Thursday, April 15, 2010

ఒక్క రొయ్య రూ.5,000!

హాంకాంగ్‌ మార్కెట్‌లో హాట్‌కేకు
ఏటా రూ.72 కోట్ల ఎగుమతులు
కన్యాకుమారి నుంచి న్యూస్‌టుడే ప్రత్యేక ప్రతినిధి
రొయ్య పేరు చెబితే లొట్టలు వేయని మాంసాహార ప్రియులు ఉండరు. మనకు తెలిసిన రొయ్యలు మహా అయితే ఆరు అంగుళాల పొడవు ఉంటాయేమో..! మీసంతో కలిపి సుమారు మూడుఅడుగుల పొడవు, రెండు నుంచి నాలుగు కిలోల బరువు ఉన్న రొయ్యను ఎప్పుడైనా చూశారా? చూడకపోతే తమిళనాడులోని కన్యాకుమారికో, కేరళలోని విళింజంకో వెళ్లాల్సిందే. ప్రఖ్యాత పర్యాటక ప్రదేశం కన్యాకుమారి 'రాక్‌ లాబ్‌స్టర్స్‌'గా పిలిచే భారీ సైజు రొయ్యలకూ ప్రసిద్ధే. వాటి ధర చెబితే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు. స్థానిక మార్కెట్‌లోనే కిలో రూ.2500 వరకు పలుకుతుంది. అంటే సగటున రెండు కిలోల బరువున్న లాబ్‌స్టర్‌ ధర రూ.5 వేలన్న మాట. వీటిపై ఏటా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. జపాన్‌, హాంకాంగ్‌ వంటి ప్రాంతాలకు ఎగుమతవుతున్నాయి. ఈ ల్యాబ్‌స్టర్స్‌ని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్‌ఆర్‌ఐ) వాణిజ్య ప్రాతిపదికన కేజ్‌ కల్చర్‌ ద్వారా పెంచుతోంది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ (ఎన్‌ఎఫ్‌డీబీ) ప్రైవేటు వ్యక్తుల్నీ ప్రోత్సహిస్తోంది. ఈ లాబ్‌స్టర్స్‌ కథ ఆద్యంతం ఆసక్తిదాయకమే..!

రాక్‌ లాబ్‌స్టర్స్‌కే గిరాకీ ఎక్కువ..!
మన దేశం నుంచి ఏటా రూ.72 కోట్ల విలువైన సుమారు 250 టన్నుల లాబ్‌స్టర్లు ఎగుమతి అవుతున్నాయి. వీటిలో రాక్‌, శాండ్‌, స్పినీ అనే రకాలున్నా వీటిలో రాక్‌ లాబ్‌స్టర్స్‌కే గిరాకీ ఎక్కువ. వాటి రుచి అంటే విదేశీయులు పడిచస్తారు. కన్యాకుమారి, మండపం, కేరళలోని విళింజం వంటి తీర ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువ దొరుకుతాయి. తీరం నుంచి 3 కి.మీ. దూరం వరకు సముద్రంలో ఉండే రాళ్ల చుట్టూనే ఉంటాయి కాబట్టే వీటికి రాక్‌ లాబ్‌స్టర్స్‌ అనే పేరు వచ్చింది. ఇవి రాళ్ల చుట్టూ ఉంటాయి కాబట్టి రొయ్యల్లా ట్రాలింగ్‌ చేసి మొత్తం ఊడ్చి పట్టేయడం సాధ్యపడదు. వేరే చేపల కోసం వేసిన వలల్లో ఇవి పడుతూ ఉంటాయి. సెప్టెంబరు-జనవరి మధ్య ఎక్కువగా లభించే వీటిని పట్టుకునేందుకు మత్స్యకారులు కొన్ని ప్రత్యేక పద్ధతులు అవలంబిస్తారు. ఇబ్బడిముబ్బడిగా పట్టేయకుండా వీటి పరిరక్షణకు అక్కడి ప్రభుత్వాలు చట్టాలూ చేశాయి. 100 గ్రాముల కంటే తక్కువ బరువున్న ల్యాబ్‌స్టర్స్‌ను పట్టడం శిక్షార్హమైన నేరం. సహజంగా ఇవి మూడు నుంచి ఐదు కిలోల వరకు బరువు పెరుగుతాయి.

బతికుండగానే ఎగుమతి
లాబ్‌స్టర్స్‌కి అంతర్జాతీయ మార్కెట్‌లో బతికుంటేనే డిమాండ్‌. అదీ మీసంతో సహా ఎగుమతి చేయాల్సిందే. కాబట్టి బతికున్న లాబ్‌స్టర్స్‌నే ఎగుమతి చేసేందుకు ఆసక్తికరమైన విధానం అనుసరిస్తున్నారు. కన్యాకుమారి, ట్యుటికోరిన్‌ వంటి ప్రాంతాల్లో సుమారు 20 వరకు లాబ్‌స్టర్‌ ఎగుమతి యూనిట్లు ఉన్నాయి. కనీసం 300 గ్రాముల బరువుంటేనే లాబ్‌స్టర్స్‌ని ఎగుమతిదారులు కొంటున్నారు. వాటికి ఆక్సిజన్‌ పెట్టి నీటి తొట్టెల్లో ఉంచుతున్నారు. ఎగుమతి చేయాలనుకున్నప్పుడు 14-15 సెల్సియస్‌ ఉష్ణోగ్రత కలిగిన చల్లని నీటిలో ఐదారు నిమిషాలు ఉంచుతారు. దాంతో లాబ్‌స్టర్‌ అపస్మారక స్థితికి వెళ్లిపోతుంది. అదే స్థితిలో 20 గంటల వరకు ఉంటుంది. దాన్ని పేపర్‌లో చుట్టి, థర్మోకోల్‌ పెట్టెల్లో ఉంచిత్రివేండ్రం నుంచి హాంకాంగ్‌కి విమానంలో పంపిస్తున్నారు. గమ్యం చేరాక నీటిలో వేస్తే మళ్లీ చురుగ్గా అయిపోతాయి. కస్టమర్లు హోటల్‌కి వచ్చి గాజు తొట్టెల్లో తిరుగుతున్న లాబ్‌స్టర్లలో నచ్చినదాన్ని ఎంచుకుంటే వండిపెడతారన్న మాట!

వాణిజ్య ప్రాతిపదికన..
రాక్‌ లాబ్‌స్టర్స్‌ని రొయ్యల్లా చెరువుల్లో పెంచడం సాధ్యం కాదు. అందుకే సీఎంఎఫ్‌ఆర్‌ఐ కేజ్‌ కల్చర్‌ను ఎంచుకుంది. స్థానిక ఎగుమతి యూనిట్ల నుంచి, మత్స్యకారుల నుంచీ ఎగుమతికి పనికిరాని, 100 గ్రాముల కంటే తక్కువ పరిమాణంలో ఉన్న లాబ్‌స్టర్స్‌ పిల్లలను కిలో రూ.150-270 చెల్లించి కొనుగోలు చేస్తోంది. వాటిని కేజ్‌ల్లో ఉంచి 4-5 నెలలు పెంచుతోంది. కేజ్‌లో రోజుకు ఒక గ్రాము చొప్పున పెరుగుతాయి. ఒక్కో కేజ్‌లో 3 వేల పిల్లల వరకు వేసి 250-300 గ్రాముల బరువు పెరిగాక విక్రయిస్తోంది. నాలుగైదు నెలల్లో ఒక్కో కేజ్‌లో 700-800 కిలోల లాబ్‌స్టర్స్‌ వస్తున్నాయని సీఎంఎఫ్‌ఆర్‌ఐ కన్యాకుమారి కేంద్రం సైంటిస్ట్‌ ఇన్‌ఛార్జి ఎ.పి.లిప్టన్‌ తెలిపారు. కిలో ధర కనీసం రూ.వెయ్యి వేసుకున్నా ఏడు ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం వస్తుందని, ఏటా రెండు పంటలు వేయవచ్చునని తెలిపారు. దీని వల్ల లాబ్‌స్టర్స్‌ పిల్లల్ని చంపకుండా పరిరక్షించే అవకాశం కలుగుతుందని, 200 గ్రాముల సైజు దాటిన తర్వాత అవి కేజ్‌ల్లో గుడ్లు కూడా పెడతాయి కాబట్టి వాటి సంతతి పెరిగేందుకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు. సీఎంఎఫ్‌ఆర్‌ఐకి తోడు ఎన్‌ఎఫ్‌డీబీ సహకారంతో స్థానిక మత్స్యకారులు కొత్తగా రెండు కేజ్‌లు ఏర్పాటు చేస్తున్నారని, భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నామని ఆయన వెల్లడించారు.