్‌ను తలపించారు. సానియా ఆమెతో పాటు బయల్దేరిన మరో రెండు కార్లు తాజ్‌కృష్ణాలోకి రాకుండా తాజ్ డెక్కన్ హోటల్‌లోకి వెళ్లాయి. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మీడియా అటు పరుగులు పెట్టినా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుపడ్డారు. తాజ్ డెక్కన్ నుంచి వంతెన ద్వారా సానియా, షోయబ్ వాళ్ల కుటుంబ సభ్యులు తాజ్‌కృష్ణాకు చేరుకున్నారు. బంధువులతో పాటు సినీ హీరో మంచు విష్ణువర్ధన్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్‌యాదవ్ తదితరులు మాత్రమే ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నట్లు తెలిసింది.
పెళ్లి ధ్రువీకరణ పత్రం(ఆంగ్లం)లో వివరాలివి...
వరుడిపేరు: షోయబ్‌మాలిక్
తండ్రి: మాలిక్ ఫకీర్ హుస్సేన్
తల్లి: ఫారూఖ్‌సుల్తానా
పుట్టిన తేది: 01.02.1982
వృత్తి: క్రీడాకారుడు
చిరునామా: బి-6, తారీక్‌రోడ్ నెం.7, సియాల్‌కోట్, పాకిస్థాన్
జాతీయత: పాకిస్థానీ
వధువు పేరు: సానియా మీర్జా
తండ్రి: ఇమ్రాన్ అజీజ్ మిర్జా
తల్లి: నసీమా ఇమ్రాన్ మిర్జా
పుట్టినతేది: 15.11.1986
వృత్తి: క్రీడాకారిణి
చిరునామా: 61-ఎ, రోడ్‌నెం.9, సైట్-2, ఫిలింనగర్
జాతీయత : భారతీయురాలు