పారదర్శకంగా వ్యవహరించాలి
ఆర్‌బీఐ శుక్రవారం తెలిపిన మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు ప్రస్తుత బీపీఎల్‌ఆర్ స్థానంలో జులై 1 నుంచి బేస్‌రేటును ప్రవేశపెట్టవలసి ఉంటుంది. ఆ బేస్‌రేటు కన్నా తక్కువకు ఏ బ్యాంకు రుణాలు మంజూరు చేయకూడదు. బేస్‌రేటును లెక్కించే విధానం, దానికి సంబంధించిన పూర్తి వివరాలను రుణగ్రహీతలకు అందుబాటులో ఉంచాలన్నది ఆర్‌బీఐ నిబంధన. దీంతో కొత్త పద్ధతిపై రుణగ్రహీతలకు, ఖాతాదార్లకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఆయా బ్యాంకులపై ఉంది. ఆ వివరాలన్నింటినీ బ్యాంకులు వాటి వెబ్‌సైట్‌లలో పొందుపరచడంతో పాటు ఎప్పటికప్పుడు మార్పులను అప్-డేట్ చేయాల్సి ఉంది. మొక్కుబడిగా కొన్ని ప్రకటనలతోనే సరిపెట్టకుండా రుణగ్రహీతలకు అర్థమయ్యే విధంగా ఈ ప్రక్రియలను చేపట్టేందుకు బ్యాంకులు సన్నద్ధం కావాలి. కొత్త విధానం వల్ల రుణ గ్రహీతలకు ఏవిధంగా అదనపు వడ్డీ ప్రయోజనం చేకూరుతుందన్నది వారు అర్థం చేసుకొనేటట్లు తగినంత సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నమాట. బ్యాంకులు ఖాతాదారుల సదస్సులను నిర్వహించి 'బేస్‌రేటు' విధానంపై విస్తృత ప్రచారాన్ని చేపట్టాలి. ప్రతి మూణ్నెళ్లకోసారి 'బేస్‌రేటు'ను సమీక్షించి అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరమూ ఉంది. బేస్‌రేట్లలో మార్పులు జరిగినప్పుడల్లా ఆ వివరాలను ఖాతాదార్లకు, రుణగ్రహీతలకు తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంది. భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, సేవా లోపాలకు తావు లేకుండా పారదర్శకతకు బ్యాంకులు పెద్ద పీట వేయాలి.
ఖాతాదారులకు వెసులుబాటు
బేస్‌రేటు విధానం అమల్లోకి రానుండటంతో ఆర్‌బీఐ ఖాతాదారులకు కొంత వెసులుబాటును కల్పించింది. పాత రుణాలు వాటి కాలపరిమితి పూర్తయ్యేవరకు ప్రస్తుతం అమల్లో ఉన్న బీపీఎల్‌ఆర్ పద్ధతిపైనే కొనసాగుతాయి. ఉదాహరణకు గతంలో 15 ఏళ్ల కాలపరిమితిపై ఉన్న గృహరుణం అదే పద్ధతిపై చివరిదాకా ఉంటుంది. అయితే రుణగ్రహీత ఎప్పుడైనా కొత్త బేస్‌రేటుకు మారే అవకాశాన్ని ఆర్‌బీఐ కల్పించింది. రిటైల్ రుణాలు (గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, విద్యారుణాలు) విషయంలో ఆయా రుణాల కాలపరిమితి పూర్తయ్యేలోపు రుణగ్రహీతలు ఎప్పుడైనా కొత్త బేస్‌రేటును ఎంచుకోవచ్చు. కొత్త విధానానికి మారడానికి బ్యాంకులు సేవా రుసుము, ఇతర ఫీజు వసూలు చేయడానికి వీలు లేదు. వర్కింగ్ క్యాపిటల్ రుణం, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయాల వంటివి సంవత్సరం కాలపరిమితి వరకే అందుబాటులో ఉంచి, ఆపై వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. ఈ తరహా పాత రుణాలపై తదుపరి సమీక్ష సమయంలో బేస్‌రేటు విధానం అమలవుతుంది.
వ్యత్యాసానికి తావు
బేస్‌రేటు లెక్కగట్టే విధానం కొన్ని బ్యాంకుల మధ్య బేస్‌రేటు వ్యత్యాసాన్ని పెంచేదిగా ఉంది. దీని స్థానంలో బ్యాంకులు మరేదైనా ప్రత్యామ్నాయ పద్థతిని ఎంచుకొని బేస్‌రేటును నిర్ణయించుకునే వెసులుబాటును ఆర్‌బీఐ కల్పించింది. అయితే ఆ విధంగా ఎంచుకున్న పద్ధతి హేతుబద్ధంగా, సమంజసంగా, పారదర్శకంగా ఉండాలి.
గతంలో బీపీఎల్‌ఆర్‌తో అనుసంధానించిన వడ్డీరేట్లపై రుణాలు తీసుకున్న రుణ గ్రహీతలకు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా రిటైల్ రుణగ్రహీతలకు తక్కువ వడ్డీరేట్ల ప్రయోజనం ఎండమావిగా మిగిలింది. గృహరుణాలు, ఇతరత్రా రిటైల్ రుణాల వడ్డీరేట్లు తగ్గుతున్నప్పటికీ ఆ తగ్గింపు పాత రుణాలకు వర్తింప చేయకపోవడంతో పాత రుణగ్రహీతలు తగ్గింపు ప్రయోజనం పొందలేకపోతున్నారు. బ్యాంకులు కొత్త రుణ పథకాలతో వ్యాపారాన్ని పెంచుకునే దిశలో కొత్త రుణగ్రహీతలకు పెద్ద పీట వేస్తూ పాత రుణగ్రహీతల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయి. కొత్త విధానం ప్రకారం భవిష్యత్తులో బ్యాంకులు బేస్‌రేట్లలో ఎటువంటి మార్పులు చేసినా.. ఆ మార్పులు బేస్‌రేటుతో అనుసంధానించిన అన్ని రుణాలకు వర్తిస్తాయి. కొత్త, పాత అనే తేడా లేకుండా బేస్‌రేటు మారినప్పుడల్లా తదనుగుణంగా వడ్డీరేట్లలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ పద్ధతి రుణగ్రహీతలకు ప్రయోజనకరమేనని చెప్పవచ్చు