Wednesday, March 24, 2010

సెల్ మార్కెట్లో దేశీ బుల్ పట్టుకో- పండగ చేసుకో...

ధర సగం.. ఫీచర్స్ ఫుల్
మురిపిస్తున్న దేశీ మొబైల్స్

నోకియా మొబైల్ ఫోన్స్‌లో కింగ్... ఫీచర్స్‌తో పాటు ధర కూడా అదే స్థాయిలో ఉంటుంది మరి... అవే ఫీచర్స్ గల సెట్ అందులో సగం కంటే తక్కువ ధరకు మార్కెట్లో దొరకుతుంటే (నాణ్యత అనే చాదస్తం లేకపోతే) కొనకుండా ఊరుకుంటారా జనం. మొబైల్ ఫోన్ మార్కెట్‌ను ప్రస్తుతం దేశీ బ్రాండ్స్ కుదిపేస్తున్నాయి. అతి తక్కువ రేట్లలో అన్ని ఫీచర్స్... ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆ దెబ్బకు గడగడలాడిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఈ చవకరం ఫోన్లలో చైనా మొబైల్స్‌దే హవా. మొబైల్‌లో ఐఎంఇఐ నెంబర్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయటంతో దేశీ బ్రాండ్‌ఫోన్స్‌కు ఎక్కడలేని డిమాండ్ ఏర్పడింది.

లావా, కార్బన్, పగరియా, ఇంటెక్స్, స్పైస్, ఆలివ్, మైక్రోమాక్స్ ఇలా 50 దేశీ మొబైల్ బ్రాండ్స్ సెల్‌ఫోన్ మార్కెట్‌ను ఉర్రూతలూగిస్తున్నాయి. మన రాష్ట్రానికి చెందిన అమరరాజా బ్యాటరీస్ కూడా మొబైల్ ఫోన్స్ మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. మెక్రోమాక్స్ అయితే ఎల్‌జి, సోనీ ఎరిక్సన్, మోటరోలా వంటి మల్టీనేషన్ బ్రాండ్లను పక్కకు నెట్టి మొబైల్ మార్కెట్లో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంవత్సరం జనవరిలో 10 లక్షల మొబైల్ సెట్లను విక్రయించిన మైక్రో మాక్స్ మొబైల్ మార్కెట్లో 10 శాతానికి పైగా వాటాను సొంతం చేసుకుంది.

తైవాన్ మీడియా టెక్ సంచలనం
తైవాన్ చిప్ కంపెనీ మీడియా టెక్ మొబైల్ ఫోన్ల రంగంలో సృష్టించిన సంచలనం ఇది. టీవీలు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు చిప్స్ అందించే మీడియా టెక్ మొబైల్ చిప్స్ ఉత్పత్తిలోకి ఆడుగిడటంతో మొత్తం మొబైల్ సీనే మారిపోయింది. మన దేశ మార్కెట్‌ను ముంచెత్తిన చైనా మొబైల్ ఫోన్ల చిప్స్ అన్నీ మీడియా టెక్ సమకూర్చినవే. అప్పటివరకు మొబైల్ ఫోన్స్ చిప్స్‌కోసం అంతర్జాతీయ చిప్ కంపెనీలు ఇన్ఫినియాన్, క్వాల్ కామ్ మీదనే ఆధారపడాల్సి ఉండేది. మీడియా టెక్ చిప్స్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తరువాత సీన్ మారిపోయింది.



మొబైల్ ఫోన్స్‌కు నాడీ మండలం వంటి ఈ చిప్స్‌ను బాగా తక్కువ ధరకు అందించటమే గాక బేసిక్ డిజైన్ ఎలా కావాలనుంకుంటే అలా మార్చుకునే వెసులుబాటు మీడియా టెక్ కల్పించింది. మీడియా టెక్ చిప్ తీసుకుని దానికి రకరకాల ఫీచర్స్‌ను జోడిం చేస్తున్నాయి దేశీ ఫోన్ కంపెనీలు. దీంతో చీప్ అండ్ బెస్ట్ (?) ఫోన్లు మార్కెట్లో వెల్లువలా వచ్చిపడుతున్నాయి. వాటి దెబ్బకు మల్టీనేషనల్ బ్రాండ్ గడగడలాడిపోతున్నాయి

మురిపించే మార్కెటింగ్
మీరు ఓ మంచి మొబైల్ ఫోన్ కొనుకుందామని షాప్‌కు వెళ్ళారు. నోకియా, ఎల్‌జీ లాంటీ మల్టీనేషనల్ బ్రాండ్స్ పక్కనే కళ్ళు చెదిరే డిజైన్, ఫీచర్స్‌తో దేశీ ఫోన్స్. అది కూడా అతి తక్కువ ధరకు. ఈ ఫోన్లో కూడా మీరుకోరుకునే అన్ని అల్ట్రా మోడర్న్ ఫీచర్స్ ఉన్నాయి, తే డా అల్లా ఆఫోన్ 20 వేలయితే ఇది ఐదు వేలు మాత్రమే. వెచ్చించే డబ్బుకు తగినంత విలువ- మరీ చెప్పాలంటే ఇంకా ఎక్కువిలువ - మరి మీ ఇష్టం - మార్కెటింగ్ టాక్. దీంతో మీ చెయ్యి దేశీ ఫోన్స్ మీదకే పోతుంది. మీకు చవకగా ఫోన్, షాప్ వాడికి మస్తుగా కమీషన్. నోకియా, ఎల్‌జీలాంటి కంపెనీలు మొబైల్ షాప్‌ల వాళ్లకి 3-4 శాతం కమీషన్ ఇస్తూ ఉంటాయి, దేశీ బ్రాండ్స్‌పై 10-15 శాతం కమీషన్. మీ చేతిలో బ్లాక్ బెర్రీ ఫీచర్స్‌తో మెరిసిపోయే ఫోన్ - ఆతని జేబులో దండిగా కమీషన్... అదీ విషయం.