Thursday, April 15, 2010

సిమెంట్ బస్తా రూ. 10 పెంపు

హైదరాబాద్‌లో నేటి నుంచి
రెండు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా

సిమెంట్ ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గురువారం నుంచి జంటనగరాల మార్కెట్‌లో బస్తా సిమెంట్ ధర 10 రూపాయల మేర పెరుగుతున్నది. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రధాన మార్కెట్లలోనూ సిమెంట్ ధరను ఇదే స్థాయిలో పెంచనున్నట్లు తెలిసింది. ప్రస్తుతం జంటనగరాల్లో రిటైల్ మార్కెట్‌లో బస్తా సిమెంట్ ధర 220-225 రూపాయలు ఉంది.

విజయవాడలో కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉండగా వైజాగ్‌లో మాత్రం 245 రూపాయల వరకు ఉంది. పెరిగే ధరతో హైదరాబాద్ మార్కెట్‌లోనే బస్తా సిమెంట్ ధర 235 రూపాయల స్థాయికి చేరుతుంది. ఆరు నెలల క్రితం 130-140 రూపాయల కనిష్ఠ స్థాయిలో ఉన్న సిమెంట్ ధరలు గత మూడు నెలలుగా అనూహ్యంగా పెరుగుతున్నాయి.

ధరల పెరుగుదలకు డిమాండ్ ప్రధానకారణంగా పరిశ్రమవర్గాలు సమర్థించుకుంటున్నప్పటికీ, పరిశ్రమ అంతా మూడు నాలుగు సంస్థల చేతుల్లో కేంద్రీకృతం కావడం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డిమాండ్‌కు సంబంధించి పరిశ్రమవర్గాలు చెబుతున్న కథనంలోనూ వాస్తవం ఉంది. రియల్టీ స్తబ్దంగా ఉందని చెబుతున్నప్పటికీ మార్చిలో రాష్ట్రంలో సిమెంట్ వినియోగం రికార్డు స్థాయిలో 24 లక్షల టన్నులకు చేరింది. గత పదేళ్ల కాలంలో మార్చి నెలలో ఈ స్థాయి వినియోగం ఎప్పుడూ లేదని పరిశ్రమవర్గాలు అంటున్నాయి.

గత డిసెంబర్ నుంచీ సిమెంట్ వినియోగంలో వృద్ధి స్థిరంగా కనిపిస్తున్నది. ఇదిలా ఉండగా ఇరిగేషన్, రహదారుల ప్రాజెక్టుల్లో కదలికలు కనిపిస్తున్న కారణంగా వినియోగంలో వృద్ధి మరింత ఉంటుందని పరిశ్రమవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర మార్కెట్‌లో త్వరలోనే బస్తా సిమెంట్ ధర బూమ్ టైమ్ గరిష్ఠ స్థాయి 250 రూపాయలను దాటే అవకాశం ఉందని పరిశ్రమవర్గాలు చెబుతున్నాయి.