ఆదాయం 3.3 శాతం పెరగొచ్చు
నికరలాభమూ అదే స్థాయిలో..
విశ్లేషకుల అంచనాలు
మార్కెట్ దిశకు ఇదే ఆధారం
ఆర్థిక ఫలితాల సందడికి నేడు ఇన్ఫోసిస్ శ్రీకారం చుట్టనుంది. ఇన్ఫోసిస్ ఫలితాలు ఇతర ఐటీ కంపెనీలనూ ప్రభావితం చేయనున్నాయి. అంతే కాదు మొత్తం మార్కెట్ దిశకూ ఇవే ఆధారం కానున్నాయని విశ్లేషకులు అంటున్నారు. కాగా పెరుగుతున్న డిమాండ్ కారణంగా ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలు ఓ మోస్తరు వృద్ధిని సాధించొచ్చని చెబుతున్నారు. హెచ్‌సీఎల్, ప్యాట్నీ కంప్యూటర్స్ మాత్రం క్షీణించొచ్చని అంచనా వేస్తున్నారు. ఇన్ఫోసిస్ కంపెనీఫలితాలు ఎలా ఉంటాయనే దానిపై ఏమంటున్నారంటే.. కరెన్సీలో అధిక హెచ్చుతగ్గులుంటున్నా.. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మార్చి 2010తో ముగిసిన చివరి త్రైమాసికానికి మెరుగైన ఫలితాలనే ప్రకటించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేడు(మంగళవారం) కంపెనీ ఫలితాలు ప్రకటించనుంది. విశ్లేషకుల సగటు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే..
* కంపెనీ ఆదాయం 3.3 శాతం వృద్ధితో రూ.5,928.7 కోట్లుగా నమోదుకావచ్చు. అంతక్రితం త్రైమాసికంలో ఆదాయ వృద్ధి 2.8%గా ఉంది.
* నికరలాభం 3.3% వృద్ధితో రూ.1,633.4కోట్లకు చేరొచ్చు. అంతక్రితం 3 నెలల్లో ఇది 2.7% మాత్రమే పెరిగింది.
* కరెన్సీ ప్రభావంతో ఆపరేటింగ్ మార్జిన్‌లో 30-50 బేసిస్ పాయింట్ల మేర పతనం కనిపించొచ్చు. మార్చి త్రైమాసికంలో పౌండ్, యూరోలతో పోలిస్తే డాలరు 8% బలపేతం కాగా.. డాలరుతో పోలిస్తే రూపాయి 1.5% బలపడింది.
* బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమాల్లో ఉన్న డిమాండ్ దృష్ట్యా 2010-11లో ఆదాయం కనీసం 11 శాతం గరిష్ఠంగా 16% వృద్ధి చెందొచ్చు.
* ఇన్ఫోసిస్ గతంలో మూడు సార్లు ప్రత్యేక డివిడెండు ఇచ్చింది. 2004, 2006, 2008ల్లో వరుసగా రూ.100, రూ.30, రూ.20 చొప్పున ఇచ్చింది. కంపెనీకున్న రూ.14,000 కోట్లకు పైగా భారీ ద్రవ్యలభ్యత దృష్ట్యా ఈ ఏడాదీ ఆశించొచ్చు.