చండీఘడ్: ప్రంపంచంలోనే అతిపెద్ద రిటైలింగ్ కంపెనీ అమెరికాకు చెందిన వాల్ మార్ట్ మన దేశం నుంచి వేల కోట్ల రూపాయలు విలువ చేసే వివిధ ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు సంకల్పించింది. రాను న్న కాలంలో తమ అంతర్జాతీయ రిటైలింగ్ కార్యకాలాపాలకు ఇండియాను కీలక కేంద్రంగా మలుచుకోవాలన్న ఆలోచనలో ఉంది.
వచ్చే నాలుగైదు సంవత్సరాల్లో ఇండియా నుంచి అనేక వందల మిలియన్ల డాలర్లు విలువచేసే ఉత్పత్తులను తమ కంపెనీ దిగుమతి చేసుకునే అవకాశం ఉందని వాల్‌మార్ట్ ఆసియా విభాగం ప్రెసిడెంట్ స్కాట్ ప్రైస్ విలేకరులకు చెప్పారు. వచ్చే సంవత్సర కాలంలోనే భారత్ నుంచి కోట్లాది డాలర్ల ఉత్పత్తులను దిగుమతి చేసుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వాల్‌మార్ట్ అంతర్జాతీయ సోర్సింగ్ విభాగాన్ని పునర్‌వ్యవస్థీకరించామని, రానున్న కాలంలో వివిధ ఉత్పత్తులను భారత్ నుంచి మరింత పెద్దఎత్తున దిగుమతి చేసుకుంటామని ఆయన చెప్పారు. భారతీయ ఉత్పత్తులను ఇతర ఆసియా దేశాలతో పాటు యూరప్, అమెరికా దేశాలకు ఎగుమతి చేస్తామని తెలిపారు. వాల్‌మార్ట్ ఇప్పటికే పంజాబ్‌నుంచి సంవత్సరానికి 12.5 కోట్ల డాలర్లు విలువ చేసే ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో అధికంగా కాటన్ ఉత్పత్తులు ఉన్నాయి.
ఎఫ్‌డిఐ నిబంధనలను స్పష్టం చేయాలి...
దేశంలోని క్యాష్ అండ్ క్యారీ కంపెనీలు తమ గ్రూపులోని రిటైల్ కంపెనీలకు జరిపే అమ్మకాలు మొత్తం ఆమ్మకాల్లో 25 శాతాన్ని మించరాదని ప్రభుత్వం ఇటీవల విధించిన పరిమితులు విషయంలో ప్రభుత్వాన్ని వివరణ కోరుతామని భారతి వాల్‌మార్ట్ పేర్కొంది.
భారతి వాల్‌మార్ట్ తన రెండవ క్యాష్ అండ్ క్యారీ స్టోర్స్‌ను చండీఘడ్‌లో ఏర్పాటు చేసిన సందర్భంగా ఆ సంస్థ సిఇఒ, వాల్‌మార్ట్ ఇండియా ప్రెసిడెంట్ కూడా అయిన రాజ్ జైన్ ఈ విషయాన్ని తెలిపారు. భారతి ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న రిటైల్ స్టోర్స్ 'ఈజీ డే'కు హోల్‌సేల్ వ్యాపారం సాగించే క్యాష్ అండ్ క్యారీ కంపెనీ భారతి వాల్‌మార్ట్ వివిధ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది.
భారతి ఎంటర్‌ప్రైజెస్, వాల్‌మార్ట్‌లు 50:50 భాగస్వామ్యంతో ఇది ఏర్పాటయ్యింది. హోల్‌సేల్ ట్రేడ్‌లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనలు ఈ రంగంలోకివచ్చే విదేశీ పెట్టుబడులను దెబ్బతీసే అవకాశం ఉందని ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
హోల్‌సేల్ కంపెనీలు తమ గ్రూపులోని రిటైల్ కంపెనీలకు జరిపే విక్రయాలు మొత్తం టర్నోవర్‌లో గరిష్టంగా 25 శాతం మాత్రమే ఉండాలన్న ప్రభుత్వ తాజా నిబంధన కారణంగా ఈ రంగంలోకి ప్రవేశించిన, ప్రవేశిస్తున్న పలు విదేశీ కంపెనీలు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవాల్సి వస్తుందని ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ కెపిఎంజి పేర్కొంది.
రాష్ట్రంలో భారతి వాల్‌మార్ట్
ప్రస్తుతం ఉత్తరాది మార్కెట్ల పైనే దృష్టి సారించిన భారతి వాల్‌మార్ట్ వచ్చే రెండు సంవత్సరాల కాలంలో దక్షిణాదిన కూడా పెద్ద ఎత్తున విస్తరించేందుకు ప థకాలు సిద్ధం చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని దక్షిణాది రాష్ట్రాలలోనూ వచ్చే రెండు సంవత్సరాల కాలంలో స్టోర్స్ ఏర్పాటు చేస్తామని భారతి వాల్‌మార్ట్ ఎండి రాజ్ జైన్ పేర్కొన్నారు. దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో కూడా సోర్ట్స్ ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని రాజ్‌జైన్ తెలిపారు.