Monday, April 12, 2010

మెక్కు కర్మాగారం


10,760 ఎకరాల సర్కారు భూమి బ్యాంకులో
తనఖా పెట్టి రుణం పొందిన బ్రహ్మణి స్టీల్స్‌
తీసుకున్నది ఎకరా రూ.18,500కు
తాకట్టు పెట్టింది ఎకరా రూ.3.25 లక్షలకు
సర్కారుకు చెల్లించింది 20 కోట్లు...
రుణం పొందింది 350 కోట్లు
ప్రభుత్వ భూముల తనఖాను తప్పుపట్టిన కాగ్‌
మచిలీపట్నం పోర్టు భూముల విషయంలో అక్షింతలు
హైదరాబాద్‌ - న్యూస్‌టుడే
'ఎవరిదో నెత్తి ఎవరిదో కత్తి' అనే సామెతకు అర్థం తెలుసా? తెలుసుకోవాలంటే బ్రహ్మణి ఉక్కు కర్మాగారం 'మెక్కు' సంకల్పాన్ని చూడండి. ఏలినవారి కనుసన్నల్లో ఉంటే.. సర్కారు ఆస్తిని ఎలా సొమ్ము చేసుకోవచ్చో బ్రహ్మణి యాజమాన్యం చక్కగా రుజువుచేసింది. ఉక్కు కర్మాగార నిర్మాణం జరిగితే పెద్దఎత్తున ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతుందన్న ఉద్దేశంతో సర్కారు చౌకగా భూమిని కట్టబెడితే... ఆ భూమిని బ్రహ్మణి యాజమాన్యం తెలివిగా సొమ్ము చేసుకుంది. ప్రభుత్వ భూముల్ని తనఖాకు పెట్టింది. ప్రభుత్వం ఎకరా రూ.18,500లకు బ్రహ్మణికి భూముల్ని కేటాయిస్తే... ఆ కంపెనీ ఈ భూముల్ని బ్యాంకులో తనఖా పెట్టి ఎకరాకు రూ.3.25 లక్షల చొప్పున 'లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌' పొందింది. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్యాంకు నుంచి రుణం పొందే పత్రం. అంటే దాదాపు నగదుతో సమానం. ఇలా ప్రభుత్వం కేటాయించిన భూముల్ని తనఖా పెట్టి రుణం తీసుకోవడం తప్పు అని కాగ్‌ తన 2009 సంవత్సరపు నివేదికలో స్పష్టంగా పేర్కొంది. మచిలీపట్నం పోర్టు కోసం ప్రభుత్వమిచ్చిన భూముల్ని ఆ పోర్టు కాంట్రాక్ట్‌ కన్సార్టియం తనఖా పెట్టి రుణం తెచ్చుకోవడాన్ని కాగ్‌ తన నివేదికలో తూర్పారబట్టింది. ప్రభుత్వం నుంచి భూములు తీసుకున్నాక.. తన సొంత ఆస్తులపై కాకుండా.. ప్రభుత్వమిచ్చిన భూముల్ని తనఖా పెట్టి రుణం తెచ్చుకోవడం సరికాదంది. ఇలా చేయడం ఓ ప్రైవేటు పార్టీ తీసుకునే రుణాలకు ప్రభుత్వం హామీ ఇవ్వడంలా ఉంటుందని, ఆ తర్వాత సదరు యాజమాన్యం ఆ నిధుల్ని దారి మళ్లిస్తే బాధ్యత కూడా ప్రభుత్వమే వహించాల్సిన పరిస్థితీ వస్తుందని చెప్పింది. పోర్టు కాంట్రాక్ట్‌ కన్సార్టియంతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంలో భూముల్ని తనఖా పెట్టేందుకు పెట్టిన క్లాజును కూడా తప్పుబట్టింది. బ్రహ్మణి కూడా ఇలాగే భూముల్ని తనఖా పెట్టింది. కాబట్టి అది కూడా తప్పుచేసినట్లే కదా!!

కడప జిల్లాలోని వేముగుంట్లపల్లె, కొత్తగుంట్లపల్లె, పి.బొమ్మేపల్లె, తోగ్గుట్టపల్లెల్లో మొత్తం 10,760 ఎకరాల్ని బ్రహ్మణి స్టీల్స్‌కు ప్రభుత్వం కేటాయించింది. ఇందుకుగాను ఎకరాకు రూ.18,500 చొప్పున సుమారు రూ.20 కోట్లను బ్రహ్మణి స్టీల్స్‌ ప్రభుత్వానికి చెల్లించింది. ఇవే భూముల్ని బ్యాంకులో తాకట్టు పెట్టి బ్రహ్మణి 2009 ఆగస్టులో రూ.350 కోట్లకు లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ తెచ్చుకుంది. మూలధన వస్తువుల కొనుగోలు, దిగుమతి కోసం ఈ రుణ హామీని పొందింది.

ఇదో కొత్త ఎత్తుగడ
ప్రభుత్వంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని సబ్సిడీ రేట్లకు భూములు, రాయితీలు పొందడం... ఆ తర్వాత ఆ భూముల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకోవడం అనే కొత్త తరహా అక్రమాలకు ఇప్పుడు తెరలేస్తోంది. ఆ తర్వాత తమకిచ్చిన రాయితీలు ఇతరత్రా సౌకర్యాల్ని అనుభవిస్తూ.. అసలు కర్మాగారాలు పెట్టకుండానే వాటిలో వాటాను ఇతరులకు ఎక్కువ ధరకు విక్రయించడం ద్వారా లాభాలు సంపాదించే కొంగొత్త పోకడలు మొదలయ్యాయి. సదరు కర్మాగారంలో పెట్టుబడి ఏమీ లేకుండా.. ఒకవేళ పెడితే గిడితే అతి స్వల్పంగా పెట్టి.. చేతికి మట్టి అంటుకోకుండా లాభాలు సంపాదిస్తున్నారు.

బ్రహ్మణిదీ అదే బాట!
ఇప్పుడు బ్రహ్మణి ఉక్కు కర్మాగారం వాటాల్ని జిందాల్‌కు అమ్మేందుకు ఒప్పందం కుదిరిందనే వార్తలొస్తున్నాయి. తానే కర్మాగారం పెడతానంటూ ఓబుళాపురం ఇనుప ఖనిజం గనుల్ని, కర్మాగారం కోసం ప్రభుత్వ భూముల్ని బ్రహ్మణి యాజమాన్యం తీసుకుంది. ఓబుళాపురం గనుల కోసం ఇతరులూ దరఖాస్తు చేసుకున్నా... ఓఎంసీకే లీజుకు ఇవ్వడానికి ప్రధాన కారణం ఆ కంపెనీ ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పుతామని చెప్పడమే. ఇదే విషయాన్ని సంబంధిత నోట్‌ ఫైల్‌లో కూడా పేర్కొన్నారు. కర్మాగారం పెట్టకపోయినా కొన్నేళ్ల నుంచీ ఓఎంసీ ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసేసి కోట్ల రూపాయలు ఆర్జిస్తోంది. ఉక్కు కర్మాగారం పేరు మీద తీసుకున్న భూముల్ని బ్రహ్మణి యాజమాన్యం తనఖా పెట్టి అధిక మొత్తం తెచ్చుకుంది. ఇప్పుడు జిందాల్‌కు కొంత వాటా అమ్మి అక్కడా లాభాలు సంపాదించబోతోంది. అంటే కేవలం ప్రభుత్వంలో ఉన్న పలుకుబడితో వ్యాపారం చేసి డబ్బు సంపాదించే సరికొత్త వ్యూహాలకు తెరలేపిందన్న మాట!

విదేశాలకు సొమ్ము... ఆపై బ్రహ్మణికి మళ్లింపు
బ్రహ్మణి ఉక్కు కర్మాగారంలో విదేశీ కంపెనీలకు వాటాలిచ్చారు. అయితే బ్రహ్మణి అధినేత గాలి జనార్దన్‌రెడ్డే... ఆ విదేశీ కంపెనీలకు కూడా వాటాదారు కావడం గమనార్హం. ఈయన జీజేఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ పేరుతో జీజేఆర్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, జీజేఆర్‌ హోల్డింగ్స్‌(మారిషస్‌) లిమిటెడ్‌ల పేరుతో కొన్ని కంపెనీలను రిజిస్టర్‌ చేయించారు. మొదటి కంపెనీకి సుమారు 4.89 కోట్ల షేర్లను... ఒక్కో షేరు రూ.10 చొప్పున ఇచ్చారు. అలా ఆ కంపెనీకి వాటాల కేటాయింపు ద్వారా సుమారు రూ.49 కోట్లు తెచ్చారు. జీజేఆర్‌ హోల్డింగ్స్‌(మారిషస్‌) లిమిటెడ్‌కు కూడా 4.89 కోట్ల షేర్లను రూ.10 చొప్పున కేటాయించడం ద్వారా మరో రూ.49 కోట్లు తెచ్చారు. బ్రహ్మణి యాజమాన్యమే ఈ కంపెనీల్లో కూడా ఉన్నప్పుడు నేరుగా పెట్టుబడి పెట్టకుండా... విదేశాల్లో కంపెనీలు పెట్టి, వాటి ద్వారా తమ డబ్బును ఇక్కడికెందుకు తెచ్చాయన్నది ప్రశ్న. ఒకవైపు పెట్టుబడి కోసం జిందాల్‌కు వాటా విక్రయిస్తామంటోన్న కంపెనీ... తమకే చెందిన విదేశీ కంపెనీల ద్వారా మాత్రం పెట్టుబడులు పెట్టించడం ఏమిటన్నది కూడా ప్రశ్నగానే ఉంది.

ఓబుళాపురం నుంచి సుమత్రా వరకు
మరోవైపు జీజేఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఇండొనేషియాలోని సుమత్రాలోగల నాలోబారో అనే ప్రాంతంలో 438 హెక్టార్ల ఇనుపఖనిజం లీజులో సగం వాటా తీసుకుంది. ఎర్త్‌స్టోన్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ అనే కంపెనీకి చెందిన ఈ గనిలో రూ.150 కోట్లతో సగం వాటాను జీజేఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ దక్కించుకున్నాయి. ఈ గని విలువ సుమారు 5 లక్షల కోట్ల రూపాయలని అంచనా.