
'భాగస్వామ్యాలు నిర్మించడం' అన్న పద బంధానికి క్రికెట్‌తో మంచి అనుబంధం ఉంది. బ్యాటింగ్ భాగస్వామ్యాలు స్కోరుని పరుగులు తీయిస్తాయి. బౌలింగ్‌లోనైతే వికెట్ల పంటతో విజయానికి తెరతీస్తాయి. క్రికెటర్ల వ్యక్తిగత జీవితాల్లోనూ ఈ భాగస్వామ్యాల ప్రాధాన్యం మాటల్లో చెప్పలేనంత. అవును మరి, చేదోడు వాదోడుగా నిలిచే జీవిత భాగస్వామి లభిస్తే... ఆ క్రికెటర్ జీవితం చిలకలు వాలిన చెట్టంత అందంగా ఉంటుంది. చిలకల జంటలతో కళకళలాడే తోటంత సందడి నెలకొంటుంది. క్రికెట్ అభిమానులకు కనుల పండగ చేస్తున్న ఐపీఎల్ సంబరాల్లో అలాంటి జంటలున్నాయి. స్నేహంగా కలిసి... ప్రేమలో మురిసి... అనురాగ బంధంతో అల్లుకుపోయిన వారి ప్రే మానుబంధాల సమాహారమే ఈ కథనం.
వికెట్ల వెనుక చురుకు చూపులు. వికెట్ల ముందు బౌండరీల మెరుపులు. అతడే ముప్ఫై రెండేళ్ల పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ సారథి కుమార సంగక్కర. ఎందరో బ్యాట్స్‌మెన్‌లను స్టంప్ అవుట్ చేసిన ఇతగాడు పదిహేడేళ్ల వయసులో ప్రేమ బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఆమె యెహావి... అతడి స్కూలు ఫ్రెండు. ఇద్దరూ ఒకే బడిలో టీచర్ చెప్పిన పాఠాలు చదివారు. టీనేజీ ప్రేమ పాఠాల్నీ కలిసి చదువుకొన్నారు. ఒకర్నొకరు తెలుసుకుని, ఒకరిమీద మరొకరు ఇష్టాన్ని పెంచుకుని ఏడేళ్ల క్రితం పెద్దల దీవెనలతో ఒకటయ్యారు. కిందటేడాది కవల పిల్లలకి (ఓ పాప... ఓ బాబు) తల్లిదండ్రులయ్యారు. ఆటలోనే కాదు... క్రికెటర్ల జీవితాల్లోనూ వేగం. ఏడాది పొడవునా మ్యాచ్‌లు. ఎక్కే విమానం, దిగే విమానం. ప్రాక్టీసులు, మీటింగులు, పార్టీలు, ఫంక్షన్లు... వూపిరి సలపనివ్వవు. అలాంటి బిజీ లైఫ్‌లో జీవిత భాగస్వామి అవసరం చాలా ఎక్కువంటాడు సంగక్కర. 'యెహావి రాకతో జీవితం నాకు బాధ్యతలు నేర్పింది. నేను, నాది, నాకోసం అనే పరిమితమైన ఆలోచనల్ని విస్తృతం చేసి, ఆమెతో జీవితాన్ని పంచుకోవడంలోని ఆనందాన్ని చవిచూపింది. న్యాయశాస్త్రం చదివే దిశగా ప్రోత్సాహించింది. మైదానంలో ఉన్నంత సేపూ ఆటమీదే దృష్టి. ఆట ముగియగానే గెలుపైనా, ఓటమినైనా గేట్ల దగ్గరే విడిచిపెట్టి సరదాగా కబుర్లు చెబుతాను.నేను ఎక్కడికెళ్లినా తను నాతోనే ఉంటుంది. ఆటగాడిగానే కాకుండా జీవితంలోని వాటాదారుగా గడపటం నాకిష్టం. పాక్ టూర్‌కి వెళ్లినప్పుడు తీవ్రవాదులు మా టీమ్ బస్సు మీద దాడి చేశారు. ఆ తరవాత తిరిగి నన్ను చూసే వరకు తను నాకోసం ఎంత తల్లడిల్లిందో! తలుచుకుంటే ఇప్పటికీ ఉద్వేగమే. చూపులు కలిసి... మాటలు కలిపి... సూదంటురాయిలా ఒకర్నొకరు ఆకర్షించిన క్షణాల్ని ఎప్పటికప్పుడు పునరావిష్కరించుకోవడం నాకెంతో సరదా' అంటాడు. ఆట కోసం దేశ, విదేశాల్లో తిరుగుతూ అక్కడి హోటళ్లలో భోంచేసే సంగక్కర 'మా ఆవిడ వంట ముందు ఆ రుచులన్నీ బలాదూర్' అనేస్తాడు. పెళ్త్లె చాలాకాలం గడిచినా ఇప్పటికీ ప్రేమ భావనలు తాజాగానే ఉన్నాయంటాడు. |
వికెట్ల ముందు విధ్వంసం. బౌలర్ల గుండెల్లో భూకంపం. బంతిని బలంగా బాదే వీరేంద్రుడిలో ఇంతి మనసు దోచే గిలిగింత కారుడూ ఉన్నాడు. బౌలర్ చేతిలోంచి బంతి వెలువడగానే బౌండరీని దాటించేందుకు బ్యాట్ ఝుళిపించే అతడు, తన మనసు దోచుకున్న ఆర్తిని మనువాడ్డానికి మాత్రం పద్నాలుగేళ్లు నిరీక్షించాడు. ఆ విషయాన్ని ఆర్తి మాటల్లో వింటే మరింత ఆసక్తి. ''వీరూకి మాకూ దూరపు చుట్టరికం. కానీ దానికన్నా స్నేహానుబంధమే ఎక్కువ. బంధువుల ఇళ్లల్లో, పెళ్లి వేడుకలప్పుడు కలుసుకొనే వాళ్లం. అలా చాలా ఏళ్లు గడిచాక 2001లో అనుకుంటా... మా అన్నయ్య ఓరోజు తనని ఇంటికి భోజనానికి పిలిచాడు. వీరూ ఒక్కడే వచ్చాడు. ఆ రోజంతా నవ్వుతూ నవ్విస్తూ గడిపాడు. చాలాకాలం నుంచి తెలిసినా ఆ రోజెందుకో కొత్తగా, నా హృదయానికి దగ్గరగా ఉన్నట్లు అనిపించాడు. ఆ అనుభూతిలో ఉన్న నాకు మర్నాడు తన నుంచి ఫోన్. చాలాసేపు మాట్లాడాం. ఆ రోజు నుంచి మా మధ్య లెక్కలేనన్ని ఫోన్‌కాల్స్. గంటలు క్షణాల్లా గడిచిపోయేవి. 'పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. మంచి అమ్మాయి ఉంటే చూసిపెట్టు' అని గడుసుగా అడిగేవాడు. తప్పకుండా అనేదాన్ని. అలా కొన్నాళ్లు. ఒకరోజు 'అవును, ఎవర్నో ఎందుకు? నిన్నే చేసుకుంటా! ఏమంటావ్?' అని సూటిగా అడిగేశాడు. గలగలా నవ్వా, సరేనన్నా. ఆ తరవాతా మూడేళ్ల పాటు ఢిల్లీ రోడ్ల మీద తిరిగాం. అప్పట్లో వీరూని జనం గుర్తుపట్టేవారు కాదు. కన్నాట్‌ప్లేస్‌లో కబుర్లు. చాణక్య థియేటర్‌లో సినిమాలు. కొందరు బంధువులకి వీరూ నాతో తిరగడం నచ్చేది కాదు. అది తెలిసి 'మధ్యలో వాళ్లెవరు? నువ్వూ నేనూ ఇష్టపడ్డాం అంతే' అంటూ నిశ్చితార్థం నాడు వేలికి ఉంగరం తొడిగాడు. వీరూకి నేనంటే ప్రాణం. ఎంత బిజీగా ఉన్నా నా కోసం సమయం కేటాయిస్తాడు. ఓసారి ప్రేమికుల రోజుకి గోవా వెళ్లాం. హోటల్‌లో దిగాక నాకు జ్వరం. మందులు వేసుకుని పడుకొన్నా. సాయంత్రం కళ్లు తెరిచేసరికి నా తల దగ్గర వీరూ! ప్రేమగా ఎర్ర గులాబీ చేతికందిస్తూ. కోట్లు కుమ్మరించినా కలగని ఆనందాన్ని ఆ క్షణాల్లో పొందాను.'' ఇక ప్రత్యర్థులకు దడ పుట్టించే వీరూ ఆర్తి పేరు వినగానే ప్రణయమూర్తిగా మారిపోతాడు. 'పెళ్లికి ముందు తనకు క్రికెట్ గురించి పెద్దగా తెలియదు. సెలెబ్రిటీగా కాకుండా మనసు నచ్చిన వ్యక్తిగా నాతో స్నేహం చేసింది. తరవాత క్రికెట్ అభిమానిగా మారింది. క్రికెట్ నా వృత్తి. దాన్లో ఆటుపోట్లుంటాయి. మానసికంగా, శారీరకంగా ఒత్తిడి ఉంటుంది. పెళ్లి కాకముందు ఆ ప్రభావం అధికంగా ఉండేది. ఆర్తి అర్థాంగిగా వచ్చాక నాదైన లోకం, నాకంటూ ఆనందం, సానుకూల దృక్పథం, మాటలకందని స్థిరత్వం. మా అబ్బాయి ఆర్యవీర్ పుట్టినప్పుడు ఎంత ఆనందించానో చెప్పలేను. వాడి పుట్టిన రోజు అక్టోబరు 19. నాది ఒకరోజు ముందు. ఏటా మా ఇంట్లో ఆ రెండ్రోజులు ఘనంగా వేడుకలు జరుగుతాయి. అప్పుడు ఆర్తి చేసే హడావుడి అంతా ఇంతా కాదు' అంటాడు వీరూ. |
ఇండియాకీ... మాథ్యూ హెడెన్‌కీ ఏదో అనుబంధం. పదేళ్ల క్రితం మనదేశ పర్యటనలో వార్తల్లోకెక్కాడు. ఇక్కడాడిన మ్యాచుల్లో అనవసర వ్యాఖ్యలతో వివాదాల్లో మసిలాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఆడుతూ భారీ ఆదాయం గడిస్తున్న హెడెన్ గురించి అతడి ప్రియసఖి కెల్లీనడిగితే స్నేహం, ప్రేమ, కుటుంబ విలువలకు అతడిచ్చే ప్రాధాన్యం అర్థమవుతుంది. ''మైదానంలో దూకుడు కానీ బయట సాత్వికుడు. దైవభక్తి, పాపభీతి అధికం. కుటుంబానికి, పిల్లలకు సమయం కేటాయించాలని తపన. ఆ దిశలో నేనందించే సహకారానికి సముచిత గుర్తింపు, గౌరవం కనబరుస్తాడు. మాథ్యూతో టూర్‌కెళ్లినా, ఇంట్లో ఉన్నా ఉల్లాసమే. హోటళ్లలో బస చేసినప్పుడు నేరుగా వంట గదిలోకెళ్లి వంటవాళ్లని తప్పుకోమంటాడు. వంట బాగా వచ్చు. తనకి తెలిసినన్ని వెరైటీలు ఆడవాళ్లకీి తెలియవేమో! ఏది వండినా అమృతమే! తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని కలబోసి తెచ్చిన రెండు వంటల పుస్తకాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. అవి చదివిన వాళ్లు అతడి గొప్పతనం కన్నా, నా అదృష్టం గురించే ఎక్కువ పొగుడుతారు.'' ప్రేమతో చేరువై, వివాహ బంధంలో ఇమిడిన హెడెన్, కెల్లీలకు ముగ్గురు పిల్లలు. ఒకమ్మాయి. ఇద్దరబ్బాయిలు. ఏమాత్రం ఆటవిడుపు దొరికినా తనకిష్టమైన చేపల వేటకు సకుటుంబ సమేతంగా బయలుదేరతాడు. టెస్టు క్రికెట్ గురించి తప్పుకొన్నప్పుడు బాధపడినా దానిలో సానుకూలతను చూశాడు మాథ్యూ. ''పిల్లల పెంపకం, చదువు, స్నేహాల విషయంలో కెల్లీ కొన్నేళ్లుగా శ్రద్ధ తీసుకుంది. శ్రమ పడింది. అన్నీ నేను చూసుకుంటా, ఆటపై మనసు నిలపండి అని ఎన్నో సార్లు భరోసా ఇచ్చింది. ఆ సహకారంతోనే కెరీర్‌లో ముందుకుసాగా. ఇప్పుడీ నిర్ణయంతో ఆమెకు, పిల్లలకు సమయం కేటాయించగలను. కుటుంబ బాధ్యతల్లో పాలుపంచుకోగలను' అన్నాడు. ఎంత సంపాదించినా, జీవితంలో ఆనందం, సంతృప్తి మిగలాలంటే భాగస్వామి సహకారం కీలకం అనే మాథ్యూ ఆ విషయంలో తాను అదృష్టవంతుణ్ని అంటాడు. మెక్‌గ్రా భార్య బ్రెస్ట్ క్యాన్సర్‌తో మరణించినప్పుడు స్నేహితుడి బాధను చూసి చలించిపోయాడు. ఆస్ట్రేలియాలో అందుకు సంబంధించిన పరిశోధనలకు సాయం అందించడం ఆరంభించాడు. |
![]() పార్థివ్ పటేల్... దినేశ్ కార్తీక్... తాము మనసుపడ్డ అమ్మాయిల్నే వివాహం చేసుకున్నారు. చిన్ననాటి స్నేహం... వలపు భాగస్వామ్యంగా మారి అవ్ని జవేరి.. పార్థివ్‌కి అర్థాంగి అయింది. దినేశ్, నికిత... ఇరువురి తండ్రులు ప్రాణ స్నేహితులు. ఆ రకంగా ఏర్పడిన అభిమానం... వైవాహిక బంధంగా మారింది. |




