ఫిబ్రవరిలో ఇది 15.1 శాతమే
రాబోయే నెలల్లో మరింత కిందకు?
ఉద్దీపనల ఉపసంహరణ, ఆర్‌బీఐ విధానాలే కారణం!

పారిశ్రామిక వృద్ధి గణనకు పరిగణనలోకి తీసుకునే విభాగాల్లో 14 మెరుగైన పనితీరును కనబరిచినప్పటికీ సిమెంట్, స్టీలు రంగాలు నిరుత్సాహకరంగా ఉండటం వృద్ధి రేటును ప్రభావితం చేసింది. కిందటేడాది కేవలం 0.2 శాతం వృద్ధితో సరిపెట్టుకున్న తయారీ రంగం ఈ ఏడాది ఇదే నెలలో అనూహ్యరీతిలో 16 శాతం పురోగతి సాధించింది. అలాగే వినియోగ వస్తువుల తయారీ ఫిబ్రవరిలో 29.9%, భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి 44.4% పెరిగాయి. తవ్వక రంగం 12.2%, విద్యుత్తు రంగం 6.7% వృద్ధిని నమోదు చేశాయి. మొత్తంమీద గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి నెలల మధ్య పారిశ్రామికోత్పత్తి సూచీ 10.1% వృద్ధి నమోదు చేసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధి రేటు 3% మాత్రమే.
జీడీపీ 7.2శాతానికి తగ్గదు: నిపుణులు
మౌలిక రంగంలోని 6 కీలక విభాగాలు జనవరి (9.4%) కంటే ఫిబ్రవరిలో (4.5%) తక్కువ పురోగతి సాధించడం పారిశ్రామికోత్పత్తిపై ప్రభావం చూపిందని క్రిసిల్ ప్రధాన ఆర్థికవేత్త డి.కె. జోషి తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆర్థిక విధానాలను కఠినతరం చేయడం వల్ల రాబోయే నెలల్లో ఐఐపీ మరింత తగ్గవచ్చు. అయినప్పటికీ 2009-10లో జీడీపీ 7.2% వృద్ధి సాధించవచ్చని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. భారీ యంత్ర పరికరాలు, తయారీ రంగం పారిశ్రామిక వృద్ధికి దోహద పడ్డాయని, పెట్టుబడులకు తగినట్లు వినియోగం పెరిగినప్పుడే వృద్ధి స్థిరపడుతుందని యెస్ బ్యాంక్ ప్రధాన ఆర్థికవేత్త సుభదారావ్ పేర్కొన్నారు. పారిశ్రామిక రంగం పనితీరు మెరుగ్గా ఉన్నందున, ఉద్దీపనల ఉపసంహరణ దిశగా కేంద్రం సాగుతుందని వివరించారు.