Monday, April 12, 2010

కారుచౌకగా మందులు

సామాన్యుడి చెంతకు 'జన్‌ ఔషధి' షాపులు
50 నుంచి 60 శాతం తగ్గనున్న ధరలు
కేంద్ర ప్రభుత్వం సరికొత్త పథకం
దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సన్నాహాలు
రాష్ట్రంలో రెండు షాపులు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పేదలకు కారుచౌకగా మందులను అందించడం సాధ్యమేనా?... మహారాష్ట్రకు చెందిన ఓ జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ఐడియాతో ఇది సుసాధ్యమేనని తేలింది. చౌకధరలకే మందులను అందించేందుకు ఇపుడు మన ముందుకొస్తున్నాయి 'జన్‌ ఔషధీ' షాపులు. పది పైసలు ఖరీదు చేసే మందును రూపాయికి విక్రయిస్తున్న ఈ రోజుల్లో.... జన్‌ఔషధీలు ప్రజాదరణను చూరగొంటాయని భావిస్తున్నారు. ప్రాణాధార మందుల విషయానికొస్తే... వాటి ఖరీదు వేలల్లోనే ఉంది. డబ్బులున్నా లేకపోయినా... అవసరానికి ఎంతైనా ఖర్చు చేసి డాక్టర్‌ చెప్పిన మందులు కొనక తప్పనిస్థితి. ఒక్క పేదలనే కాకుండా... మధ్యతరగతి వాళ్లకు కూడా మందుల కొనుగోలు పెద్ద భారంగా తయారైంది.

మందు ఒకటే... బ్రాండ్లు వేలు: మనం డాక్టర్‌ దగ్గరకు వెళ్లినపుడు మందుల కంపెనీల ప్రతినిధులు డాక్టర్లకు మందుల గురించి పరిచయం చేస్తుంటారు. నిజానికి అవేమీ కొత్త మందులు కాదు... తాను వైద్యుడుగా ప్రాక్టీస్‌ చేస్తున్న దగ్గర నుంచి చూస్తే... కొత్తగా వస్తున్న మందులేవీ లేవని, ఉన్న మందుల్నే రకరకాల కంపెనీల వాళ్లు రకరకాల పేర్లతో వాటిని తయారు చేస్తారని, మార్కెటింగ్‌ కోసం మా దగ్గరకు వస్తుంటారని కార్పొరేట్‌ హాస్పిటల్‌లో జనరల్‌ ఫిజీషియన్‌గా పనిచేస్తున్న ఓ వైద్యుడు 'న్యూస్‌టుడే'తో వ్యాఖ్యానించారు.

మనకు 375 మందులు చాలని 'హథీ' కమిషన్‌ మూడున్నర దశాబ్దాల కిందట తేల్చి చెప్పింది. అయితే ఇపుడు రకరకాల రూపంలో మొత్తం 75 వేల బ్రాండ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. మందుల మార్కెట్‌ విస్తృతి ఏ మేరకు ఉందో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మందుల తయారీ అవసరం ప్రాతిపదికన కాకుండా... ఎక్కువ మంది వాడే వాటినే తయారుచేస్తున్నారన్న విమర్శ కూడా ఉంది. మందుల కంపెనీల మాయాజాలానికి చిక్కకుండా మందులను వాటి అసలు ధరలకు అందించేందుకు ఇపుడు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. బ్రాండ్లతో సంబంధం లేకుండా అసలు మందునే చౌక ధరకు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దానిలో భాగమే 'జన్‌ ఔషధీ' షాపులు.

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఫార్మాస్యూటికల్‌ విభాగం 'జన్‌ ఔషధీ'ల బాధ్యతను తీసుకుంది. అతి తక్కువ ధరకు నాణ్యమైన మందులను సరఫరా చేసేందుకు ప్రత్యేక మందుల దుకాణాలకు రూపకల్పన చేసింది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో తొలివిడతగా ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మన రాష్ట్రంలో కూడా రెండు కేంద్రాలను ప్రారంభించారు. ఒకటి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటుకాగా, రెండోది విశాఖపట్నంలోని పోర్టుట్రస్టులో ఏర్పాటు చేశారు.

చౌక ధర ఎలా సాధ్యం: ఔషధాన్ని దాని రసాయన నామంతో పిలిచినపుడు దాన్ని 'జెనరిక్‌'గా పేర్కొంటారు. కంపెనీలు ఆ మందును కొనుగోలు చేసి వేరే మందులతో కలిపి కాంబినేషన్లను తయారు చేస్తాయి. లేదా అదే మందును బ్రాండు పేరు తగిలించి మార్కెట్లో విక్రయిస్తాయి. ఇక్కడ కంపెనీలు లాభాన్ని కూడా కలుపుకోవడంతో వాటి ధర పెరుగుతుంది. చాలాసార్లు ప్రభుత్వాస్పత్రుల్లో ఇచ్చే మందులకు ఎలాంటి బ్రాండు పేరూ లేకపోవడం తెలిసిందే. సరిగ్గా ఇదే విధానాన్ని జన్‌ఔషధీలకు వర్తింప చేస్తున్నారు. మధ్యలో కంపెనీల ప్రమేయం లేనందున జెనరిక్‌ ధరలకే మందులు దొరుకుతాయన్నమాట.

ప్రభుత్వ సంస్థల నుంచే కొనుగోలు: ప్రభుత్వ రంగ ఔషధ తయారీ సంస్థల నుంచి మాత్రమే జన్‌ఔషధీలు మందులను కొనుగోలు చేస్తాయి. కర్ణాటక యాంటీ బయాటిక్స్‌, హిందుస్థాన్‌ యాంటీ బయోటెక్స్‌, ఐడీపీఎల్‌, రాజస్థాన్‌ డ్రగ్స్‌, బెంగాల్‌ డ్రగ్స్‌ లిమిటెడ్‌ కంపెనీల నుంచి ఈ ఔషధాలను సేకరిస్తున్నారు. ఆయా కంపెనీల నుంచి ఔషధాల సేకరణ, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు 'ఐడీపీఎల్‌'ను నోడల్‌ ఏజెన్సీగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జన్‌ ఔషధీల్లో విక్రయించే ఔషధాలు బహిరంగ మార్కెట్‌కన్నా 50 నుంచి 60 శాతం తక్కువకే లభించడం విశేషం. 280 రకాల ఔషధాలను ఈ షాపుల్లో విక్రయించేందుకు గుర్తించారు.

మన రాష్ట్రంలోనూ ఓ ప్రయత్నం: విశాఖ జిల్లా కలెక్టర్‌ కూడా ఇటువంటి ప్రయత్నమే చేశారు. విజయవాడ, విశాఖపట్నాల్లోని ఫార్మా పంపిణీదారులను సంప్రదించి... తక్కువ ధరకు లభించే జెనెరిక్‌ మందులను అందుబాటులోకి తెచ్చారు. కింగ్‌జార్జి ఆస్పత్రిలో 'సంజీవని' పేరుతో ఏర్పాటు చేసిన ఈ స్టోర్స్‌ను మొన్న జనవరి నెలలో ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. ఈ విధానాన్ని అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేసి చెప్పమని అధికారులకు సూచించారు. ఈ స్టోర్స్‌లోని మందులనే వైద్యులు సిఫార్సు చేయడంతో అది విజయవంతంగా కొనసాగుతోంది.

హైదరాబాద్‌ నిమ్స్‌లో మాత్రం మందులను ఇన్‌పేషెంట్లకు మాత్రమే విక్రయిస్తున్నారు.

రేపు సమావేశం: రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా ఈ దుకాణాలను ఏర్పాటు చేసేందుకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ రమేష్‌ అన్ని జిల్లాల యంత్రాంగాలతో సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. తొలివిడతగా ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రుల్లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జన్‌ఔషధీలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చేందుకు కూడా ప్రభుత్వం యోచిస్తోంది.