దేశంలో వృక్ష సంపద క్రమంగా క్షీణిస్తోంది. అయితే ఇదే సమయంలో భవన నిర్మాణం, పారిశ్రామిక రంగాలు వినియోగించే చెట్ల నుంచి తయారు చేసిన దుంగలకు (టింబర్) డిమాండ్ పెరుగుతూనే ఉంది. 2005 సంవత్సరంలో మన దేశంలో 58 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉన్న టింబర్ వినియోగం 2020 నాటికి 153 మిలియన్ క్యూబిక్ మీటర్ల స్థాయికి పెరుగుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
టింబర్ కొరత ఎక్కువగా ఉంది. టింబర్ ఉత్పాదకతలో మన దేశం వెనకబడి ఉంది. దేశీయ టింబర్ ఉత్పాదకత హెక్టారుకు సంవత్సరానికి 0.7 క్యూబిక్ మీటర్లుగా ఉంది. డిమాండ్‌కు తగిన స్థాయిలో ఉత్పాదకత లేని కారణంగా ప్రత్యామ్నాయ టింబర్‌ను తయారు చేసుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయంలో పనికి రాకుండా మిగిలిన వృధాతో బోర్డులను తయారు చేయవచ్చు.
వరిగడ్డి, గోధుమ గడ్డి, వరిపొట్టు, కొబ్బరి పొట్టు, చెరకు పిప్పిని వ్యవసాయ వృధాగా పేర్కొనవచ్చు.
పార్టికల్ బోర్డుల తయారీ విధానం
వ్యవసాయ వృధాను సేకరించి, సున్నపు నీటిలో నానబెట్టి యంత్రాల ద్వారా పల్ప్‌గా తయారు చేస్తారు. తరువాత నిర్ణీత సైజుల్లోని అచ్చుల్లో పల్ప్‌ను వేసి హైడ్రాలిక్ ప్రెస్ యంత్రం ద్వారా బోర్డుగా తయారు చేస్తారు. అనంతరం డ్రయ్య ర్స్‌తో ఆరబెడతారు. నాణ్యతను పెంచేందుకు గాను ఈ బోర్డులపై వెన్నీర్ షీట్ అంటిస్తారు. అగ్నిప్రమాదాలకు తట్టుకునే విధంగా ఈ బోర్డుల తయారీలో ప్రక్రియలో కొన్ని రసాయనాలు చేరుస్తారు.
వినియోగం
పార్టికల్ బోర్డులను 12ఎంఎం, 19ఎంఎం, 25 ఎంఎం మందంతో తయారు చేయవచ్చు. వీటిని షోకేస్, పార్టీషన్స్ కోసం, రిఫ్రిజిరేటర్ పైభాగంలో, కుట్టుయంత్రాల కవర్ల తయారీ, తలుపులు, కిటికీల చెక్కలు, సినిమా హాళ్ల సీలింగ్ కోసం వినియోగిస్తారు.
మార్కెట్ అవకాశాలు
మన దేశంలోని కృత్రిమ చెక్క (ఆర్టిఫిషల్ వుడ్) వినియోగంలో పార్టికల్ బోర్డుల వాటా 6 శాతంగా ఉంది. పరిశ్రమ వర్గాల ప్రకారం 2009 సంవత్సరంలో పార్టికల్ బోర్డుల ఉత్పత్తి 2.20 లక్షల క్యూబిక్ మీటర్లుగా ఉంది. 2020 నాటికి దీని ఉత్పత్తి 3.50 లక్షల క్యూబిక్ మీటర్లకు చేరుతుందని అంచనా. కాగా ఈ ఉత్పత్తులను అమెరికా, యూరోపియన్ యూనియన్, ఇంగ్లాండ్, యుఎఇ, సౌదీ అరేబియా వంటి దేశాలకు ఎగుమతి చేయవచ్చు. మన దేశంలో ఫ్రైవుడ్, బోర్డులు, వెన్నీర్ వంటికృత్రియ టింబర్లతో పోల్చితే పార్టికల్ బోర్డుల వినియోగం ప్రతి సంవత్సరం 40 శాతం వృద్ధి చెందుతోంది.