Monday, April 12, 2010

రాజ్యసభలో 100 మంది కోటేశ్వరులు

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుల్లో కోటీశ్వరులకు కొదువేలేకుండా పోతోంది. ఇటీవల ఆయా సభ్యులు వెల్లడించిన ఆస్తుల వివరాల ప్రకారం రాజ్యసభలో దాదాపు వంద మంది కోటి రూపాయలకు పైగా ఆస్తులను కలిగి ఉన్నట్లు వెల్లడయింది. వీరందరిలో మహారాష్ట్ర నుంచి రాజ్యసభకు ఎంపికైన పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ అత్యంత ఐశ్వర్యవంతుడిగా నిలిచారు. ఈయన ప్రకటించిన స్థిర, చరాస్తుల విలువ 300 కోట్ల రూపాయలు. 278 కోట్ల రూపాయలు ఆస్తులతో రెండో స్థానంలో జనతాదళ్ (సెక్యులర్) ఎంపి ఎంఎఎం రామస్వామి (కర్నాటక), మూడో స్థానంలో టి సుబ్బరామిరెడ్డి (ఆంధ్రప్రదేశ్) నిలిచారు.

ఈయన ఆస్తుల విలువ 272 కోట్ల రూపాయలు. సమాజ్‌వాదీ పార్జీకి చెందిన జయాబచ్చన్ ఆస్తుల విలువ 215 కోట్ల రూపాయలుండగా.. మాజీ ఎస్‌పి నాయకుడు అమర్‌సింగ్ ఆస్తుల మొత్తం 79 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు ఓ ఎన్‌జిఒ సంస్థ విశ్లేషణలో తేలింది. సమాచార హక్కు కింద ఆసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్( ఎడిఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(న్యూ)లు రాజ్య సభ నుంచి ఈ వివరాలను పొందాయి.

మొత్తం మంది రాజ్యసభ సభ్యుల్లో 98 మంది ఆస్తుల విలువ కోట్ల రూపాయల్లో ఉంది. అలాగే 37 మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా కాంగ్రెస్ పార్జీ నుంచి మొత్తం 33 మంది కోటీశ్వరులుండగా.. బిజెపి నుంచి 21, సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఏడుగురున్నారు. మొత్తం 219 రాజ్యసభ సభ్యుల్లో 179 మంది గ్యాడ్యుయేట్లు, 18 మంది పన్నెండవ తరగతి, 11 మంది హైస్కూల్ విద్యను అభ్యసించగా.. మరో ఇద్దరు కేవలం రెండు నుంచి ఎనిమిదవ తరగతి వరకు మాత్రమే విద్యనభ్యసించారు.