Monday, April 12, 2010

అమెరికా గ్యాస్‌ ప్రాజెక్టులో 40% వాటా రిలయన్స్‌కు

అట్లాస్‌ ఎనర్జీతోసంయుక్త సంస్థ
రూ.7,650 కోట్ల పెట్టుబడి
నెలాఖరు కల్లా ఒప్పందం పూర్తి
ముంబయి: అమెరికాకు చెందిన అట్లాస్‌ ఎనర్జీ ఇంక్‌తో కలసి ఒక సంయుక్త సంస్థలో 1.7 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.7,650 కోట్ల) పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తెలిపింది. అమెరికాలోని మార్సెలస్‌ ప్రాంతంలో సహజవాయువు ఉత్పత్తి కోసం ఈ సంయుక్త సంస్థ (జేవీ) పనిచేస్తుంది. పెన్‌సిల్వేనియా, వెస్ట్‌ వర్జీనియా, న్యూయార్క్‌లలో విస్తరించిన మార్సెలస్‌ షేల్‌ గ్యాస్‌ ప్రాజెక్టులో 40 శాతం ఆర్‌ఐఎల్‌ తీసుకొంటుందని, మిగిలింది అట్లాస్‌ ఆధీనంలో ఉంటుందని రిలయన్స్‌ ఒక ప్రకటనలో వివరించింది. డ్రిల్లింగ్‌కు అట్లాస్‌కు అయ్యే 1.36 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చును భరించనున్నట్లు, ముగింపులో 339 డాలర్ల నగదు చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ నెలాఖరు కల్లా ఒప్పందం పూర్తి కావచ్చంది. రానున్న పది సంవత్సరాల్లో ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ మార్సెలస్‌ ఎల్‌ఎల్‌సీ పెట్టుబడిని 3.4 బిలియన్‌ డాలర్లకు (దాదాపు రూ.15,300 కోట్లకు) పెంచే ఉద్దేశం ఉన్నట్లు ఆర్‌ఐఎల్‌ సీఎఫ్‌ఓ అలోక్‌ అగర్వాల్‌ శుక్రవారమిక్కడ విలేకరులకు చెప్పారు. దీంతో రిలయన్స్‌కు విదేశాల్లో చక్కని వ్యాపార అవకాశం లభించిందని సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ పి.ఎం.ఎస్‌. ప్రసాద్‌ అన్నారు. అమెరికాకు పదేళ్ల గ్యాస్‌ అవసరాలను తీర్చే సామర్థ్యం షేల్‌ గ్యాస్‌కు ఉందని చెప్తున్నారు. ఈ ప్రాజెక్టును నిర్వహించే బాధ్యతను అట్లాస్‌ స్వీకరిస్తుంది. ఇంత క్రితం రసాయనాల తయారీ సంస్థ లియోండెల్‌బాసెల్‌లో నియంత్రిత వాటా కొనుగోలు కోసం ఆర్‌ఐఎల్‌ చేసిన ప్రయత్నాలు ఫలించని సంగతి తెలిసిందే. కేజీ బేసిన్‌లో మరో 4 రిజర్వ్‌లు వాణిజ్య ఉత్పత్తికి వీలైనవే
కృష్ణా-గోదావరి బేసిన్‌లో ధీరుభాయ్‌-1 (డి-1), డి-3 క్షేత్రాలను ఆనుకొని ఉన్న 4 చిన్న గ్యాస్‌ రిజర్వ్‌లు వాణిజ్య సరళి ఉత్పత్తికి అనువైనవేనని ఆర్‌ఐఎల్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హైడ్రోకార్బన్స్‌ (డీజీహెచ్‌) దృష్టికి తీసుకువెళ్లింది. డీజీహెచ్‌ ఆమోదం తెలిపితే, వాటిని ఉత్పత్తికి పనికివచ్చే విధంగా అభివృద్ధి చేసేందుకు నాలుగైదు సంవత్సరాలు పట్టవచ్చు. అప్పటికి వీటిని డి-1, డి-3లకు అనుసంధానం చేస్తారు