పాల్సన్ అండ్ కో తో కుమ్మక్కు
గోల్డ్‌మన్ శాచ్‌పై సెక్ కేసు
వాల్‌స్ట్రీట్ హడల్...
అమెరికన్ మార్కెట్ మరోసారి ప్రపంచ మార్కెట్లను సంక్షుభితం చేసే దిశగా పయనం సాగిస్తోంది. అంతర్జాతీయ తిరోగమనం ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయని భావిస్తున్న ప్రపంచ దేశాల మార్కెట్లు గత శుక్రవారం నాటి పరిణామాల వల్ల మరోసారి ఆటుపోట్లను ఎదుర్కొంటున్నాయి. వరుసగా కొన్ని వారాల నుంచి సాగిస్తున్న ఊర్థ్వముఖ పయనానికి అన్ని మార్కెట్లు తెర దించాయి. అమెరికాలోని అతి పెద్ద ఆర్థిక కంపెనీల్లో ఒకటైన గోల్డ్‌మన్ శాచ్‌పై ఆ దేశానికి చెందిన మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజి కమిషన్ (సెక్) శుక్రవారం కేసు దాఖలు చేయడం వారాంతంలో వాల్‌స్ట్రీట్ పతనానికి, ఇతర మార్కెట్ల పతనానికి దారి తీసింది.
భారత స్టాక్‌మార్కెట్ కూడా తొమ్మిది వారాలుగా సాగిస్తున్న ర్యాలీకి తెర దించినప్పటికీ శుక్రవారం పొద్దు పోయిన తర్వాత వెలువడిన ఈ వార్త ప్రభావానికి ఇంకా లోను కాలేదు. కాని సోమవారం మార్కెట్ బలహీనంగా ప్రారంభం కావడానికి ఈ పరిణామం దారి తీయవచ్చునని విశ్లేషకులంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయి వాల్‌స్ట్రీట్ భారీ పతనానికి దారి తీసిన రెండు సంవత్సరాల తర్వాత ఒక ప్రధాన ఆర్థిక సంస్థపై సెక్ ఫ్రాడ్ కేసు దాఖలు చేయడం విశేషం.
అసలేం జరిగింది?
కొల్లేటరలైజ్డ్ డెట్ ఆబ్లిగేషన్‌గా (సిడిఒ) వ్యవహరించే తనఖా నిధుల విషయంలో వాస్తవాలను ఇన్వెస్టర్లకు వెల్లడించకుండా గోల్డ్‌మాన్ శాచ్ సంస్థ మోసానికి పాల్పడిందన్నది సెక్ దాఖలు చేసిన కేసులో ప్రధాన అభియోగం. తమ వ్యాపార వైరుధ్యాల గురించిన వాస్తవాలు బహిర్గతం చేయకుండానే గోల్డ్‌మన్ శాచ్ కంపెనీ విదేశీ బ్యాంకులు, పింఛన్ ఫండ్‌లు, బీమా కంపెనీలకు బాండ్లను విక్రయించిందని సెక్ ఆరోపించింది. ప్రపంచంలో అతి పెద్ద హెడ్జ్ ఫండ్ అయిన పాల్సన్ అండ్ కో తాను ఎంపిక చేసిన తనఖా ఆధారిత సెక్యూరిటీల్లో స్పెక్యులేషన్ ఆధారంగా పొజిషన్లు తీసుకోవడానికి గోల్డ్‌మన్‌కు 1.5 కోట్ల డాలర్ల మేరకు నిధులు సమకూర్చిందని సెక్ అభియోగ పత్రం చెబుతోంది.
హౌజింగ్ మార్కెట్‌లో బెట్ చేయడానికి బ్యాంకు, దాని క్లయింట్ల కోసం గోల్డ్‌మాన్ సంస్థ 25 వరకు ఇన్వెస్ట్‌మెంట్ వెహికల్స్‌కు రూపకల్పన చేయగా అందులో అబాకస్ 2007-ఎసి1 పేరుతో రూపొందించిన వెహికల్ ఈ కేసులో ప్రధాన భూమిక పోషించింది. 2007లో ఏర్పడిన మార్గేజ్ ఆధారిత మార్కెట్ పతనం సమయంలోనే ఈ లావాదేవీ కూడా చోటు చేసుకుంది. దీని వల్ల ఇన్వెస్టర్లకు చేకూరిన నష్టం 100 కోట్ల డాలర్ల వరకు ఉంటుందని అంచనా.
ఈ డీల్‌లో అంతర్గత రిస్క్ ఉంటుందని ముందుగానే తెలిసిన పాల్సన్ ఈ డీల్‌ను ఇన్సూర్ చేయడంతో దీనితో ముడిపడి ఉన్న సెక్యూరిటీలన్నీ భారీగా పతనం అయినప్పటికీ 370 కోట్ల డాలర్ల లాభాలు రాబట్టుకోగలిగిందని గణాంకాలు చెబుతున్నట్టు సెక్ పేర్కొంది. ఇన్వెస్టర్లకు ఈ ఆఫరింగ్ ఇచ్చింది గోల్డ్‌మన్ శాచ్ గనుక ఆ కంపెనీ పైనే కేసు దాఖలు చేశామని, పాల్సన్‌పై కేసు దాఖలు చేయలేదని సెక్ వివరణ ఇచ్చింది. గోల్డ్‌మన్‌పై సెక్ కేసు దాఖలు చేసిందన్న వార్త వ్యాపించడంతో ఆ షేరు శుక్రవారం 13 శాతం మేరకు పతనమై వెయ్యి కోట్ల డాలర్ల మేరకు మార్కెట్ విలువ తుడిచిపెట్టుకుపోయింది.
డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఇండెక్స్ ఆరు రోజుల దూకుడుకు తెర దించి 125.91 పాయింట్లు పతనమైంది. అమెరికా ఆర్థిక సంస్థల్లో అవకతవకలపై దాఖలైన లా సూట్లలో ఇది మొదటిది మాత్రమేనని, ఇక ముందు ఇలాంటి లా సూట్లు మరిన్ని దాఖలయ్యే అవకాశం ఉన్నదని పరిశీలకులంటున్నారు. ఇలాంటి లావాదేవీలకు పాల్పడిన కంపెనీలు అనేకం ఉన్నాయని, అవన్నీ కూడా కాలక్రమంలో బయటపడక తప్పదని నార్ట్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జేమ్స్ హాక్నీ వ్యాఖ్యానించారు. ఇలాంటి సిడిఒలు జారీ చేసిన ఆర్థిక సంస్థలు లేదా బ్యాంకుల్లో డాయిష్ బ్యాంక్, మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, మెరిల్ లించ్, సిటి గ్రూప్ కూడా ఉన్నాయంటున్నారు.
మేం తప్పు చేయలేదు
తాము ఏ పోర్ట్‌ఫోలియోను పెట్టుబడికి నష్టం ఏర్పడే విధంగా రూపొందించలేదని గోల్డ్‌మన్ శాచ్ వివరణ ఇచ్చింది. ఇన్వెస్టర్లకు వ్యాపార వైరుధ్యాలకు సంబంధించిన సమాచారం అందించకుండా మోసగించిందన్న అభియోగాలపై సెక్ కేసు దాఖలు చేసిన నేపథ్యంలో వివరణ ఇస్తూ తమపై మోపిన అభియోగానికి ఆధారాలు లేవని పేర్కొంది. ఒకే ఒక్క లావాదేవీ ఆధారంగా ఇలాంటి కేసు దాఖలు చేయడం పట్ల ఆసంతృప్తి ప్రకటిస్తూ ఈ డీల్‌లో తాను కూడా 9 కోట్ల డాలర్లకు పైగా నష్టపోయినట్టు తెలిపింది.
అడకత్తెరలో పోక...
మంగళవారం ఆర్‌బిఐ ప్రకటించనున్న క్రెడిట్ పాలసీ ఒక పక్క, సెక్యూరిటీ సంబంధిత వ్యవహారాల్లో గోల్డ్‌మాన్ శాచ్‌పై సెక్ దాఖలు చేసిన కేసు మరో పక్క భారత మార్కెట్‌కు ఈ వారం గ్రహణంగా నిలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏర్పడిన పరిణామాల వల్ల వాల్‌స్ట్రీట్‌లో ఏర్పడిన పతనం ప్రభావం సోమవారం మార్కెట్‌పై పడి బలహీనంగా ప్రారంభం కావచ్చునని మార్కెట్ పండితులంటున్నారు.
సోమవారం మార్కెట్ బలహీనం గా ప్రారంభమై అంతర్జాతీయ సంకేతాల కోసం ఎదురు చూస్తూ సైడ్‌వేస్‌లోనే కొనసాగవచ్చునన్నది సిఎన్ఐ రీసెర్చ్ ఎండి కిశోర్.పి.ఓస్వాల్ అభిప్రాయం. వడ్డీరేట్లతో నేరుగా సంబంధం ఉన్న బ్యాంకింగ్, రియాల్టీ, ఆటో రంగాలపై ఈ వారం ఒక కన్నేసి ఉంచాలి. ఆర్‌బిఐ క్రెడిట్ పాలసీలో కీలక రేట్లను ఏ మాత్రం పెంచినా ఈ రంగాలకు చెందిన షేర్లు పతనం అవుతాయి.