Wednesday, April 14, 2010

సిఎల్‌బి గడువులోగా ఖాతాల తిరగరాత మహీంద్రా సత్యం చైర్మన్ వినీత్ నయ్యర్

హైదరాబాద్ (బిజినెస్ బ్యూరో) : సత్యం కంప్యూటర్స్ ఖాతాలను తిరగరాసే పని కంపెనీ లా బోర్డు ఇచ్చిన గడువు జూన్ 30 లోగా పూర్తి చేస్తామని మహీంద్రా సత్యం చైర్మన్ వినీత్ నయ్యర్ చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో మహీంద్రా సత్యం సెజ్‌ను కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఖాతాల తిరగరాత విషయంలో కొన్ని సాంకేతికాంశాలు పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుందని అన్నారు.

సత్యం కంప్యూటర్స్ పునరుజ్జీవం, పునర్నిర్మాణం పనులు అనుకున్న ప్రకారం సాగుతున్నాయని, తొందరలోనే అన్ని సమస్యల నుంచి బయటపడగలమని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ అనుకున్న ప్రకారం సరైన దిశలో సాగేందుకు తమ మంత్రిత్వ శాఖ అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన అన్నారు. ఇదే సమయంలో నయ్యర్ జోక్యం చేసుకుంటూ ఖాతాలు తిరగరాసే పని కంపెనీ లా బోర్డు ఇచ్చిన గడువు లోగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఇంకో రెండేళ్ళుంది
కంపెనీ పునరుద్ధరణకు తాము మూడు సంవత్సరాల ప్రణాళిక ప్రకటించామని, అందులో ఇప్పటికి ఒక ఏడాది మాత్రమే పూర్తయిందని కంపెనీ సిఇఒ సిపి గుర్నాని అన్నారు. గత ఏడాది ఇదే రోజున తాము కంపెనీ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన సమయంలో కంపెనీని పూర్తి స్థాయిలో పునరుజ్జీవింపచేయడం లక్ష్యంగా మూడేళ్ళ ప్రణాళిక ప్రకటించిన విషయం ఆయన గుర్తు చేశారు. ఈ లోగా కంపెనీ మార్జిన్లు, లాభదాయకత వంటి అంశాలపై తాను ఏమీ మాట్లాడదలచుకోలేదని ఆయన అన్నారు.

గత ఏడాది కాలంలో ఒక్క కస్టమర్ కూడా కంపెనీ కాంట్రాక్టును రద్దు చేసుకోలేదని, తాము యాజమాన్యం చేపట్టిన నాటికి ఉన్న కస్టమర్లందరినీ నిలబెట్టుకున్నామని గుర్నాని చెప్పారు. కంపెనీ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా యాజమాన్య స్థాయిలో ఉన్న 14 స్థాయిలను తాము ఏడు శాతానికి తగ్గించి, మరింత పారదర్శకత తీసుకువచ్చామని ఆయన తెలిపారు.

ఇది అందరి విజయం
మహీంద్రా సత్యం బాలారిష్టాలు దాటి పురోగమన దశలో పయనించడం అందరి విజయంగా మహీంద్రా గ్రూప్ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర అభివర్ణించారు. కస్టమర్లు, సిబ్బంది అందరి సహకారం ఇదే రీతిలో కొనసాగితే తాము నంబర్ వన్ స్థాయిలో నిలవడం ఖాయమని ఆయన అన్నారు. గత ఏడాది కాలంలో ఉద్యమ స్ఫూర్తితో పని చేసి తాము సంక్షోభాలను దాటి నిలదొక్కుకోగలిగామని ఆయన వ్యాఖ్యానించారు. కొత్త యాజమాన్యంపై అపారమైన నమ్మకం, చిత్తశుద్ధి, దృఢనిశ్చయంతో సిబ్బంది ఈ విజయం సాధించారని ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.

సెజ్ ప్రారంభం
ఇన్ఫోసిటీలో మహీంద్రా సత్యం ఏర్పాటు చేసిన సెజ్‌ను మంగళవారం ఉదయం కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సల్మాన్ ఖుర్షీద్ లాంఛనప్రాయంగా ప్రారంభించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు లక్షల చదరపు అడుగుల నిర్మిత స్థలంలో ఏర్పాటవుతున్న ఈ సముదాయంలో తొలి దశ మరో ఆరు మాసాల్లో ప్రారంభమవుతుందని ఆనంద్ మహీంద్రా ఈ సందర్భంగా ప్రకటించారు. ఇందులో ఐదు వేల మంది పని చేయడానికి వసతి ఉంటుందని ఆయన అన్నారు.