Thursday, April 15, 2010

ఇద్దరు రెగ్యులేటర్ల మీద మూడో పెద్ద యులిప్‌ల పేచీకి ప్రణాళికా సంఘం సూచన

న్యూఢిల్లీ : యులిప్‌లపై రెగ్యులేటర్ల మధ్య ఏర్పడిన వివాదం ఏ రోజుకారోజు మరింత ముదురుతోంది. నియంత్రణ సంస్థల మధ్య ఏర్పడే ఇలాంటి వివాదాల పరిష్కారానికి ఎఫ్‌డిఎస్‌సి పేరిట ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రణాళికా సంఘం సూచిస్తుండగా యులిప్‌లపై ఎవరిది ఆధిపత్యం అన్న అంశం కోర్టులోనే తేల్చుకోవాలని ప్రభుత్వం రెగ్యులేటర్లకు సూచించింది.


మరోపక్క యులిప్‌ల విషయంలో సెబి తాజాగా జారీ చేసిన ఆదేశాలను కూడా లక్ష్యపెట్టవద్దంటూ ఐఆర్‌డిఏ బీమా కంపెనీలకు తాజాగా సూచించగా తాము ఐఆర్‌డిఏ ఆదేశాలకే కట్టుబడతామని లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ సూచించింది.

యులిప్‌లు ఎవరి నియంత్రణ పరిధిలోకి వస్తాయి, ఎవరి మాట చెల్లుబాటవుతుందన్న విషయంలో సెబి, ఐఆర్‌డిఏల మధ్య వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడే ఇలాంటి వివాదాలను పరిష్కరించడానికి ఫైనాన్షియల్ డెవలప్‌మెంట్ అండ్ స్టెబిలిటీ కౌన్సిల్ (ఎఫ్ఎస్‌డిసి) త్వరగా ఏర్పాటు చేయాలని ప్రణాళికా సంఘం సూచించింది.

బుధవారం న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లూవాలియా విలేకరులతో మాట్లాడుతూప్రపంచవ్యాప్తంగా రెగ్యులేటర్ల మధ్య ఇలాంటి వివాదాలు ఏర్పడడం సాధారణమేనని అన్నారు.

ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ వ్యవస్థలు కాలానుగుణంగా వస్తున్న మార్పులకు దీటుగా భిన్న సమయాల్లో ఏర్పాటైనవి కావడం వల్ల నియంత్రణాపరమైన అంశాల్లో వివాదాలు ఏర్పడడం సహజమని మాంటెక్ సింగ్ అన్నారు.

రెగ్యులేటరీ సంస్థల మధ్య సమన్వయసాధనకు ఇలాంటి వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేస్తామని ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించారు. సెబి, ఐఆర్‌డిఏల మధ్య ఏర్పడిన వివాదం నేపథ్యంలో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన నియమనిబంధనలను త్వరితంగా రూపొందించాలని ప్రణాళికా సంఘం భావిస్తోంది.

కోర్టులో తేల్చుకోండి
దేశంలోని అత్యంత కీలకమైన నియంత్రణ వ్యవస్థల మధ్య ఏర్పడిన వివాదం పట్ల కలత చెందిన ప్రభుత్వం యులిప్‌లు ఎవరి నియంత్రణ పరిధిలోకి వస్తాయన్న అంశాన్ని సత్వరం కోర్టులోనే తేల్చుకోవాలని సెబి, ఐఆర్‌డిఏలకు సూచించింది.

ఇదిలా ఉండగా బీమా కంపెనీలు ఏప్రిల్ 9 కన్నా ముందే ప్రారంభించిన యులిప్‌లను యథాతథంగా కొనసాగించుకోవచ్చునని, కాని తాజా యులిప్‌లు జారీ చేయవద్దని సెబి జారీ చేసిన ఆదేశంలో ఎలాంటి తప్పు ఉన్నట్టు తాను భావించడంలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ చావ్లా అన్నారు.

యులిప్‌ల విషయంలో యథాపూర్వ స్థితిని కొనసాగించాలన్న ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆదేశం సెబి ఆదేశాలకు ముందు అమలులో ఉన్న యులిప్‌లకు మాత్రమే వర్తిస్తుంది గనుక కొత్తగా యులిప్‌లు ప్రారంభించవద్దన్న సెబి ఆదేశం ఆర్థికమంత్రి ఆదేశాలకు ఉల్లంఘనీయం ఏమీ కాదని ఆయన పేర్కొన్నారు.

తాజా ఆదేశాలు కూడా బేఖాతరు
ఏప్రిల్ తొమ్మిదో తేదీకి ముందు ప్రారంభించిన యులిప్ స్కీమ్‌లు కొనసాగించుకోవచ్చునని, కొత్త స్కీమ్‌లు మాత్రం జారీ చేయవద్దని బుధవారం బీమా కంపెనీలకు సెబి జారీ చేసిన ఆదేశాన్ని కూడా ఖాతరు చేయవద్దంటూ ఐఆర్‌డిఏ తాజా ఆదేశాలు జారీ చేసింది.

యులిప్‌ల విషయంలో బీమా కంపెనీలకు ఇచ్చిన ఆదేశంపై మరింత వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు ఇచ్చిన ఆదేశమే అన్నింటికీ వర్తిస్తుంది అని ఐఆర్‌డిఏ చైర్మన్ జంధ్యాల హరినారాయణ పిటిఐకి చెప్పారు.

ఐఆర్‌డిఏ ఆదేశాలకే కట్టుబడతాం
యులిప్‌ల విషయంలో తాము ఐఆర్‌డిఏ ఆదేశాలకే కట్టుబడతామని జీవితబీమా కంపెనీల సంఘం లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ స్పష్టం చేసింది. సెబి ఆదేశాలను తాము ఐఆర్‌డిఏకే నివేదిస్తున్నామని, అందువల్ల ఐఆర్‌డిఏ ఏమి చెబితే అదే తమకు శిరోధార్యమని కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి ఎస్.బి.మాధుర్ అన్నారు.